మాజీ డిప్యూటీ సీఎంకు పొగ పెడుతున్నారా..!

ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లా స్టేష‌న్‌ఘ‌న్‌పూర్ నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయ వాతావ‌ర‌ణం వేడెక్కుతోంది. అధికార టీఆర్ఎస్ పార్టీలో ఆధిప‌త్య పోరు ర‌చ్చకెక్కింది. రెండు వ‌ర్గాలు త‌న్నుకునే దాకా వ‌చ్చింది. దీంతో పార్టీ క్యాడ‌ర్ లో గంద‌ర‌గోళ ప‌రిస్థితి ఏర్పడింది. అయితే ఇదంతా కూడా వ‌చ్చే ఎన్నిక‌ల్లో సిట్టింగ్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజ‌య్యకు టికెట్ రాకుండా చేయ‌డానికేన‌నే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం నియోజ‌క‌వ‌ర్గంలో ఎమ్మెల్యే రాజ‌య్య, రాష్ట్ర నాయ‌కుడు రాజార‌పు ప్రతాప్ వ‌ర్గాలుగా పార్టీ చీలిపోయింది. అయితే మ‌ధ్య డిప్యూటీ సీఎం క‌డియం శ్రీ‌హ‌రి కూడా నియోజ‌క‌వ‌ర్గంలో త‌న ప‌ట్టుకోసం ప్రయ‌త్నం చేస్తున్నారు. రాజార‌పు ప్రతాప్ వెన‌క క‌డియం ఉన్నార‌నే ప్రచారం జ‌రుగుతోంది.

రాజీనామా అందుకేనా?

రాజ‌య్యకు చెక్ పెట్టేందుకు ప‌లువురు నాయ‌కులు పావులు క‌దుపుతున్నట్లు తెలుస్తోంది. ఇది నిజమేన‌న‌ట్టుగా ప‌రిణామాలు చోట‌చేసుకుంటున్నాయి. అంత‌కుముందు డిప్యూటీ సీఎంగా రాజ‌య్యకు అవ‌కాశం ఇచ్చిన కేసీఆర్ కొద్ది నెల‌ల‌కే ఆయ‌న‌ను త‌ప్పించి క‌డియం శ్రీ‌హ‌రికి అవ‌కాశం ఇచ్చిన విష‌యం తెలిసింది. ఇదిలా ఉండ‌గా.. ఐదారు నెల‌ల కింద‌ట రాష్ట్ర మైనారిటీ కమిష‌న్ వైస్ చైర్మన్‌గా రాజార‌పు ప్రతాప్‌ను సీఎం కేసీఆర్ నియ‌మించారు. అయితే ఏం జ‌రిగిందో తెలియ‌దుగానీ.. ప‌ద‌వీ బాధ్యత‌లు చేప‌ట్టకుండా రాజార‌పు ప్రతాప్ రాజీనామా చేశారు. ఈ ప‌ద‌విలో కొన‌సాగితే.. తాను ప్రత్యక్ష రాజ‌కీయాల‌కు దూరం అవుతాన‌నీ, నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ బ‌లోపేతం కోసం ప‌ని చేయాల‌ని సీఎం కేసీఆర్ సూచించార‌నీ, అందుకే రాజీనామా చేశానని రాజార‌పు చెప్పుకుంటున్నారు.

ఇరు వర్గాల ఘర్షణ……

అంతేగాకుండా.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న‌కే టికెట్ వ‌స్తుంద‌ని కూడా రాజార‌పు చెప్పుకోవ‌డం గ‌మ‌నార్హం. ఈ క్రమంలో ఎమ్మెల్యే రాజ‌య్య, రాజార‌పు ప్రతాప్ మ‌ధ్య ప‌చ్చగ‌డ్డివేస్తే భ‌గ్గుమంటోంది. బ‌హిరంగంగానే రాజ‌య్యపై రాజార‌పు అవినీతి ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. తాజాగా.. చిలుపూరు మండ‌లంలో జ‌రిగిన ఓ కార్యక్రమంలో ఇరు వ‌ర్గీయులు ఘ‌ర్షణ ప‌డ్డారు. రాజార‌పు వ‌ర్గీయుల‌ను ఎమ్మెల్యే రాజ‌య్య వ‌ర్గీయులు అడ్డుకున్నారు. ఇప్పుడీ విష‌యం నియోజ‌క‌వ‌ర్గంలో తీవ్ర చ‌ర్చనీయాంశంగా మారింది. మ‌రోవైపు క‌డియం శ్రీ‌హ‌రి కూడా తన కూతురు డాక్టర్ క‌డియం కావ్యను స్టేష‌న్‌ఘ‌న్‌పూర్ నుంచి బ‌రిలోకి దించేందుకు ప్రయ‌త్నం చేస్తున్నార‌నే ప్రచారం కూడా జ‌రుగుతోంది.

తనకే టిక్కెట్ అన్న ధీమాతో…..

ఓ వైపు రాజ‌య్య త‌న‌ను మంత్రి ప‌ద‌వి నుంచి త‌ప్పించిన నేప‌థ్యంలో త‌న‌కే మ‌ళ్లీ టిక్కెట్ వ‌స్తుంద‌న్న ధీమాతో ఉన్నారు. ఇటు ప్రతాప్ త‌న‌కే సీటు అని చెప్పుకుంటున్నారు. వీరిద్దరి గొడ‌వ‌ల నేప‌థ్యంలో త‌న కుమార్తె కావ్యకు ఎలా సీటు ఇప్పించుకోవాలా ? అని క‌డియం త‌న ప్లాన్లు తాను వేస్తున్నారు. ఏదేమైనా వ‌చ్చే ఎన్నిక‌ల్లో స్టేష‌న్‌ఘ‌న్‌పూర్ టీఆర్ఎస్ సీటు కోసం జ‌రుగుతోన్న ట్రయాంగిల్ ఫైట్ అదురుతోంది. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో సీఎం కేసీఆర్ ఎవ‌రికి టికెట్ ఇస్తార‌న్నది ఇప్పుడు అంద‌రిలో ఉత్కంఠ రేపుతోంది

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*