వీరి రాజకీయ జీవితం ముగిసినట్లే….!

నాయ‌కులు ఎప్పుడూ రాజ‌కీయాల్లోనే ఉండాలని కోరుకుంటారు. చివ‌రి శ్వాస వ‌ర‌కూ రాజ‌కీయాల్లోనే ఉండాలనుకుంటారు. కానీ త‌మ వార‌సుల‌కు అవ‌కాశం ఇచ్చేందుకు ప్ర‌స్తుత రాజ‌కీయ నాయ‌కులు ఏ మాత్రం వెనుకాడటం లేదు. త‌మ త‌ర్వాతి త‌రంతో రాజ‌కీయ ఓన‌మాలు దిద్దించేసి.. ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల బ‌రిలోకి దింపేలా సిద్ధం చేసేశారు. 2019 ఎన్నిక‌ల్లో టీడీపీలో యువ‌తరం ఎక్కువ‌గా క‌నిపించ‌బోతోందనేకంటే రిటైర్మెంట్ తీసుకునే నాయ‌కులే ఎక్కువ మంది ఉన్నారనుకోవ‌చ్చు. ఎన్నో ఏళ్లుగా పార్టీకి సేవ‌లందించిన సీనియ‌ర్లలో కొంద‌రు పూర్తిగా అస్త్రస‌న్యాసం చేస్తుంటే.. మ‌రికొంద‌రు మాత్రం తెర వెనుక రాజ‌కీయాలు చేస్తామంటూ చెబుతున్నారు. ఇప్ప‌టికే ఇందుకు సంబం ధించి కొంద‌రు పార్టీ అధినేత చంద్ర‌బాబుతో సంప్ర‌దింపులు జ‌రుపుతూ.. ఆయ‌న గ్రీన్ సిగ్న‌ల్ కోసం వేచిచూస్తున్నారు.

వారసులకు ఇచ్చేందుకు…..

సీనియ‌ర్లంద‌రూ విశ్రాంతికి సిద్ధ‌మ‌వుతున్నారు. ఇన్నాళ్లూ పార్టీ బాధ్య‌త‌లు భుజ‌స్కందాల‌పై మోసిన వారంతా.. ఇప్పుడు ప‌క్క‌కు త‌ప్పుకుని న‌వ త‌రానికి దారిచ్చేందుకు రెడీ అవుతున్నారు. 2019 ఎన్నిక‌లు అటు టీడీపీకి ఎంతో క్లిష్ట‌మైన విష‌యం అని తెలిసిందే! ప్ర‌జ‌ల ఆలోచ‌నా విధానం కూడా మారుతున్న త‌రుణంలో.. కొత్త ర‌క్తాన్ని తీసుకొచ్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. అందుకే రిటైర్మెంట్ ప్ర‌క‌టించేస్తున్నారు. ఒకరిద్దరు కాదు. ఈ జాబితాలో చాలా మంది నేతలు, అందునా ప్రముఖులు ఉండటం గమనార్హం. ముందుగా అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తన రిటైర్మెంటును అనౌన్స్ చేశాడు. వచ్చే ఎన్నికల్లో తన తనయుడు జేసీ పవన్ అనంతపురం నుంచి ఎంపీగా పోటీ చేస్తాడని జేసీ డిక్లేర్ చేసేశాడు. అలాగే తాడిప‌త్రి ఎమ్మెల్యే జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి సైతం త‌న త‌న‌యుడిని తాను త‌ప్పుకుని అసెంబ్లీకి పోటీ చేయించాల‌ని చూస్తున్నారు.

బొజ్జల కూడా……..

కర్నూలు జిల్లాలో తెలుగుదేశం సీనియర్ డిప్యూటీ సీఎం కేఈ కూడా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని తెలుస్తోంది. ఆయన స్థానంలో తనయుడు కేఈ శ్యామ్ పత్తికొండ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే వైసీపీ నేత నారాయణ రెడ్డి హత్య కేసులో కేఈ శ్యామ్ పేరు ప్రముఖంగా వినిపించింది. కేసు కూడా నమోదైంద‌న విష‌యం తెలిసిందే. ఇక చిత్తూరు జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బొజ్జల కూడా వచ్చేసారి పోటీ చేయడని తెలుస్తోంది. ఆయన స్థానంలో తనయుడు సుధీర్‌రెడ్డి రంగంలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ మేరకు చంద్రబాబు నుంచి గ్రీన్ సిగ్నల్ లభించిందట. ఇక ఫిరాయింపు ఎంపీగా తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎస్పీవై రెడ్డి కూడా వచ్చే సారి పోటీ చేయడం లేదు. ఆయన స్థానంలో ఆయన వారసుడిగా ఆయ‌న అల్లుడు నంద్యాల ఎంపీగా రంగంలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

చాలామంది తప్పుకుని…..

రాయలసీమ ప్రాంత నేతలు మాత్రమే కాదు.. మ‌రికొంత‌మంది ఈ జాబితాలో నిలవనున్నారని తెలుస్తోంది. ఎంపీ మురళీమోహన్ వచ్చేసారి పోటీ చేసే అవకాశాలు లేవు. ఆయన స్థానంలో ఆయన కోడలు మాగంటి రూపాదేవి రంగంలోకి దిగే అవకాశాలున్నాయి. ఇక కోడెల కూడా వచ్చేసారి బరిలోకి దిగుతారా ? లేదా ? ఆయ‌న త‌న‌యుడికి సీటు ఇస్తారా ? అన్న‌ది చూడాలి. అయితే కోడెల ఫ్యామిలీకి ఒకే సీటు మాత్ర‌మే ఇస్తాన‌ని బాబు చెప్పిన‌ట్టు టాక్‌. ఇక సీనియ‌ర్ పార్ల‌మెంటేరియ‌న్, న‌ర‌సారావుపేట ఎంపీ రాయ‌పాటి రంగారావు త‌న‌యుడు రాయ‌పాటి రంగారావు కూడా ఎంపీ లేదా ఎమ్మెల్యే రేసులో బ‌రిలోకి దిగ‌డం ఖాయం. ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఉన్న ఇలాంటి వారు చాలా మంది వచ్చేసారి తప్పుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*