ఊహించని షాక్ లు తప్పవా….!!

తెలంగాణాలో ముందే సీట్లు ప్రకటించిన గులాబీ పార్టీకి ప్రస్తుతం ఆశావహులు, నిరాశావాదుల నుంచి ఎదురౌతున్న వత్తిడులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. అదే విధంగా ఇంకా అభ్యర్థుల మొదటి లిస్ట్ కూడా ప్రకటించని మహాకూటమికి సీట్ల సర్దుబాటు పెద్ద తలపోటుగా మారింది.అధికార పార్టీకి రెబెల్స్ బెడద, బెదిరింపులు తీవ్రం అయ్యాయి. ఇక కూటమిలో మిత్రపక్షాలు ఇంకా మీనమేషాలు లెక్కిస్తే ఎప్పుడు బరిలోకి దిగుతామంటూ కాంగ్రెస్ సీట్ల సర్దుబాటును ప్రశ్నిస్తున్నాయి. ఇలా ఎవరిగుట్లో వారికి సమస్యలు ప్రధాన పార్టీలను చుట్టుముడుతున్నాయి. దాంతో అధికార విపక్ష పార్టీల అధినాయకత్వం ఈ సమస్యల నుంచి గట్టెక్కించే పనిలో సీరియస్ గా తలమునకలైంది.

కారు పార్టీపై కస్సుబుస్సు …

నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని పనిచేస్తే అధిష్టానం దగ్గర గుర్తింపు లభించలేదని టీఆర్ఎస్ లో సీనియర్లు చాలా మంది సీరియస్ గా వున్నారు. తమను కాదని మరొకరికి టికెట్ కు టిక్ పెట్టడాన్ని సహించలేక పక్క పార్టీల వైపు పక్క చూపులు గులాబీ దళంలో పెరిగిపోయాయి. ఈ దావానలాన్ని ఆర్పేందుకు స్వయంగా మంత్రి కెటిఆర్ రంగంలోకి దిగి సర్దుబాటు చేసుకుంటూ వస్తున్నారు. ఖమ్మం, వరంగల్ జిల్లాలో కొందరు నేతలు తిరుగుబావుటా ఎగరవేయడానికి సిద్ధం కావడంతో వారి వద్దకు వెళ్ళి కేటిఆర్ బుజ్జగింపులు చేస్తున్నారు. అయితే వీరిలో కూడా కొందరు మాట వినకపోవడంతో గులాబీ బాస్ కెసిఆర్ నేరుగా వారిని పిలిపించుకుని పార్టీలో భవిష్యత్తుపై హామీల వర్షం కురిపిస్తున్నారు.

హస్తానికి కష్టాలే ….

అసలే సొంత పార్టీలోని నేతలు ఇంటికో రెండు మూడు టికెట్లు డిమాండ్ చేస్తూ తలపోట్లు తీవ్రం చేస్తుంటే మరోపక్క పొత్తు లెక్కలు ఎప్పుడు తెలుస్తారంటూ కూటమి నేతలు నిలదీస్తూ కాంగ్రెస్ హైకమాండ్ పై వత్తిడి పెంచుతున్నారు. అన్ని అనుకూలిస్తే విజయదశమికి తొలిజాబితా ప్రకటించాలని భావించిన ఉత్తమకుమార్ రెడ్డి ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో వెనక్కి తగ్గి సీట్ల సర్దుబాటు సీనియర్ నేత జానా రెడ్డి పై పెట్టి ప్రచార పర్వంపై సీరియస్ గా దృష్టి పెట్టారు.

కోదండరామ్ లిస్ట్ తో……

తాడో పేడో తేల్చండన్న తెలంగాణ జన సమితి 32 మంది కి టికెట్లు కావాలంటూ ఏ ఏ నియోజకవర్గాలు కావాలో పేర్కొంటూ ఒక లిస్ట్ ను జానాకు మాజీ ఎమ్యెల్సీ దిలీప్ ద్వారా అందజేసింది. పైకి చెప్పుకోవడం లేదు కానీ టిడిపి సైతం కాంగ్రెస్ ఆలస్యానికి చికాకు పడుతుంది. సీట్లు ఎన్ని ఎక్కడో తేలకపోతే సమయం మించి పోయి ప్రత్యర్థులకు లబ్ది చేకూరుతుందని ఆందోళన చెందుతుంది. సిపిఐ కాంగ్రెస్ సీనియర్ నేతలు బరిలో నిలిచే పలు నియోజకవర్గాలు ఆశిస్తుంది. ఇవన్నీ ఇప్పుడు జానాకు సవాల్ విసురుతున్నాయి. వీటన్నిటిని పరిష్కరించడానికి మరో పది పదిహేనురోజులు సమయం పట్టేలా ఉందని కాంగ్రెస్ క్యాడర్ మరోపక్క ఆందోళన చెందుతుంది. ఇలా ఎవరి గోల వారిదిగా తెలంగాణ ఎన్నికల పంచాయితీ సాగడం చర్చనీయాంశం గా మారింది

Ravi Batchali
About Ravi Batchali 15990 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*