త‌మ్ముడు అసెంబ్లీకి.. అన్న లోక్‌స‌భ‌కా?

వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్‌ స్థానాలను మార్చబోమని, ఒకటి, అర తప్ప అందరికీ టిక్కెట్లు ఇస్తామన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యాఖ్యల నేపథ్యంలో తెలంగాణలోని జిల్లాల్లో రాజ‌కీయ ప‌రిణామాలు ఆస‌క్తిక‌రంగా మారుతున్నాయి. ఉమ్మ‌డి ఆదిలాబాద్‌లో అప్పుడే నేత‌లు త‌మ అనుకూల స్థానాల‌ను ఎంచుకుని రంగంలోకి దిగిపోతున్నారు. ఎంపీలుగా ఉన్న వారు ఈసారి ఎమ్మెల్యేలుగా పోటీచేసేందుకు రెడీ అయిపోతున్నారు. ప్ర‌స్తుతం ఆ జిల్లాకు చెందిన ఇద్ద‌రు సోద‌రుల పైనే అంద‌రి దృష్టి ప‌డింది. వీరిలో ఒక‌రు ఎమ్మెల్యేగా, మ‌రొక‌రు లోక్‌స‌భ‌కు వెళ్లేందుకు పావులు క‌దుపుతున్నారు. మ‌రి ఒకే కుటుంబానికి చెందిన ఇద్ద‌రికి సీఎం కేసీఆర్‌.. టికెట్లు ఇస్తారో లేదేన‌నే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఈసారి శాసనసభకు వివేక్……

పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గంలో దశాబ్ధాల పాటు ఎంపీగా ప్రాతినిథ్యం వహించిన దివంగత గడ్డం వెంకటస్వామి కుటుంబం వచ్చే ఎన్నికల్లో కూడా కీలకంగా మారనుండ‌గా సోద‌రులు వివేక్‌, వినోద్ బ‌రిలోకి దిగేందుకు రెడీ అవుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల విషయంలో కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2009 నుంచి 2014 వరకు పెద్దపల్లి లోక్‌సభ ఎంపీగా కాంగ్రెస్‌ పార్టీలో కీలకంగా వ్యవహరించిన గడ్డం వివేక్‌ ఈసారి టీఆర్‌ఎస్‌ నుంచి శాసనసభకు పోటీ చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం.

ఆయన పార్లమెంటుకు…..

వివేక్‌ సోదరుడు, 2004లో చెన్నూరు నుంచి ప్రాతినిధ్యం వహించిన మాజీ మంత్రి జి.వినోద్‌ను పెద్దపల్లి ఎంపీగా పోటీ చేయించే ప్రతిపాదనలు సాగుతున్నట్లు తెలిసింది. ప్రస్తుతం పెద్దపల్లి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న బాల్క సుమన్‌ మాత్రం వచ్చే ఎన్నికల్లో సైతం తనకే అవకాశం లభిస్తుందన్న ధీమాతో ఉన్నారు. ఆదిలాబాద్‌ ఎంపీగా ఉన్న గొడెం నగేష్‌ ఈసారి బోథ్‌ అసెంబ్లీ నుంచి పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

టీఆర్ఎస్…కాంగ్రెస్…మళ్లీ…

వివేక్, వినోద్‌ 2013లో టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. 2014లో కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు మొగ్గు చూపడంతో ఈ ఇద్దరు నాయకులు తిరిగి కాంగ్రెస్‌లో చేరి, పూర్వ స్థానాల నుంచే పోటీ చేసి ఓడిపోయారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 2017లో గడ్డం సోదరులు మళ్లీ టీఆర్‌ఎస్‌లోకి రాగా, ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాజీ ఎంపీ వివేక్‌ను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమించారు. ఈ పరిస్థితుల్లో కొత్తగా వివేక్‌ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేదే ప్రశ్న.

ఆ సాహసం చేస్తారా?

2004లో తన సోదరుడు గడ్డం వినోద్‌ పోటీ చేసిన చెన్నూరు ఎస్సీ రిజర్వు స్థానం నుంచి బరిలో దిగుదామంటే నల్లాల ఓదెలును కాదనే పరిస్థితి కనిపించడం లేదు. మరో రిజర్వుడు సీటు అయిన బెల్లంపల్లిలో దుర్గం చిన్నయ్య తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. దుర్గం చిన్నయ్య రాష్ట్రంలోనే నేత సామాజిక వర్గానికి చెందిన ఏకైక ఎమ్మెల్యే. ఇక జిల్లాలో మిగిలిన జనరల్‌ సీటు మంచిర్యాల. ఇక్కడి నుంచి నడిపెల్లి దివాకర్‌రావు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఏకైక జనరల్‌ సీటు నుంచి కూడా ఎస్సీ అభ్యర్థికి స్థానం కల్పించే సాహసం కేసీఆర్‌ చేసే అవకాశం లేదు.

సుమన్ పదిలమేనా?

పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గంలోని ధర్మపురి స్థానం ఎస్సీ రిజర్వుడు అయినప్పటికీ ఇక్కడ సీనియర్‌ ఎమ్మెల్యే ప్రభుత్వ చీఫ్‌ విప్‌ కొప్పుల ఈశ్వర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎంపీగా వివేక్‌ సోదరుడు మాజీ మంత్రి వినోద్‌ను పోటీ చేయించాలని భావిస్తుండగా, పెద్దపల్లిలో సిట్టింగ్‌ ఎంపీ బాల్క సుమన్‌ తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*