టీడీపీ ఎఫెక్ట్…కాంగ్రెస్ వైపు మాజీల చూపు !!

రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. నిన్నటి వరకూ కాంగ్రెస్ పార్టీ పేరు చెబితేనే పట్టించుకోని వారంతా ఇపుడు ఇటు వైపుగా చూస్తున్నారు. అధికారంలో ఉన్నా తెలుగుదేశం పార్టీ అసలు ఉనికి కోల్పోయిన కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకునేందుకు ముందుకు రావడమే గొప్ప పరిణామంగా భావిస్తున్నారు. ఈ పొత్తులో భాగంగా వచ్చే ఎన్నికల్లో జిల్లాకు రెండు సీట్లు వంతున కాంగ్రెస్ కి దక్కుతాయని ప్రచారం సాగుతోంది. దాంతో ఉత్తరాంధ్ర హస్తం పార్టీలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. పార్టీని వీడిన వారు కూడా ఇటువైపు వస్తారన్న ధీమా పెరిగింది.

ఒక ఎంపీ, ఆరు ఎమ్మెల్యే….

ఉత్తరాంధ్రాలో విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం కలుపుకుని మొత్తం ముప్పయి నాలుగు అసెంబ్లీ సీట్లకు గాను ఆరు సీట్లు పొత్తులో భాగంగా కాంగ్రెస్ కి దక్కుతాయని అంచనాలు వేస్తున్నారు. అలాగే ఒక ఎంపీ సీటు కూడా ఇస్తారని భావిస్తున్నారు. దీంతో కాంగ్రెస్ లో నిన్నటి వరకూ అణగారిపోయిన ఆశలతో ఉన్న వారికి ఒక్కసారిగా ప్రాణం లేచి వచ్చినట్లైంది. పోటీ చేందుకు ప్రస్తుతం ఉన్న వారంతా సిధ్ధమవుతున్నారు. విశాఖ వరకూ చూసుకుంటే మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, మాజీ ప్రభుత్వ విప్ ద్రోణం రాజు శ్రీనివాస్ లకు సీట్లు ఖాయమని అంటున్నారు.

సర్దుకుంటున్న నేతలు…

ఇక విజయనగరం జిల్లాలో చూసుకుంటే కాంగ్రెస్ కి సరైన నాయకత్వం లేదు. ఉన్న వారంతా ఇతర పార్టీల్లోకి వెళ్ళిపోయారు. ప్రస్తుతం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న ఎడ్ల రమణమూర్తికి సీటు కంఫర్మ్ కావచ్చునని భావిస్తున్నారు. . మరో సీటు కోసం సమర్ధుడైన అభ్యర్ధిని వెతకాల్సిందే. శ్రీకాకుళం తీసుకుంటే అక్కడ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు డోల జగన్ వంటి వారు ఉన్నారు. జగన్ కి సీటు ఇచ్చినా మరో సీటు కు అభర్ధిని చూసుకొవాలి. ఇక అరకు ఎంపీ సీటు మాజీ కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ కి ఇస్తారని ప్రచారం సాగుతోంది.

మాజీలు వస్తారా…

ప్రస్తుతం ఇతర పార్టీలో సర్దుకున్న మాజీ కాంగ్రెస్ నాయకులు ఈ పొత్తుల తరువాత పార్టీలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ నాయక‌త్వం భావిస్తోంది. వైసీపీ, జనసెన, టీడీపీలో చేరి అక్కడ టికెట్ గ్యారంటీ లేని వారు కాంగ్రెస్ లో తిరిగి చేరడం ద్వారా లాభపడదామని అనుకుంటున్నారు. రేపటి ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ బంధం గెలుస్తుందన్న అంచనాలు ఉంటే మాత్రం పాత వారు తిరిగి హస్తం పార్టీ గూటికి చేరడం ఖాయమని అంటున్నారు. ఇక ఇప్పటివరకూ వేరే పార్టీలకు పోదామని చూస్తున్న వారు కూడా కాంగ్రెస్, టీడీపీ పొత్తు తరువాత ఆలోచన మార్చుకున్నారని అంటున్నారు. మరి చూడాలి తాజా రాజకీయ పరిణామాలతో కాంగ్రెస్ ఎంత వరకూ రాజకీయంగా నిలదొక్కుకుంటుందో.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*