ఇక్కడ బాబు కొంప మునిగినట్లే….!

ఏపీ రాజ‌ధాని ప్రాంతం గుంటూరు జిల్లాలో అధికార పార్టీ హ‌వా ఎలా ఉంది? ఎలా దూసుకుపోతోంది? గ‌త ఎన్నిక‌ల్లో స‌త్తా చాటుకున్న ఈ పార్టీ.. వ‌చ్చే ఎన్నిక‌ల‌నాటికి పుంజుకుంటుందా? లేక కూలిపోతుందా? అస‌లు రాజ‌ధాని జిల్లా గుంటూరులో అధికార పార్టీ రాజ‌కీయాలు ఎలా ఉన్నాయి? వ‌ంటి కీల‌క అంశాల‌పై ప్ర‌స్తుతం చ‌ర్చ సాగుతోంది. నిజానికి రాష్ట్రంలోనే టీడీపీ ప‌రిస్థితి ఆశించిన విధంగా లేద‌నేది అంద‌రూ అంగీక‌రిస్తున్న విష‌యం.పైకి చంద్ర‌బాబు చెబుతున్న మాట‌లు, చేస్తున్న ప్ర‌చారం అంతా కూడా డొల్లేన‌ని తేలిపోతోంది. ఇక‌, రాజ‌ధాని ప్రాంతంలో ప‌రిస్థితి మ‌రింత దారుణంగా ఉంద‌ని అంటున్నారు విశ్లేష‌కులు. గ‌త ఎన్నిక‌ల్లో ఈ జిల్లాలో టీడీపీ మూడు ఎంపీ సీట్ల‌తో పాటు 12 అసెంబ్లీ స్థానాల‌ను గెలుచుకుంది.

ఐదు నియోజకవర్గాల్లో వైసీపీ…..

అత్యంత కీల‌క‌మైన న‌ర‌స‌రావుపేట నియోజ‌క‌వ‌ర్గాన్ని పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించారు. దీంతో ఇక్క‌డ బీజేపీ పూర్తిగా చేతులు ఎత్తేసింది. ఈ నేప‌థ్యంలో ఇక్క‌డ వైసీపీ అభ్య‌ర్థి డాక్ట‌ర్ గోపిరెడ్డి శ్రీనివాస‌రెడ్డి విజ‌యం సాధించారు. అదేవిధంగా జిల్లాలోని ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ విజ‌యం సాధించింది. ఇదిలావుంటే, రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాల్లోనూ వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయింపులు కొన‌సాగినా.. ఒక్క గుంటూరులో మాత్రం ఏ ఒక్క నేతా కూడా వైసీపీ నుంచి టీడీపీలోకి చేర‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, టీడీపీ విష‌యానికి వ‌స్తే.. ఇక్క‌డ మంది బ‌లం ఉన్నా..వచ్చే ఎన్నిక‌ల నాటికి అధికార పార్టీకి క‌ష్టాలే అని అంటున్నారు విశ్లేష‌కులు. ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే.. గుంటూరులో వైసీపీ మేజ‌ర్ స్థానాలు కైవసం చేసుకునే అవ‌కాశం ఉందని చెబుతున్నారు.

అవినీతే అసలు కారణమా?

గుంటూరు జిల్లాలోని కీల‌క నేత‌లు, టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు అత్యంత స‌న్నిహితులుగా మెలుగుతున్న వారు సైతం.. అవినీతికి అంట‌కాగుతున్నార‌న్న వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌త్తిపాడు ఎమ్మెల్యే, మాజీ మంత్రి రావెల కిశోర్ బాబును చంద్ర‌బాబు ప‌క్క‌న పెట్టారు. ఇక్క‌డ వైసీపీ పూర్తిగా పుంజుకుంది. ఇక‌, మంత్రి న‌క్కా ఆనంద్‌బాబు ప‌రిస్థితి కూడా అంతే. వేమూరు నుంచి ప్రాతినిథ్యం వ‌హిస్తున్న ఆయ‌న ప్ర‌జ‌ల‌కు చేరువ‌గా ఉండ‌డం లేద‌ని పెద్ద ఫిర్యాదులే అందుతున్నాయి. ఆయ‌న ఎప్పుడూ స్థానిక స‌మ‌స్య‌ల‌పై దృష్టి పెట్ట‌డం లేద‌ని, కేవ‌లం రాష్ట్ర స‌మ‌స్య‌లైతేనే త‌న‌వద్ద‌కు రండి! అనే ధిక్కార స్వ‌రం వినిపిస్తార‌ని కూడా ఆయ‌నపై ఫిర్యాదులు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో ఇక్క‌డ టీడీపీ గెలుపు అంత ఈజీ కాదు. గ‌త రెండు ఎన్నిక‌ల్లోనే ఓట‌మి అంచుల వ‌ర‌కు వెళ్లి గెలిచిన న‌క్కా ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో చూస్తే టీడీపీ వాళ్లు వేసే దెబ్బ‌తోనే ఓడిపోవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

ప్రత్తిపాటికి నెగిటివ్…….

అదేవిధంగా చిల‌క‌లూరిపేట ఎమ్మెల్యే, సీనియ‌ర్ లీడ‌ర్‌, మంత్రి ప్ర‌త్తిపాటికి వ్య‌తిరేక ప‌వనాలు వీస్తున్నాయి. ఆయ‌న ఫ్యామిలీ హ‌వాపై ప్ర‌త్యేక క‌థ‌నాలే వినిపిస్తున్నాయి. రెండుసార్లు వ‌రుస‌గా గెలిచినా, మంత్రిగా ఉండ‌డంతో ఆయ‌న‌పై వ్య‌తిరేక‌త వ‌స్తుంటే… మంత్రిస్థాయిలో ఉండి కూడా నియోజ‌క‌వ‌ర్గాన్ని ఆశించిన స్థాయిలో అభివృద్ధి చేయ‌లేక‌పోవడం, అవినీతి హెచ్చుమీర‌డం, మంత్రిపై శాఖాప‌రంగాను, వ్య‌క్తిగ‌తంగా వ‌స్తోన్న ఆరోప‌ణ‌లు ఆయ‌నకు పెద్ద మైన‌స్‌గా మారాయి. ఇవ‌న్నీ ఇక్క‌డ‌ వైసీపీకి చాలా ప్ల‌స్ అవుతున్నాయి. అదేవిధంగా స‌త్తెన‌ప‌ల్లిలో స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద‌రావుకు ఆయ‌న కుమారుడే మైన‌స్ అని చాలా మంది చెవులు కొరుక్కుంటున్నారు. ఆయ‌న దూకుడు, అవినీతి దందాలు కోడెల‌ను భ్ర‌ష్టు ప‌ట్టిస్తున్నాయ‌న్న చ‌ర్చ జిల్లాలోనే బాగా స్ప్రెడ్ అయిపోయింది.

భూకబ్జాలు…ఆరోపణలు…..

ఇక‌, తెనాలిలో ఇక్క‌డి ఎమ్మెల్యే ఆల‌పాటి రాజేంద్ర‌ప్ర‌సాద్‌, ఉర‌ఫ్ రాజా దుందుడుకు చ‌ర్య‌లు పార్టీకి త‌ల‌నొప్పిగా మారాయి. ఎక్క‌డిక‌క్క‌డ భూ క‌బ్జాలు, అవినీతి పురాణం న‌డిపిస్తూ.. అదికార పార్టీని భ్ర‌ష్టు ప‌ట్టిస్తున్నార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఇక్క‌డ వైశ్య‌, బ్రాహ్మ‌ణ వ‌ర్గాల్లో ఆయ‌న‌పై తీవ్ర వ్య‌తిరేక‌త ఉంది. అలాగే కొల్లిప‌ర మండ‌లంతో పాటే తెనాలి టౌన్ ఈ సారి రాజాకు మైన‌స్ కానున్నాయి. ఇక‌, గుంటూరు జిల్లాలో మ‌రో ముఖ్య‌మైన నియోజ‌క‌వ‌ర్గం రేప‌ల్లెలో సిట్టింగ్ ఎమ్మెల్యే అన‌గాని స‌త్య‌ప్ర‌సాద్ కూడా వ్య‌తిరేక‌త ఎదుర్కొంటున్నారు. సొంత వ్య‌వ‌హ‌రాలు చ‌క్క‌బెట్టుకో వ‌డంలోనే ఆయ‌న‌కు తీరిక ఉండ‌డం లేద‌ని స్థానికులు పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నారు. ప్ర‌జ‌ల‌కు టైం కేటాయించ‌డం లేద‌ని విమ‌ర్శ‌లు కూడా ఉన్నాయి.

ఇక్కడ కొంత అనుకూలమైనా……

గుంటూరు వెస్ట్‌లో ప్ర‌స్తుతానికి ప‌రిస్థితి టీడీపీకి చాలా స్వ‌ల్పంగా అనుకూలంగా ఉన్నా ఇక్క‌డ సిట్టింగ్ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల రెడ్డి వ‌చ్చే ఎన్నిక‌ల్లో సీటు మార‌తార‌న్న వార్త‌ల‌తో పాటు ఇక్క‌డ క్యాండెట్ల‌ను బ‌ట్టి గెలుపు ఓట‌ములు డిసైడ్ కానున్నాయి. నిజానికి మోదుగుల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తాను ఎంపీ సీటును త్యాగం చేసినా.. చంద్ర‌బాబు త‌న‌కు గుర్తింపు ఇవ్వ‌డం లేద‌ని ఆయ‌న భావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న నేరుగా ప‌లు వేదిక‌ల‌పై విమ‌ర్శ‌లు చేశారు. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఆయ‌న వైసీపీలోకి జంప్ చేస్తార‌నే ప్ర‌చారం సాగుతోంది. గుంటూరు ఈస్ట్, మాచ‌ర్ల‌, బాప‌ట్ల‌లో వైసీపీకే కాస్త ఎడ్జ్ ఉంది. ఈ మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ నాయ‌క‌త్వ స‌మ‌స్య‌తో వెంటాడుతోంది. మాచ‌ర్ల‌, ఈస్ట్‌, బాప‌ట్ల‌లో గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసిన వారు కాకుండా కొత్త అభ్య‌ర్థుల పేర్లు తెర‌మీద‌కు వ‌స్తున్నాయి. బాప‌ట్ల రేసులో వేగేశ‌న న‌రేంద్ర‌వ‌ర్మ ముందున్నారు.

ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత……

ఇక‌, గుంటూరు జిల్లాలోని మ‌రో నియోజ‌క‌వ‌ర్గం తాడికొండ‌లో పార్టీ స్ట్రాంగ్‌గా ఉన్నా సిట్టింగ్ ఎమ్మెల్యే తెనాలి శ్ర‌వ‌ణ్‌కుమార్‌పై వ్య‌తిరేక‌త ఉంది. ఈయ‌న దూకుడు స్వ‌భావం చూపించ‌క‌పోవ‌డ‌మే ఈయ‌న‌కు పెద్ద మైన‌స్‌గా మారింది. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై స్పందించ‌డంలో చాలా లేటుగా ఉంటార‌ని, ప్ర‌భుత్వం దృష్టికి తీసుకు వెళ్ల‌డంలో మీన మేషాలు లెక్కిస్తార‌ని ఆయ‌న‌కు బ్యాడ్ నేమ్ ఉంది. ఇక‌, చిన్నా చిత‌కా కాంట్రాక్ట‌ర్ల ద‌గ్గ‌ర అవినీతి ష‌రా మామూలే .. అన్న‌ట్టుగా ఉండ‌డం గ‌మ‌నార్హం. పెద‌కూర‌పాడులో సిట్టింగ్ ఎమ్మెల్యే కొమ్మాల‌పాటి శ్రీథ‌ర్‌పై స్వ‌ల్ప వ్య‌తిరేక‌త ఉన్నా దానిని వైసీపీ క్యాష్ చేసుకోలేక చేతులు ఎత్తేసే ప‌రిస్థితి. ఇక్క‌డ వైసీపీ బ‌ల‌హీన‌తే టీడీపీ ప్ర‌ధాన బ‌లం. ఇక జిల్లాలో తాజాగా స‌ర్వేల‌తో పాటు రాజ‌కీయ వాతావ‌ర‌ణం బ‌ట్టి చూస్తే వినుకొండ‌, గుర‌జాల‌, పొన్నూరుతో పాటు తాడికొండ‌లో మాత్ర‌మే టీడీపీకి విజ‌యావ‌కాశాలు బ‌లంగా ఉన్నాయి. రాజ‌ధాని నియోజ‌క‌వ‌ర్గం అయిన మంగ‌ళ‌గిరిలో టీడీపీకి ఎడ్జ్ క‌న‌ప‌డుతున్నా స‌రైన క్యాండెంట్ ఎంపిక కూడా ఇక్కడ గెలుపు ఓట‌ములు ప్ర‌భావితం చేయ‌నుంది. సో.. మొత్తానికి గుంటూరు జిల్లాలోని కీల‌క నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ ప‌రిస్థితి ఇదీ!! మ‌రి వ‌చ్చే ఎన్నిక‌ల‌కు మ‌రో ప‌దిమాసాల స‌మ‌యం ఉన్నందున ఈ ప‌రిస్థితిని చంద్ర‌బాబు చ‌క్క‌దిద్దుతారో లేక వ‌దిలేస్తారో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*