ఆ మంత్రికి తిరుగేలేదంతేనా?

ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లా పాలేరు నియోజ‌క‌వ‌ర్గంలో టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర్‌రావుకు వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ తిరుగు ఉండదా..? అంటే ఔన‌నే అంటున్నాయి ఆయ‌న చేప‌డుతున్న అభివృద్ధి కార్య‌క్ర‌మాలు. గ‌త అనుభ‌వాల‌ను దృష్టిలో ఉంచుకుని.. మ‌రోసారి అవి పున‌రావృతం కాకూడ‌ద‌న్న ఉద్దేశంతో మంత్రి తుమ్మ‌ల అడుగులు వేస్తున్నారు. గ‌త నాలుగేళ్ల తుమ్మ‌ల పొలిటిక‌ల్ ప్ర‌స్థానం చూస్తే ఆయ‌న చాలా అదృష్ట‌వంతుడే అనుకోవాలి. గ‌త ఎన్నిక‌ల్లో ఖ‌మ్మం నుంచి టీడీపీ అభ్య‌ర్థిగా పోటీ చేసిన తుమ్మ‌ల కాంగ్రెస్ అభ్య‌ర్థి పువ్వాడ అజ‌య్‌కుమార్ చేతిలో ఓడిపోయారు.

నాన్ లోకల్ అయినా…..

ఆ త‌ర్వాత సీఎం కేసీఆర్ ఆహ్వానం మేర‌కు ఆయ‌న టీఆర్ఎస్‌లోకి రావ‌డం మంత్రి అవ్వ‌డం, వెంట‌నే ఎమ్మెల్సీ అవ్వ‌డం, ఆ వెంట‌నే పాలేరు ఉప ఎన్నిక‌ల్లో ఘ‌న‌విజ‌యం సాధించ‌డం చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి. పాలేరుకు తుమ్మ‌ల నాన్‌లోక‌ల్ అయినా ఆయ‌న ఇప్పుడు అక్క‌డ తిరుగులేకుండా దూసుకుపోతున్నారు. నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధికి ప్ర‌త్యేక నిధులు తెచ్చుకోవ‌డంలోనూ ఆయ‌న స‌క్సెస్ అయ్యారు. గులాబీ బాస్‌, సీఎం కేసీఆర్ వ‌ద్ద మంచి ప‌లుకుబ‌డి ఉన్న నేత‌గా తుమ్మ‌ల నాగేశ్వ‌ర్‌రావుకు గుర్తింపు ఉంది. ఎలాంటి వివాదాల జోలికి వెళ్ల‌కుండా.. త‌న‌ప‌ని తాను చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు.

రికార్డు స్థాయిలో……

రికార్డు స్థాయిలో భ‌క్త‌రామ‌దాసు ప్రాజెక్ట‌ను పూర్తి చేయ‌డం పాలేరులో ఆయ‌న కీర్తి ప్ర‌తిష్ట‌లు మ‌రింత పెంచింది. ఈ ప‌నితీరే వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ ఆయ‌న బాగా క‌లిసొస్తుంద‌ని ప‌లువురు నాయకులు అంటున్నారు. అంతేగాకుండా.. నియోజ‌క‌వ‌ర్గంలో భ‌క్త‌రామ‌దాసు సాగునీటి ప్ర‌జెక్టును అత్యంత వేగంగా పూర్తి చేయించిన ఘ‌న‌త‌ను త‌మ్మ‌ల ద‌క్కించుకున్నారు. డ‌బుల్‌బెడ్ రూం ఇళ్ల నిర్మాణంలోనూ ఆయ‌న దూసుకువెళ్తున్నారు. పాలేరు ఉప ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఆయ‌న పెద్ద‌గా హామీ లేమీ ఇవ్వ‌కున్నా.. ప్ర‌భుత్వం చేప‌డుతున్న అభివృద్ధి, సంక్షేమ ఫ‌లాలను నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు అందించ‌డంలో ఆయ‌న ముందువ‌రుస‌లో ఉన్నార‌నే అభిప్రాయం కార్య‌క‌ర్త‌ల్లో ఉంది.

పార్టీ బలోపేతంపై……

ఇదే స‌మ‌యంలో జిల్లాలో పార్టీ బ‌లోపేతంపై కూడా ఆయ‌న దృష్టి సారిస్తున్నారు. కేసీఆర్ కేబినెట్లో తుమ్మ‌ల మంత్రి ప‌ద‌వి ద‌క్క‌డంతో ఆయ‌న దానిని స‌ద్వినియోగం చేసుకుంటున్నార‌నే టాక్ వినిపిస్తోంది. ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలో ఎంపీ పొంగులేటి లాంటి వాళ్లు తుమ్మ‌ల‌కు వ్య‌తిరేకంగా గ్రూపులు క‌డుతున్నా అవి తుమ్మ‌ల‌పై ఏ మాత్రం ప్ర‌భావం చూప‌డం లేదు. చివ‌ర‌కు పొంగులేటిని ఢీకొట్టేందుకు రాజ‌కీయంగా చిర‌కాల శ‌త్రువులుగా ఉన్న తుమ్మ‌ల‌, కొత్త‌గూడెం ఎమ్మెల్యే జ‌ల‌గం వెంక‌ట్రావు ఇప్పుడు ఒక్క‌ట‌య్యారు. ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో తుమ్మ‌ల దాదాపు ఒక‌టి రెండు నియోజ‌క‌వ‌ర్గాలు మిన‌హా జిల్లాలో మిగిలిన అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ క్యాండెట్ల‌ను డిసైడ్ చేసే రేంజ్‌లో ఉన్నారు. కేసీఆర్ కేబినెట్‌లో ఎంత‌మంది మంత్రులు ఉన్నా తుమ్మ‌ల హ‌వా సాగిన‌ట్టు ఎవ్వ‌రికి సాగ‌డం లేదు. అటు కేసీఆర్ ద‌గ్గ‌రా, ఇటు జిల్లాలోనూ తిరుగులేకుండా ఉంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*