మహాకూటమి కథ ముగిసినట్లేనా..!

mahakutami may end

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎప్పుడూ చూడని రాజకీయ చిత్రాన్ని ప్రజలు చూశారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిన, వ్యతిరేకంగానే మూడు దశాబ్దాలుగా కొనసాగిన తెలుగుదేశం పార్టీ అదే పార్టీతో పొత్తు పెట్టుకుంది. ఇక వీరికి టీజేఎస్, సీపీఐ కూడా తోడై మహాకూటమిగా ఏర్పాడి పోటీ చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల వేళ మహాకూటమి పేరిట తెగ హడావుడి నడిచింది. అనేక చర్చలు, సమావేశాలు, ప్రెస్ మీట్లు వంటివన్నీ జరిగాయి. ఎన్నికల ప్రచారం కూడా ఉమ్మడిగానే జరిగింది. అయితే, మహాకూటమి ఆశించిన ఫలితాలు రాలేదు సరికదా జీర్ణించుకోలేని దారుణ ఫలితాలు వచ్చాయి. దీంతో మహాకూటమి కొనసాగుతుందా..? కథ ముగిసినట్లేనా అనే చర్చ జరుగుతోంది. మరో మూడు నాలుగు నెలల్లో పార్లమెంటు ఎన్నికలు జరగనున్నందున అసలు కూటమి కొనసాగుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, కేసీఆర్ కి వ్యతిరేకంగా ఉమ్మడిగా పోరాటం చేసే అవకాశం మాత్రం ఉన్నట్లు కనిపిస్తోంది. పంచాయితీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు తగ్గించడంపై కూటమి పార్టీలు ఒక్కతాటిపైకి వచ్చిన విషయం తెలిసిందే.

ఫలితాలు తారుమారవడంతో…

మహాకూటమి ఏర్పాటు సమయంలో ప్రజల నుంచి మంచి స్పందనే వచ్చింది. కూటమి ఏర్పాటుతో ఓ దశలో టీఆర్ఎస్ ఓడిపోతుందన్నట్లుగా సీన్ నడిచింది. అయితే, సీట్ల పంపకాలను త్వరగా తేల్చుకోలేకపోవడం, అలకలు, బుజ్జగింపులు, కోదండరాం వంటి నేతకే సీటు దక్కకపోవడం వంటి పరిణామాలతో ప్రజల్లో కూటమికి ఆదరణ దక్కలేదు. టీఆర్ఎస్… కూటమిలోని ఈ లొల్లిని ప్రజల్లోకి తీసుకెళ్లగలిగింది. మొత్తానికి ఎన్నికలు ముగిసి కూటమి దారుణంగా ఓడిపోయింది. అయితే, ఎన్నికల ఫలితాలు వచ్చి నెల రోజులు గడిచినా ఇంకా ఉమ్మడిగా ఓటమికి గల కారణాలను సమీక్షించుకోకపోవడంతో కూటమి కొనసాగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ మాత్రం పార్టీలోనే ఓటమిపై సమీక్ష జరుపుకున్నారు. అయితే, ఇందులో పొత్తులే పుట్టి ముంచాయని పలువురు సీనియర్ నాయకులు సైతం వాపోయారు. దీంతో పార్లమెంటు ఎన్నికల్లో మహాకూటమి కొనసాగడం కష్టమే అంటున్నారు.

అందరూ వద్దంటే ఇక కలిసేదెలా..?

ముఖ్యంగా, తెలంగాణ జన సమితిని బలోపేతం చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్న కోదండరాం పొత్తుల వల్ల తామే ఎక్కువగా నష్టపోయామనే భావనలో ఉన్నారు. ఇక, తెలుగుదేశం పార్టీ సైతం ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోకపోవడమే మేలనే భావనలో ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే, ఏపీ పొత్తు పెట్టుకోకుండా ఇక్కడ పొత్తు పెట్టుకోవడానికి తెలంగాణ కాంగ్రెస్ నేతలు అంగీకరించే అవకాశాలు తక్కువే. ఇప్పటికే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, డీకే అరుణ వంటి నేతలు ఓటమికి చంద్రబాబు కూడా కారణమే అన్నట్లు వ్యాఖ్యలు చేశారు. సీపీఐ కూడా ఇటువంటి వైఖరితోనే ఉంది. బీఎల్ఎఫ్ ప్రయోగం చేసి విఫలమైన సీపీఎం… మళ్లీ కమ్యూనిస్టులు కలిసే ఉండాలనే ఆలోచన చేస్తోంది. అదే జరిగితే సీపీఐ, సీపీఎం కలిసే అవకాశం ఉంది. అన్నింటికన్నా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలోనే కొందరు సీనియర్ నేతలే పొత్తులకు వ్యతిరేకంగా ఉన్నారు. దీంతో మహాకూటమి కథ ముగిసినట్లే అన్న విశ్లేషణలు ఉన్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*