ఇక్కడ హస్తం పార్టీ వేలు కూడా పెట్టలేదా?

మెదక్ జిల్లా.. టీఆర్ఎస్ కు ఇప్పుడు కంచుకోట. గత ఎన్నికల్లో జిల్లాలోని పది స్థానాల్లో ఎనిమిది స్థానాల్లో టీఆర్ఎస్ విజయబావుటా ఎగురేసింది. కాంగ్రెస్ తరుపున గెలిచిన ఇద్దరూ స్వల్ప మెజారిటీతో గెలిచిన వారే. 2014 ఎన్నికల తర్వాత జరిగిన మెదక్ పార్లమెంటు, నారాయణఖేడ్ ఉపఎన్నికల్లోనూ టీఆర్ఎస్ పార్టీ భారీ మెజారిటీతో విజయ సాధించి తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించింది. అయితే, ఇదే సందర్భంగా మెదక్ జిల్లా ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోట వంటిదే. స్వయంగా ఇందిరా గాంధీ 1980 ఎన్నికల్లో మెదక్ నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారు. గ్రామగ్రామనా ఆ పార్టీకి బలమైన ఓటు బ్యాంకు ఉంది. అయితే, గత ఎన్నికల్లో టీఆర్ఎస్ హవా నేపథ్యంలో ఇంచుమించు పూర్తిగా పట్టుకోల్పోయిన కాంగ్రెస్ ఈ ఎన్నికల్లోనైనా కొంత సత్తా చాటాలని భావిస్తోంది. దీంతో రానున్న ఎన్నికల్లో మెదక్ జిల్లాలో రాజకీయ పరిస్థితులను ఒకసారి పరిశీలిద్దాం.

హరీష్ రావుకి తిరుగులేదా…?

తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపించిన నాటి నుంచి సిద్ధిపేట నియోజకవర్గం అండగా ఉంటోంది. మొదట కేసీఆర్, అనంతరం హరీష్ రావు అన్ని ఎన్నికల్లోనూ గెలుస్తూ వస్తున్నారు. 2001 నుంచి ఏడు ఎన్నికల్లో గెలిచింది టీఆర్ఎస్. ప్రతీ ఎన్నికలోనూ మెజారిటీ పెరుగుతూ వస్తోంది. గత ఎన్నికల్లో రాష్ట్రంలోనే అత్యధికంగా 93,354 ఓట్ల మెజారిటీతో హరీష్ రావు విజయం సాధించారు. హరీష్ రావుకు నియోజకవర్గంలో బలమైన చరిష్మా ఉన్నా, అంతకుమించి నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి ఆయనకు కలిసి వస్తోంది. 2014కు ముందు, తర్వాత కూడా సిద్ధిపేట నియోజకవర్గం అభివృద్ధిలో ముందుంది. దీంతో కాంగ్రెస్ తరుపున హరీష్ రావుపై పోటీకి సరైన అభ్యర్థి కూడా దొరకడం లేదు. గత ఎన్నికల్లో పోటీచేసిన శ్రీనివాస్ గౌడ్ కేవలం 15,371 ఓట్లు మాత్రమే సాధించారు. ప్రస్థుత పరిస్థితులు చూస్తే ఈ ఎన్నికల్లోనూ హరీష్ రావుకు తిరుగులేదని భావిస్తున్నారు. కొందరు కాంగ్రెస్ నేతలు సైతం ఈ విషయాన్ని అంగీకరిస్తున్నారు. ఇక్కడి నుంచి కాంగ్రెస్ తరుపున అభ్యర్థి ఎవరనేది ఇంకా స్పష్టత లేదు.

మెదక్ లో కాంగ్రెస్ కు కొత్త అభ్యర్థేనా..?

మొదక్ అసెంబ్లీ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో చివరి నిమిషంలో కాంగ్రెస్ లో చేరిన విజయశాంతి పోటీ చేసి ఓటమి చవిచూశారు. ఆమెపై ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్ గా ఉన్న పద్మా దేవేందర్ రెడ్డి 39,234 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. అయితే, ప్రస్తుతం విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో, నియోజకవర్గంలో చురుగ్గా లేరు. పార్టీ కార్యక్రమాల్లోనూ పాల్గొనడం లేదు. దీంతో రానున్న ఎన్నికల్లో ఆమె పోటీ చేయదనే ప్రచారం ఉంది. దీంతో ఈ స్థానాన్ని గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన భట్టీ జగపతి, శశిధర్ రెడ్డి, తిరుపతి రెడ్డితో పాటు మరికొందరు ఆశిస్తున్నారు. అయితే, పద్మాదేవేందర్ రెడ్డికి అభివృద్ధి విషయం పాస్ మార్కులే పడినా, బలమైన ప్రత్యర్థి లేకపోతే ఆమె గెలుపు నల్లేరు మీద నడకే అవుతుంది.

ఖేడ్ లో విజయం ఎవరిది…

మెదక్ జిల్లాలో అభివృద్ధికి ఆమడదూరంలో ఉంటుంది నారాయణఖేడ్ నియోజకవర్గం. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నేత కిష్టారెడ్డి పోటీ చేసి సొంత ఇమేజ్ తో పాటు పార్టీకి ఉన్న ఓటు బ్యాంకుతో 14 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అయితే, ఆయన అకాల మరణంతో రెండేళ్లకే జరిగిన ఉపఎన్నికల నాటికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. టీఆర్ఎస్ ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడం, నియోజకవర్గ వెనుకబాటుకు కాంగ్రెస్ యే కారణమని ఆ పార్టీ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది. దీంతో సానుభూతి సైతం పనిచేయలేదు. టీఆర్ఎస్ నుంచి పోటీచేసిన భూపాల్ రెడ్డి కిష్టారెడ్డి కుమారుడు సంజీవరెడ్డిపై భారీ మెజారిటీతో విజయం సాధించారు. అయితే, ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రాతినిధ్యం వహించినా, టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నా అభివృద్ధి విషయంలో ఒరిగింది ఏమీ లేదు అనే వాదన వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో మళ్లీ వీరిద్దరే రెండు పార్టీల నుంచి బరిలో ఉండనున్నారు. ఉప ఎన్నికలలా ఏకపక్షంగా కాకుండా ఇద్దరి మధ్య గట్టి పోటీనే ఉండనుంది అనేది మాత్రం స్పష్టమవుతోంది.

బాబూ మోహన్ కు ఎదురుగాలి..?

ఎస్సీ రిజర్వుడ్ స్థానమైన ఆందోల్ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో ఇద్దరు మాజీ మంత్రుల నడుమ పోరు జరిగింది. ఉమ్మడి రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా పనిచేసి, ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రచారం జరిగినా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దామోదర రాజనర్సింహకు ఓటమి తప్పలేదు. ఆయనపై మాజీ మంత్రి బాబుమోహన్ టీఆర్ఎస్ తరుపున పోటీ చేసి మూడు వేల స్వల్ప ఆధిక్యంతో విజయం సాధించారు. అయితే, దామోదర రాజనర్సింహకు నియోజకవర్గంలో మంచి పట్టు ఉంది. పైగా ఉపముఖ్యమంత్రిగా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అయితే, గత ఎన్నికల్లో టీఆర్ఎస్ గాలి బలంగా వీయడం వల్ల ఓడినా ఈ ఎన్నికల్లో మాత్రం గట్టి పోటీనే ఇచ్చే అవకాశం ఉంది. పైగా, ఎమ్మెల్యేగా ఉన్న బాబుమోహన్ కు తన తొందరపాటు వ్యాఖ్యలతో ప్రజల్లో కొంత వ్యతిరేకత ఏర్పడింది. దీంతో రానున్న ఎన్నికల్లో ఆయనకు విజయం అంత సులభం కాదనే విశ్లేషణలు ఉన్నాయి.

నర్సాపూర్ లో సునీతమ్మ?

నర్సాపూర్ నియోజకవర్గంలో మాజీ మంత్రి సునీతా లక్ష్మరెడ్డికి మంచి పట్టు ఉంది. ఆమె వరుసగా మూడుసార్లు నియోజకవర్గం నుంచి విజయం సాధించి మంత్రిగా కూడా పనిచేశారు. అయితే, గత ఎన్నికల్లో ఆమెపై మదన్ రెడ్డి 14,161 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అంతకుముందు తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి రెండుసార్లు ఓడిపోయారనే సానుభూతి, టీఆర్ఎస్ హవా, మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేసిన సునీతపై సహజంగా ఏర్పడే వ్యతిరేకత కారణంగా మదన్ రెడ్డి సులువుగా విజయం సాధించారు. అయితే, నాలుగేళ్లుగా నియోజకవర్గంలో తనముద్రను మాత్రం వేసుకోలేకపోయారు. రానున్న ఎన్నికల్లోనూ వీరిద్దరి మధ్యే తీవ్ర పోటీ ఉండనుంది. ఇక్కడ సీపీఐ పార్టీకి కూడా కొంత ఓటు బ్యాంకు ఉన్నా, ప్రధాన పోటీదారుగా ఉండే అవకాశాలు మాత్రం తక్కువే.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*