మామ వ‌ర్సెస్ కోడలు.. టికెట్ ఎవ‌రికో…?

ఎన్నిక‌లు స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్దీ తెలంగాణ రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేకు ఎర్త్ పెట్టేందుకు పార్టీలోని మ‌రికొంద‌రు నేత‌లు ఎర్త్ పెడుతుండ‌టంతో జిల్లాల్లో వాతావ‌ర‌ణం హీటెక్కుతోంది. ఇప్పుడు ఒక ఎమ్మెల్యేకి సొంత పార్టీలోనే కాదు సొంత‌ ఇంటిలోనే పోటీ నెల‌కొంది. స్వ‌యానా సొంత కోడలే ఆయ‌న ఎమ్మెల్యే సీటుకు పోటీప‌డుతున్నారు. ఇద్ద‌రిలో ఎవ‌రికి టికెట్ ఇస్తారో తెలియ‌క‌.. పార్టీ శ్రేణుల్లో గంద‌ర‌గోళం నెల‌కొంద‌ట‌.

తీగలకు ఎర్త్ పెట్టేది…..

ఇప్పటికే మూడు గ్రూపులు, ఆరు వర్గాలుగా చీలిపోయిన పార్టీలో కొత్త పవర్‌ సెంటర్‌ ఏర్పడడంతో నేత‌ల్లో ఆందోళన మొద‌లైంద‌ట‌. మామ ఆదేశిస్తే వచ్చే ఎన్నికల్లో బరిలో దిగుతానని ఆమె స్పష్టం చేస్తుండడం.. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుండడం గులాబీ శ్రేణులను అయోమయంలో పడేస్తోందట‌. గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లోని మహేశ్వరం నియోజకవర్గం నుంచి 2014 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరఫున విజయం సాధించిన తీగల కృష్ణారెడ్డి టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి సేవలందించిన తమను కాదని తీగలకు ప్రాధాన్యం పెరగడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు టీఆర్ఎస్ నాయ‌కులు.

తీగల చేరికను వ్యతిరేకించి…..

గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా బరిలో దిగిన కొత్త మనోహర్‌రెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జి కప్పాటి పాండురంగారెడ్డి తీగల చేరికను బాహాటంగానే వ్యతిరేకించారు. విభేదాలు త‌గ్గించేందుకు కప్పాటిని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ పదవితో సంతృప్తిపరిచే ప్రయత్నం చేసింది. గ్రూపులకు ఫుల్‌స్టాప్‌ పడిందని హైకమాండ్‌ భావిస్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం ఎవరికివారుగానే వ్యవహరిస్తున్నారు. 2019 ఎన్నికల్లో తీగల అభ్యర్థిత్వాన్ని పరిశీలించకపోతే తమకు న్యాయం జరుగుతుందనే భరోసా ఇద్దరిలోనూ ఉంది.

తన మనసులో మాటను……

ఇదిలా ఉంటే ఎమ్మెల్యే కృష్ణారెడ్డికి సొంత కోడలు అనితారెడ్డి నుంచే తీవ్ర పోటీ ఎదురవుతున్నట్లు అధికార పార్టీలో ప్రచారం జరుగుతోంది. వయోభారం దృష్ట్యా మామకు టికెట్‌ నిరాకరిస్తే తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలనే అంశాన్ని ఆమె అంతర్గతంగా తెర మీదకు తెస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీచేయాలనే మనసులోని మాటను మామతో అనితారెడ్డి ఇప్పటికే వెల్లడించారని, ఆయన మాత్రం సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. మరోవైపు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ సారి మహేశ్వరం నుంచి పోటీచేయాలని నిర్ణయించుకున్నారు. గత ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న ఆమె 2019 ఎన్నికల్లో బరిలో దిగడం ఖాయమని స్పష్టం చేస్తున్నారు.

సబితను ఢీకొనాలంటే……

ఈ పరిణామాన్ని కూడా అనితారెడ్డి ఉపయోగించుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. సబితను ఢీకొనడం మహిళగా తనకు కలిసివస్తుందని అంచ‌నా వేస్తున్నార‌ట‌. అనితారెడ్డి తీగల(ఆర్ట్‌) ఫౌండేషన్‌ పేరిట అనితారెడ్డి సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాలు, శస్త్రచికిత్సలు, మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్‌ శిక్షణ ఇప్పించి వారి స్వయం ఉపాధి పెంపొందించేందుకు దోహదపడే కార్యక్రమాలు చేపడుతూ ప్రజలకు చేరువవుతున్నారు. పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో మామ కృష్ణారెడ్డితోపాటు పాల్గొంటూ పార్టీపై పట్టు సాధించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో త్వరగా అభ్యర్థిత్వంపై స్పష్టమైన ప్రకటన చేయకపోతే ఇబ్బందులు ఏర్పడతాయని ముఖ్య నేత‌లు చెబుతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*