
వచ్చే ఎన్నికల్లో నవ్యాంధ్రలో జరిగే ఎన్నికల్లో వరుసగా రెండో సారి విజయం సాధించి సీఎం అవ్వాలన్న రికార్డ్ క్రియేట్ చేసేందుకు ఉరకలు వేస్తున్న టీడీపీ జాతీయ అధ్యక్షులు, ఏపీ సీఎం చంద్రబాబు ఎన్నికల్లో చాలా షాకింగ్ నిర్ణయాలే తీసుకోనున్నారు. కనీసం 30 నుంచి 40 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు లేదా ఇన్ఛార్జులకు టిక్కెట్లు ఇవ్వని పరిస్థితి ఉంటుందని ఇప్పటికే ప్రాధమిక అంచనాలు టీడీపీ వర్గాల నుంచే వ్యక్తమౌతున్నాయి. 175 నియోజకవర్గాల్లో పలువురు ఇన్‌ఛార్జులతో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి జంప్ చేసిన ఎమ్మెల్యేలను సైతం బాబు పక్కన పెట్టి ఆ ప్లేస్‌లో కొత్తవారికి ఛాన్స్ ఇవ్వనున్నారన్నది ఇప్పటికే స్పష్టం అయ్యింది.
వ్యతిరేకత ఉందని తెలియడంతో……
కీలకమైన గుంటూరు జిల్లాలో సైతం కొంతమంది ఇన్‌ఛార్జులు, సిట్టింగ్ ఎమ్మెల్యేల మార్పులు, చేర్పులు గ్యారెంటీగా ఉండే ఛాన్సులు ఉన్నాయి. ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కొంటున్న వారు కొందరైతే, సామాజిక సమీకరణలు ఇతరత్రా కారణాలతో మరికొంతమంది చంద్రబాబు పక్కన పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. జిల్లాల్లో 17 అసెంబ్లీ సీట్లలో గత ఎన్నికల్లో టీడీపీ 12 సీట్లలో విజయం సాధిస్తే వైసీపీ మాచర్ల, నరసారావుపేట, గుంటూరు తూర్పు, బాపట్ల, మంగళగిరి నియోజకవర్గాల్లో విజయం సాధించింది. జిల్లాల్లో కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. ఆయా నియోజకవర్గాల్లో స్థానిక సమస్యల ప్రజాప్రతినిధులతోనూ, పార్టీ కేడర్‌తోనూ వారికి ఏ మాత్రం పొసగని పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే వారికి తిరిగి సీటు ఇస్తే ఓడిస్తామని కూడా పార్టీ కేడర్లు శపథాలు చేస్తున్నారంటే ఆ ఎమ్మెల్యేలపై వ్యతిరేఖత ఏ స్థాయిలో ఉందో అర్థమౌతోంది.
రావెలకు గ్యారంటీగా…….
జిల్లాల్లో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో ముందుగా అవుట్ అయ్యే వ్యక్తి మాజీ మంత్రి ప్రత్తిపాడు ఎమ్మెల్యే రావెల కిషోర్ బాబు. రావెల కిషోర్ బాబుకు పార్టీలో వచ్చినంతా లక్కీ ఛాన్స్ ఎవరికి రాలేదు. గత ఎన్నికలకు ముందు ఐఆర్ఎస్ అధికారిగా ఉన్న ఆయన ఎన్నికల వేళ పార్టీలోకి రావడం ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే సామాజిక సమీకరణల నేపథ్యంలో చంద్రబాబు ఆయనకు మంత్రి పదవి ఇవ్వడం చకచకా జరిగిపోయాయి. అయితే మూడేళ్లలో అటు శాఖా పరంగానే కాకుండా ఇటు నియోజకవర్గంలో తీవ్రమైన వ్యతిరేఖతను ఎదుర్కున్న రావెలను బాబు తప్పించక తప్పలేదు. ఆ తర్వాత కూడా ఆయన వ్యక్తిగత వ్యవహారశైలి నేపథ్యంలో ఆయనపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో రావెలను గ్యారెంటీగా తప్పిస్తారన్నది ఇప్పటికే పార్టీలో స్పష్టం అయ్యిపోయింది. నిత్యం చంద్రబాబుపై పదే పదే తీవ్రమైన అసంతృప్తి వ్యాఖ్యాలు చేస్తూ అటు అసెంబ్లీలోనూ బయట పార్టీని ఇరకాటంలో పెడుతున్న గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల రెడ్డిని సైతం గుంటూరు వెస్ట్ నుంచి తప్పించడం దాదాపు ఖరారే.
మోదుగలదీ అదే పరిస్థితి……
మోదుగులకు ఇస్తే గిస్తే మాచర్ల అసెంబ్లీ సీటు ఇవ్వడం లేదా ఆయనను లైట్ తీసుకోవడం జరుగుతుందని తెలుస్తోంది. ఇక గుంటూరు తూర్పు నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ మద్దాళి గిరిధర్‌రావును సామాజిక సమీకరణల నేపథ్యంలో తప్పించనున్నారట. ఆయనకు వేరే పదవి ఇవ్వడం ద్వారా తూర్పు నియోజకవర్గం నుంచి మైనార్టీ వర్గానికి చెందిన వ్యక్తిని రంగంలోకి దింపుతారని తెలుస్తోంది. సత్తెనపల్లి నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న స్పీకర్ కోడెల శివప్రసాద్ రావును నరసారావుపేటకు పంపి సత్తెనపల్లిలో మరో వ్యక్తికి ఛాన్స్ ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఇక పల్నాడులో టీడీపీ గత నాలుగు ఎన్నికల్లో వరుసుగా ఓడిపోతూ వస్తున్న మాచర్ల పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. ఇక్కడ నుంచి ఇన్‌ఛార్జ్‌గా ఉన్న కొమ్మారెడ్డి చెలమారెడ్డిని తప్పించి మరో బలమైన అభ్యర్థి కోసం అన్వేషణ జరుగుతోంది.
అసహనంతో ఉన్న బాబు…..
గుంటూరు వెస్ట్ సిట్టింగ్ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల రెడ్డి పేరు ఇక్కడ పరిశీలన ఉంది. ఆయన రావడానికి ఇష్టపడని పక్షంలో మరో బలమైన వ్యక్తిని రంగంలోకి దింపే ఛాన్స్ ఉంది. కీలకమైన రాజధాని ఏరియా విస్తరించి ఉన్న తాడికొండ నియోజకవర్గం ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ విషయంలోను చంద్రబాబు అసహనంతోనే ఉన్నారు. ఆయనకు వ్యతిరేఖంగా నియోజకవర్గంలో పార్టీలోనే పెద్ద టీం తయారయ్యింది. జడ్పీ వైస్‌చైర్మన్ వడ్లమూడి పూర్ణచంద్రరావు ఇటీవల శ్రవణ్‌కు వ్యతిరేకంగా పెద్ద సమావేశం ఏర్పాటు చేసి ఆయనకు ఎందుకు ఓటు వెయ్యాలని బహిరంగంగా ప్రశ్నించారంటే శ్రవణ్ కుమార్‌పై పార్టీ కేడర్లోనే ఎంత వ్యతిరేకత ఉందో స్పష్టం అవుతుంది.
మంగళగిరిలోనూ……
ఇక గత ఎన్నికల్లో మంగళగిరిలో ఓడిపోయిన ఇన్ఛార్జ్ గంజి చిరంజీవిని కూడా గ్యారెంటీగా తప్పించనున్నారు. మంగళగిరి రాజధాని ప్రాంతం కావడంతో అక్కడ నుంచి బలమైన వ్యక్తుల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఇక పార్టీ గత మూడు ఎన్నికల్లో ఓడిపోతూ వస్తున్న బాపట్లలో గత ఎన్నికల్లో ఓడి… ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న అన్నం సతీష్ ప్రభాకర్‌ను సామాజిక సమీకరణల నేపథ్యంలో తప్పించే ఛాన్సులు ఉన్నాయి. సతీష్ ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉండడంతో అక్కడ నుంచి నియోజకవర్గ పార్టీ నాయకులు వేగేశన నరేంద్ర వర్మ పేరు ప్రస్తావనకు వస్తోంది. మరి ఈ సమీకరణలు ఎన్నికల వేళ ఎలా మారతాయో ? చూడాలి.
Leave a Reply