`దేవినేని`కి దారులు మూసుకుపోయాయా..?

ఆయ‌న రాజ‌కీయాల్లో కీల‌కంగా ఎదిగిన నేత‌. మూడు ద‌శాబ్దాల‌కు పైగా రాజ‌కీయాల్లో ఉన్నారు. ఇప్ప‌టికి రెండు పార్టీలు మారారు. అయినా కూడా ఆయ‌న‌కు ఇప్పుడు రాజ‌కీయ భ‌విష్య‌త్తుపై బెంగ ప‌ట్టుకుంద‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. మ‌రో ప‌ది మాసాల్లోనే ఎన్నిక‌లు ఉన్న నేప‌థ్యంలో ఆయ‌న‌కు ఇప్పుడు ఏంచేయాలో కూడా అర్ధం కావ‌డం లేద‌ని చెబుతున్నారు. ఇంత‌కీ ఆ నేత ఎవ‌రు? ఎందుకు ఆయ‌న రాజ‌కీయ భ‌విష్య‌త్తు శూన్యంగా మారింది? ఇప్పుడు ఆయ‌న ఏంచేయాల‌ని భావిస్తున్నారు? వ‌ంటి కీల‌క అంశాల‌పై జోరుగా చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. విష‌యంలోకి వెళ్తే.. గుంటూరు జిల్లా రేపల్లె నియోజ‌క‌వ‌ర్గంలో ఆస‌క్తిక‌ర రాజ‌కీయం సాగుతోంది. ఇక్క‌డ నుంచి టీడీపీ త‌ర‌ఫున అన‌గాని స‌త్య ప్ర‌సాద్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు.

వైఎస్ కు ఆప్తుడిగా….

అయితే, ఇక్క‌డ టీడీపీలో కీల‌క రోల్ పోషిస్తున్న మ‌రో నేత కూడా ఉన్నారు. ఆయ‌నే దేవినేని మ‌ల్లికార్జున్‌రావు. కాంగ్రెస్‌లో చాలా కాలంగా ఉన్న ఈయ‌న వైఎస్‌కు ఆప్తుడిగా పేరు పొందారు. క‌మ్మ‌వ‌ర్గానికి చెందిన మ‌ల్లికార్జున్‌రావును ప్రోత్స‌హించడం ద్వారా.. ఇక్క‌డ టీడీపీకి చెక్ పెట్టేలా అప్ప‌ట్లోవైఎస్ చ‌క్రం తిప్పారు. దీంతో ఇక్క‌డి లంక గ్రామాలు స‌హా కృష్ణా తీరంలోని ప‌లు ప్రాంతాల్లో ఈయ‌న ప‌ట్టు సాధించాడు. అయితే, 2014 నాటికి ప‌రిస్థితి మారిపోయింది. రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో కాంగ్రెస్ కు ఇక్క‌డి ప్ర‌జ‌లు గండి కొట్టారు. దీంతో అనూహ్యంగా దేవినేని మ‌ల్లికార్జున టీడీపీలోకి జంప్ చేశారు. ఇక్క‌డ త‌న‌కు గుర్తింపు వ‌స్తుంద‌ని ఆయ‌న ఆశించారు. అయితే, అనుకోకుండా ఇక్క‌డ నుంచి అన‌గాని స‌త్య‌ప్ర‌సాద్ టికెట్ ద‌క్కించుకున్నారు.

ఆయనకు పట్టున్నప్పటికీ….

పార్టీలోను, అధినేత వ‌ద్ద కూడా అన‌గాని ఇక్క‌డ భారీ ఎత్తున మార్కుల కొట్టేశారు. అదేవిధంగా ప్ర‌జ‌ల్లోనూ నిత్యం అన‌గాని స‌త్య ప్ర‌సాద్ పేరు వినిపిస్తోంది. ప్ర‌జ‌ల‌కు ఆయ‌న చేరువ‌గా ఉండ‌డం, వారికి క‌ష్టాలు రాకుండా చూసుకోవ డం, తాగునీటి స‌మ‌స్య‌ను ప‌రిష్కరించ‌డంలో ముందుండ‌డం వంటివి అన‌గానికి క‌లిసి వ‌స్తున్న అంశాలు. మ‌రి ఈనేప‌థ్యంలో ఇక‌, దేవినేని ప్ర‌జ‌ల్లో ఎంత తిరుగుతున్నా.. ఆశించిన మైలేజీ మాత్రం రావ‌డం లేదు. నిజానికి ఆయ‌న‌కు రేపల్లె, వేమూరు నియజకవర్గాల్లో గ‌ట్టి ప‌ట్టుంది. మ‌రోప‌క్క‌, సిట్టింగ్ అన‌గానికి మాత్రం హ‌వా పెరిగిపోతోంది.

పార్టీ మారతారా?

వాస్త‌వానికి గ‌త ఎన్నిక‌ల్లో దేవినేని అన‌గాని గెలుపుకోసం త‌న వంతుగా కృషి చేశారు. ఆ త‌ర్వాత పార్టీలో ప్ర‌యారిటీ ఉంటుంద‌ని ఆయ‌న ఆశించినా ఆయ‌న్ను పార్టీ ఏ మాత్రం ప‌ట్టించుకోలేదు. దీనిని గ‌మ‌నిస్తున్న దేవినేని అనుచ‌రులు.. టీడీపీలో ఉన్నా.. ప్ర‌యోజనం లేద‌ని చెబుతున్నార‌ట‌. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగూ టికెట్ రాదుకాబ‌ట్టి.. ఎంత ప్ర‌య‌త్నించినా.. వృధాయేన‌ని వారు వివ‌రిస్తున్నారట‌. అదేస‌మ‌యంలో కొంద‌రు అనుచ‌రులు.. ఇక‌, పార్టీ మార‌డమే త‌క్ష‌ణ అవ‌స‌ర‌మ‌ని చెబుతున్నార‌ట‌. తెలుగు దేశంలో అనగాని స‌త్య‌ప్ర‌సాద్ కే మ‌ళ్లీ టికెట్ ఇస్తార‌ని, ఆయ‌న‌ను కాద‌ని ఎవ‌రికీ ఇచ్చే సాహ‌సం కూడా జ‌ర‌గ‌ద‌ని అంటున్నారు.

వైసీపీకి వెళ్లినా….

ఈ నేప‌థ్యంలో రాజ‌కీయంగా భ‌విష్య‌త్తుకు బాట వేసుకునేందుకు పార్టీ మార‌డం త‌ప్ప దారిలేద‌ని అంటున్నార‌ట‌. ఈ క్ర‌మ‌లో పార్టీ మార్పుపై దృష్టిపెట్టాల‌ని కూడా చెబుతున్నార‌ట‌. అయితే, టీడీపీని కాద‌ని ఏ పార్టీలోకి వెళ్లాలి? ఇప్పుడు ఇదీ దేవినేని పీడిస్తున్న ప్ర‌శ్న‌. ఇప్ప‌టికే ఆయ‌న కాంగ్రెస్‌ను కాద‌ని వ‌చ్చాడు. టీడీపీలో ఇమ‌డ‌లేక‌పోయారు. ఇక‌, ఉన్న‌వి వైసీపీ.. జ‌న‌సేన‌లు మాత్ర‌మే. వైసీపీలోకి వెళ్లినా.. అక్క‌డ ఇప్ప‌టికే మోపిదేవి వెంక‌ట ర‌మ‌ణ వైసీపీ అభ్య‌ర్థిగా ప్ర‌చారంలో ఉన్నాడు. ఇక‌, మిగిలింది జ‌న‌సేన‌. చేరితే గీరితే.. జ‌న‌సేన‌లోకే వెళ్లాల్సి ఉంటుంద‌ని అనుచ‌రులు పేర్కొంటున్నారు. ఈ నేప‌థ్యంలో దేవినేని విష‌యంపై జోరు చ‌ర్చ‌లు సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*