కారు స్పీడ్ కు బ్రేకులు వేసేలా మాస్టర్ ప్లాన్ ..!

తెలంగాణ‌లో టీఆర్ఎస్ అధినేత‌, ముఖ్య‌మంత్రి కేసీఆర్ ముంద‌స్తు దూకుడు పెంచుతున్నారు. ఇదే స్థాయిలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం క‌స‌ర‌త్తు చేస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో గులాబీ ద‌ళాన్ని దెబ్బ‌కొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ ప‌క్కా ప్లాన్ వేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఎట్టిప‌రిస్థితుల్లోనూ ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు చీలిపోకుండా వ్యూహ‌ర‌చ‌న చేస్తోంది. ఇందుకు అవ‌ర‌స‌ర‌మైన క‌స‌ర‌త్తు కూడా ప్రారంభిస్తున్న‌ట్లు స‌మాచారం. ప్ర‌ధానంగా తెలంగాణ‌లో ప్ర‌తిప‌క్షాల‌తో క‌లిపి కూట‌మి ఏర్పాటు చేసే దిశ‌గా రాష్ట్ర నాయ‌క‌త్వం ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేసింది. బ‌లంగా ఉన్న అధికార టీఆర్ఎస్‌ను గ‌ద్దె దించాలంటే.. కూట‌మి ఏర్పాటు అనివార్య‌మ‌ని కాంగ్రెస్ రాష్ట్ర నాయ‌క‌త్వం అంటోంది.

ఏ పార్టీకి ఎన్ని సీట్లు….

ఇందుకు టీడీపీ, సీపీఐ, తెలంగాణ జ‌న‌స‌మితుల‌తో క‌లిసి కూట‌మి ఏర్పాటు చేసేందుకు అన్ని ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. అయితే.. ఏయే పార్టీల‌కు ఎన్నెన్ని సీట్లు కేటాయించాల‌న్న విష‌యంలోనూ కాంగ్రెస్ నేత‌లు క్లారిటీతో ఉన్న‌ట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌తో క‌లిసి న‌డిచేందుకు టీడీపీ, సీపీఐ, తెలంగాణ జ‌న స‌మితి సానుకూలంగా ఉన్నాయి. కానీ, సీపీఎం నేత‌లే కొంత అటు ఇటుగా ఉన్నారు. ప‌లు ప్ర‌జాసంఘాల‌తో క‌లిసి సీపీఎం బ‌హుజ‌న లెఫ్ట్ ఫ్రంట్ ఏర్పాటు చేసి, కార్యాచ‌ర‌ణ మొద‌లు పెట్టిన విష‌యం తెలిసిందే. వ‌చ్చే ఎన్నిక‌ల్లో బ‌హుజ‌న లెఫ్ట్ ఫ్రంట్ త‌రుపునే పోటీ చేస్తామ‌ని, ఎట్టి ప‌రిస్థితుల్లోనూ పొత్తులు ఉండ‌వ‌ని సీపీఎం రాష్ట్ర కార్య‌ద‌ర్శి త‌మ్మినేని వీర‌భ‌ద్రం స్ప‌ష్టం చేశారు.

ఢిల్లీ స్థాయిలో కాంగ్రెస్ నేతలు….

త‌మ్మినేనిని ఒప్పించేందుకు ఢిల్లీస్థాయిలో కాంగ్రెస్ నేత‌లు ఆ పార్టీ జాతీయ నాయ‌క‌త్వం ద్వారా ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఈ మేర‌కు రాష్ట్ర కాంగ్రెస్ నేత‌లు సీపీఎం జాతీయ నేత‌ల‌తో ప‌లుమార్లు చ‌ర్చ‌లు కూడా జ‌రిపిన‌ట్లు స‌మాచారం. ఒక‌వేళ పొత్తులు ఉంటే.. టీడీపీకి 15 అసెంబ్లీ సీట్లు, ఒక లోక్‌స‌భ స్థానం, తెలంగాణ జ‌న‌స‌మితికి ఆరు అసెంబ్లీ స్థానాలు, సీపీఐకి నాలుగు, సీపీఎంకు నాలుగు అసెంబ్లీ స్థానాలు ఇచ్చేందుకు రాష్ట్ర కాంగ్రెస్ నాయ‌క‌త్వం సిద్ధంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. సీట్లు ప‌రంగా త‌మ పార్టీ కొంత న‌ష్ట‌పోయినా.. అంద‌రినీ క‌లుపుకుని కూట‌మి ఏర్పాటు చేసి, ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని చూస్తోంది.

కలిసి నడిస్తేనే……

విప‌క్షాలు అన్నీ క‌లిసి న‌డిస్తేనే సీఎం కేసీఆర్‌ను ధీటుగా ఎదుర్కొన‌వ‌చ్చ‌ని టీడీపీ, కాంగ్రెస్‌, సీపీఐ నేత‌లు అంటున్నారు. అయితే.. తెలంగాణ జ‌న స‌మితి అధినేత కోదండ‌రాం ప్ర‌స్తుతానికి వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఒంట‌రిగానే చెబుతున్నా.. చివ‌రికి కూట‌మిలో క‌లుస్తార‌ని ప‌లువురు నాయ‌కులు అంటున్నారు. ఒక్క సీపీఎం పార్టీని ఒప్పిస్తే.. తెలంగాణ‌లో దాదాపుగా కూటమి ఏర్పాటు అడ్డంకులు తొల‌గిన‌ట్టేన‌ని ప‌లువురు విశ్లేష‌కులు భావిస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*