తూ.గో.లో మొదట టీడీపీ ఓడే సీటు ఇదేనా?

ఏపీ డిప్యూటీ సీఎం, తూర్పు గోదావ‌రి జిల్లా పెద్దాపురం నియోజ‌క‌వ‌ర్గానికి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న కాపు సామాజిక వ‌ర్గం నేత నిమ్మకాయ‌ల చిన‌రాజ‌ప్ప.. రాజ‌కీయం డోలాయ‌మానంలో ప‌డిందా? వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న గెలుపు అంత వీజీకాదా? ఇక్కడ ఆయ‌నకు చాప‌కింద నీరులా వ్యతిరేక వ‌ర్గం చ‌క్రం తిప్పుతోందా? ఆయ‌న ప‌నితీరుపై ఇక్కడి ప్ర‌జ‌లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారా? అంటే.. తాజా ప‌రిణామాలు ఔన‌నే అంటున్నాయి. వచ్చే ఎన్నికల్లో తూర్పు గోదావరి జిల్లాలో గ్యారంటీగా ఓడిపోయే సీట్లలో పెద్దాపురం పేరు బాహాటంగానే వినిపిస్తోంది. నియోజకవర్గంలో పరిస్థితి ప్రస్తుతం టీడీపీకి ఏ మాత్రం అనుకూలంగా లేక‌పోవ‌డం చిన‌రాజ‌ప్ప రాజ‌కీయ భ‌విష్యత్తుపై ప‌డుతుంద‌ని అంటున్నారు.

ఆధిపత్య రాజకీయాలతో…..

పెద్దాపురం టీడీపీలో ఆధిప‌త్య రాజ‌కీయాలు హ‌ద్దు మీరిపోయాయి. త‌న‌ను గెలిపించిన కిందిస్థాయి కేడ‌ర్‌ను చిన‌రాజ‌ప్ప అస్సలు ప‌ట్టించుకోవ‌డం లేద‌నే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా బొడ్డు భాస్కరరామారావుకు, చినరాజప్పకు మధ్య విభేదాలు తీవ్రరూపం దాల్చాయి. ఏ కార్యక్రమంలోనూ బొడ్డును క‌లుపుకొని పోయేందుకు చిన‌రాజ‌ప్ప ముందుకు రావ‌డంలేదు. లోపాయికారీగా ఆయ‌న‌కే ఎస‌రు పెట్టేలా చిన‌రాజ‌ప్ప వ్యవ‌హ‌రిస్తున్నార‌ని ఇక్కడి టీడీపీ నాయ‌కులు చెప్పుకొంటున్నారు. నిజానికి ఈ నియోజ‌క‌వ‌ర్గంలో చిన‌రాజ‌ప్ప చేసింది ఏమీలేదు. అంతా బొడ్డు భాస్కర‌రావు చ‌ల‌వతోనే ఇక్కడ అభివృద్ధి జ‌రిగింద‌న్నది ఇక్కడి ప్రజ‌ల విశ్వాసం.

ఆయన వ్యతిరేకిస్తుండటంతో…..

రెండున్నర ద‌శాబ్దాలుగా ఈ నియోజ‌క‌వ‌ర్గ ప్రజ‌ల‌తో భాస్కర రామారావు మ‌మేక‌మ‌య్యారు. ఇక్కడ టీడీపీ అంటే రామారావు….రామారావు అంటే టీడీపీ అన్న చందంగా ఉంది. అయిన‌ప్పటికీ.. చిన‌రాజ‌ప్ప హ‌వా చ‌లాయించాల‌ని చూస్తుండ‌డమే పార్టీకి చేటు తెస్తున్న ప‌రిణామం. బొడ్డు కు ఉన్న ఫాలోయింగ్ చిన‌రాజ‌ప్పకు లేక‌పోవ‌డం మ‌రో ప్రధాన మైన‌స్‌. దీంతో త‌న‌కు ప్రాధాన్యం ఇవ్వడం లేద‌ని బొడ్డు చాలా కాలం నుంచి నొచ్చుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలోనే వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను టీడీపీ నుంచిపోటీ చేసే ప్రస‌క్తి లేద‌ని ఇటీవ‌ల కాలంలో ఆయ‌న చెప్పుకొస్తున్నారు.

వైసీపీలోకా? జనసేనలోకా?

బొడ్డు వ‌చ్చే ఎన్నికల సమయానికి వైసీపీ లేదా జనసేనలోకి వెళ్ళే అవకాశం ఉందని టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇక‌, చినరాజప్పపై ప్రతికూలత వ్యక్తం కావటానికి ప్రభుత్వంపై వ్యతిరేకతతో పాటు..పలు రాజకీయ కారణాలు కూడా ఉన్నాయి. గత ఎన్నికల సమయంలో టీడీపీ తాము అధికారంలోకి వస్తే కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అయితే, వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి కూడా ఈ హామీ అమలుకు నోచుకునే ఛాన్స్ ఏ మాత్రం లేదు. దీనికి తోడు మంత్రి బంధువర్గంలోని సభ్యులు స్థానికంగా చేసిన పనులు కూడా చినరాజప్పపై వ్యతిరేకత పెరగటానికి కారణాలయ్యాయని చెబుతున్నారు.

అనేక నియోజకవర్గాల్లో…..

తూర్పు గోదావరి జిల్లాలో ఒక్క చినరాజప్పకే కాదు..పలు నియోజకవర్గాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. ముఖ్యంగా చిన‌రాజ‌ప్ప ప‌ట్ల స్థానిక పేద‌ల్లో మరింత వ్యతిరేక‌త గూడు క‌ట్టుకుంది. వారికిసంక్షేమ ఫ‌లాలు అంద‌డం లేద‌ని, మంత్రి త‌మ‌కు అందుబాటులో ఉండ‌డం లేద‌ని అంటున్నారు. ఇక కోన‌సీమ నుంచి వ‌చ్చి పెద్దాపురంలో గెలిచిన రాజ‌ప్ప అక్కడ మొత్తం నాన్‌లోక‌ల్ వాళ్లకే కాంట్రాక్టులు, వ్యాపారాలు అప్పగిస్తున్నార‌న్న విమ‌ర్శలు కూడా ఉన్నాయి. ఇక ఇటీవ‌ల బొడ్డు భాస్కర‌ రామారావుతో గ్యాప్ రావ‌డం ఆయ‌న‌కు మ‌రింత మైన‌స్‌గా మారింది. ఇక జ‌న‌సేన ఒంట‌రి పోరుకు దిగితే ఇక్కడ కాపుల్లో భారీగా చీలిక రానుంది. ఇక ప్రజ‌ల్లోకి చొచ్చుకుపోయే మ‌న‌స్తత్వం అంత‌గా లేని రాజ‌ప్పకు వ‌చ్చే ఎన్నిక‌లు అంత సులువు కాద‌ని స్పష్టమ‌వుతోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*