ఆట మొదలయింది….!

రాజకీయ రంగంలో తెలంగాణ ఆట మొదలైంది. పావులు కదులుతున్నాయి. ఎత్తులు,పైఎత్తులతో ప్రత్యర్థిని దెబ్బతీయడానికి సామదానభేద దండోపాయాలు ప్రయోగించేందుకు సన్నద్ధమవుతున్నారు. ముఖ్యంగా ప్రధాన పార్టీలు పైచేయి సాధించేందుకు రకరకాల ఎత్తుగడలు వేస్తున్నాయి. అనుమానం ఉన్న ప్రతిచోటా ప్లాన్ బీ ఆచరణలోకి తెస్తున్నారు. తెలంగాణ రాష్ట్రసమితి పైకి గంభీరంగానే కనిపిస్తోంది. కానీ అనేక చోట్ల సందేహాలున్నాయి. వాటిని అధిగమించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేపడుతోంది. కాంగ్రెసు పార్టీ నిస్తేజంగా ఉంది. కానీ అసెంబ్లీ రద్దుతోనే కొంత ఉత్తేజం పొందింది. పూర్తిస్థాయి రాజకీయ కార్యాచరణకు శ్రీకారం చుడుతోంది. సంప్రతింపుల ద్వారా తమ మధ్యలో ఉన్న విభేదాలను పరిష్కరించుకోవడానికి యత్నిస్తున్నారు. విందు రాజకీయాల ద్వారా అసమ్మతిని సర్దుబాటు చేసుకుంటున్నారు. ఏదేమైనా టీఆర్ఎస్ కు గట్టిపోటీ ఇవ్వాలనే సంకల్పం కాంగ్రెసులో కనిపిస్తోంది. మిగిలిన రాజకీయ పార్టీల్లోనూ జోష్ కనిపిస్తోంది. అయితే ప్రజల్లోనూ, రాజకీయవర్గాల్లోనూ సాగుతున్న చర్చమాత్రం ప్రధానపార్టీలకు సంబంధించినదే.

ఆకర్షణ మంత్రం…

తెలంగాణ రాష్ట్రసమితి కొన్ని బలహీనతలు అధిగమించేందుకు ఇంకా ఆకర్ష మంత్రాన్ని పఠిస్తోంది. అందరికీ సీట్లు ఇవ్వలేని బలహీనత. అభ్యర్థులను మార్చలేని బలహీనత. దీనికారణంగా పార్టీలో పెరుగుతున్న అసంతృప్తి, అసమ్మతి బలహీనతలుగా బయటపడుతున్నాయి. వాటికి చెక్ పెట్టేందుకు మరో కొత్త మంత్రం పఠిస్తోంది టీఆర్ఎస్. ఆకర్ష్ ను తెరపైకి తెచ్చింది. ఇతర పార్టీల్లోని పెద్ద నాయకులకు పార్టీ తీర్థం ఇవ్వడం ద్వారా టీఆర్ఎస్ లో మొదలైన లుకలుకలు బయటికి కనిపించకుండా చేయాలనేది ఎత్తుగడ. 2014లో టీర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ, కాంగ్రెసులు బలహీనపడ్డాయి. ఆయా పార్టీల తరఫున ఎన్నికైన ఎమ్మెల్యేలు చాలామందిని అధికారపార్టీ తనలో కలిపేసుకుంది. టీడీపీ విషయానికొస్తే దాదాపు పార్టీ ఖాళీ అయిపోయింది. కాంగ్రెసు ప్రధాన ప్రతిపక్షం కావడంతో పదిమంది లోపుగానే గోడ దూకారు. నియోజకవర్గ స్థాయి నాయకులూ చాలామంది పార్టీలకతీతంగా టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. అంతా బాగానే ఉందనుకుంటున్న తరుణంలోఅసెంబ్లీ రద్దు అయ్యింది. పార్టీ పదవులకోసం అంటిపెట్టుకుని ఉన్ననాయకులు, గోడదూకి వచ్చిన నేతలూ తమకు టిక్కెట్లు రావని తెలుసుకుని అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. దీనిని ఎదుర్కొనే ప్రయత్నమే ఆపరేషన్ ఆకర్ష్.

వికర్ష తంత్రం…

అధికార టీఆర్ఎస్ తమపార్టీలో ఇతర పార్టీల నేతలను చేర్చుకునేందుకు బలమైన అస్త్రాలనే ప్రయోగిస్తోంది. మాజీ స్పీకర్ సురేశ్ రెడ్డిని ఆకర్షించేందుకు స్వయంగా టీఆర్ఎస్ వారసుడు కేటీఆర్ రంగంలోకి దిగారు. సురేశ్ రెడ్డి కాంగ్రెసులో చాలా కీలకనేత. ఆయనస్థాయికి తగిన పదవితో సముచితంగా గౌరవిస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల తర్వాత మండలి ఛైర్మన్ పదవిని ఆఫర్ చేశారనేది వినికిడి. అధికారపార్టీ ప్రధానంగా విపక్షాల మధ్య అనైక్యతను పెంచడం ద్వారా ఓటు బ్యాంకులు సంఘటితం కాకుండా వ్యూహాత్మక ఎత్తుగడలు వేస్తోంది. ఇప్పటికే బీఎల్ఎఫ్ ఆ దిశలో పనిచేస్తోంది. వామపక్షాల్లో సీపీఎం ప్రధాన పార్టీగా ఉన్న బహుజన లెఫ్ట్ ఫ్రంట్ ఓట్ల చీలికకు తోడ్పడుతుందని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. జనసేనను సైతం బీఎల్ఎఫ్ కలుపుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇదంతా అధికారపార్టీ ఎత్తుగడలో భాగమనే అనుమానాలు ఉన్నాయి. తెలంగాణ జనసమితి, ఇతర చిన్నచితక పార్టీలన్నీ ఎంత ఎక్కువగా పోటీ చేస్తే అంతగానూ అధికారపార్టీకి లాభిస్తుంది. అదే ప్రధాన అస్త్రంగా ఓటు బ్యాంకు చెల్లాచెదురైతే 30 నుంచి 40 శాతం ఓట్లు వస్తే చాలు పక్కాగా అధికారం దక్కుతుంది.

పొత్తు పొడిచేనా..?

రాజకీయఘట్టంలో ఎక్కువ ఆసక్తి కలిగిస్తున్న అంశం తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలు ఏం చేయబోతున్నాయనేదే. రెండు పార్టీలకు అవసరాలున్నాయి. కలిస్తే ఒక సంచలనమే. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపన మొదలు ఇప్పటివరకూ చేతులు కలపని ఏకైక పార్టీ కాంగ్రెసు. వామపక్షాలు, బీజేపీలతో గతంలో తెలుగుదేశం పొత్తులు పెట్టుకుంది. కాంగ్రెసు ను మాత్రం దూరంగానే ఉంచింది. తెలంగాణలో ప్రధానపార్టీ పాత్రనుంచి కుదించుకుపోవడంతో జూనియర్ అయిపోయింది. ఇప్పుడు అస్తిత్వాన్ని కాపాడుకుంటూ మనుగడ సాగించాలంటే కాంగ్రెసు స్నేహహస్తం అవసరం. టీఆర్ఎస్ ను ఎదుర్కోవడానికి సైకిల్ ఆసరా కాంగ్రెసుకు తప్పనిసరి. ఇలా పరస్పర ప్రయోజనాల కోసం కలిసి వెళ్లకతప్పదు. అందువల్లనే రాజకీయ పరిశీలకులు అధికారికంగా పొత్తు ఉంటుందా? లేదా? అన్న అంశాన్ని పక్కనపెట్టి కాంగ్రెసు, టీడీపీలు కలిసే నడుస్తాయన్న నిర్ధారణకు వచ్చేస్తున్నారు. తాజాగా జరిగిన సమావేశంలో పార్టీ ప్రయోజనాలకోసం స్వేచ్ఛ ఇస్తున్నానంటూ చంద్రబాబు తేల్చేశారు.

 

-ఎడిటోరియల్ డెస్క్