వీరంతా టీడీపీలో చేరితే…?

telugudesam-party-joinings-in-kurnool-district

తెలుగుదేశం పార్టీ కర్నూలు జిల్లాలో సీనియర్ నేతలకు గేలం వేస్తోంది. ఈమేరకు వారితో చర్చలు కూడా జరిపినట్లు తెలుస్తోంది. కర్నాూలు జిల్లాలో బలంగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడానికి చంద్రబాబు నేరుగా రంగంలోకి దిగారని చెబుతున్నారు. జగన్ ను నేరుగా దెబ్బతీయడానికి ఖచ్చితంగా సీనియర్ నేతలను పార్టీలోకి చేర్చుకోవాలని భావిస్తున్నారు. కర్నూలు జిల్లాలో జగన్ పార్టీని ఎన్నికలకు ముందే మానసికంగా దెబ్బ తీయాలన్న ప్రయత్నానికి చంద్రబాబు తెరతీశారు. ఇప్పటికే ఆ ప్రయత్నాలు ఊపందుకున్నాయని చెబుతున్నారు.

కోట్ల ఫ్యామిలీని….

కర్నూలు జిల్లాలో బలమైన కోట్ల ఫ్యామిలీని తెలుగుదేశం పార్టీలోకి తీసుకురావాలని చంద్రబాబు యోచిస్తున్నారు. ఈ మేరకు కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డితో కూడా చర్చలు ప్రారంభించినట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీలోకి కోట్ల ఫ్యామిలీ రాకను వ్యతిరేకిస్తున్న కేఈ కృష్ణమూర్తిని కూడా చంద్రబాబు బుజ్జగించినట్లు తెలుస్తోంది. కోట్ల రాకతో జగన్ ను బలహీన పర్చడమే కాకుండా, పార్టీని బలోపేతం చేయవచ్చని కేఈకి నచ్చజెప్పారు. కోట్ల ఫ్యామిలీ రాకతో ఎలాంటి ఇబ్బందులు మీకు ఉండవని కూడా కేఈకి చంద్రబాబు భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. కోట్ల పార్టీలో చేరితే ఆయనను కర్నూలు ఎంపీగా బరిలోకి దించాలన్న యోచనలో చంద్రబాబు ఉన్నారు.

గౌరు కుటుంబాన్ని కూడా….

ఇక పాణ్యంలో పట్టున్న గౌరు కుటుంబాన్ని కూడా చంద్రబాబు పార్టీలోకి ఆహ్వానించినట్లు ప్రచారం జరుగుతోంది. పాణ్యం నియోజకవర్గానికి ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేగా గౌరు చరిత ఉన్నారు. గౌరు వెంకటరెడ్డి కూడా పాణ్యంలో పట్టున్న నాయకుడు. అయితే ఇటీవల కాటసాని రాంభూపాల్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరినప్పటి నుంచి గౌరు కుటుంబం కొంత అసంతృప్తితో ఉందని చెబుతున్నారు. పాణ్యం టిక్కెట్ విషయంలోనూ జగన్ ఏమీ తేల్చలేదని వారు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల శ్రీకాకుళం జిల్లా పాదయాత్రలో జగన్ ను కలిసిన గౌరు వెంకటరెడ్డికి టిక్కెట్ విషయమై జగన్ చిరునవ్వే సమాధానం లభించింది.

జగన్ తో మాట్లాడిన తర్వాతే…..

టిక్కెట్ ఇస్తామని చెప్పలేదు… ఇవ్వలేదని చెప్పలేదు… చివరి నిమిషంలో సీటు తమకు రాకుంటే ఎలా అని గౌరు దంపతులు అంతర్మధనంలో పడిపోయారు. అందుకోసం వారు పార్టీ మారే యోచనలో ఉన్నట్లు తెలుసుకున్న టీడీపీ వారితో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం అయితే జగన్ తో మాట్లాడి ఫైనల్ గా ఆయన నిర్ణయం తెలుసుకున్న తర్వాతనే గౌరు కుటుంబం పార్టీని వీడే అవకాశముంది. మొత్తం మీద చంద్రబాబు కర్నూలు జిల్లాలో గట్టి పట్టున్న రెండు కుటుంబాలపై చంద్రబాబు కన్నేశారు. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*