కడప గడపలో యువతేజాలు….!

ఏపీలో వార‌స‌త్వ రాజ‌కీయాలు జోరందుకున్నాయి. ఎన్నో ఏళ్లుగా టీడీపీకి త‌మ సేవ‌లందించిన సీనియ‌ర్లు.. ఇప్పుడు త‌మ వార‌సులను రంగంలోకి దించుతున్నారు. తాము ఇక తెర‌వెన‌క్కి వెళ్లి.. ఇన్నాళ్తూ తెర‌వెనుక రాజ‌కీయాల‌కు ప‌రిమిత‌మైన యువకుల‌ను వెలుగులోకి తీసుకొస్తున్నారు. న‌వ త‌రానికి అవ‌కాశం ఇచ్చేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. గ‌తంలో ఫ్యాక్ష‌న్ రాజ‌కీయాల‌కు కేరాఫ్‌గా నిలిచిన క‌డ‌ప జిల్లాలో.. స‌త్తా చాటేందుకు యువ‌నాయ‌కులు సై అంటున్నారు. పార్టీలో యువ‌త‌కు పెద్ద పీట వేయాల‌ని అధినేత చంద్ర‌బాబు భావిస్తున్న త‌రుణంలో.. త‌మ వార‌సుల అరంగేట్రానికి ఇంత‌కంటే స‌రైన స‌మ‌యం దొర‌క‌ద‌ని కొంద‌రు సీనియ‌ర్లు నిర్ణ‌యించారు. పాలిటిక్స్‌ని కెరీర్‌గా ఎంచుకుని యువత రాజకీయాల్లోకి అడుగుపెడుతుండ‌టంజిల్లా రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. 2019లో జరిగే ఎన్నికలకు ఇలా రాజకీయ వారసులు ప్రధాన పార్టీల్లోంచి టికెట్లు ఆశిస్తూ ఒక్క ఛాన్స్ ఇవ్వాల‌ని కోరుతున్నారు.

వరదరాజులు రెడ్డి వారసుడిగా…..

ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డికి సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది. ఆయన తనయుడు నంద్యాల కొండారెడ్డి బీటెక్‌ చదివి బిల్డింగ్‌ కన్‌స్ట్రక్షన్స్‌ కంపెనీ ఏర్పాటుచేశారు. ఎన్నికల సమయంలో పూర్తిగా తండ్రికి చేదోడువాదోడుగా ఉంటూ ఆ ఎన్నికల్లో కీలకంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. నియోజకవర్గంలోని కేడరు, నాయకులతో మంచి సంబంధాలు పెట్టుకుని తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకుని రాజకీయ ఆరంగేట్రం చేయాలని ఆలోచన చేస్తున్నట్లు రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. జమ్మలమడుగు నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి గట్టి పట్టుతో వ్యవహరిస్తున్నారు. ఆయ‌న తనయుడు శివారెడ్డి ఇంజనీరింగ్‌ చదివి వివిధ కాంట్రాక్టు పనులు చేస్తూ వస్తున్నారు. ఎన్నికల సమయంలో నియోజకవర్గంలోనే మకాం వేసి తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ వస్తున్న శివారెడ్డి ఈసారి రాజకీయ అరంగేట్రం చేయాలని ఆలోచన చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.

మంత్రి ఆది కూడా…..

మంత్రి ఆదినారాయణరెడ్డి తనయుడు సుధీర్‌కుమార్‌రెడ్డి రాజకీయ ప్రవేశం చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇదే నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డి తనయుడు సి.సుబ్బరామిరెడ్డి అలియాస్‌ భూపేష్‌కుమార్‌రెడ్డి బీఏబీఎల్‌ చదివి నారాయణరెడ్డి వారసుడిగా రాజకీయ ప్రవేశం చేసి మైలవరం జడ్పీటీసీగా కొనసాగుతున్నారు. బద్వేలు మాజీ ఎమ్మెల్యే విజయమ్మ తనయుడు కె.రితీష్ కుమార్‌రెడ్డి విదేశాల్లో ఉన్నత చదువులు చదివి బద్వేలు రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ నియోజకవర్గం ఎస్సీలకు రిజర్వు కావడంతో పోటీ చేసే పరిస్థితి లేకపోయినా తాము సూచించిన వ్యక్తికే టికెట్‌ తెచ్చుకుని గెలిపించి పూర్తి స్థాయి రాజకీయ ప్రవేశం చేయాలనే ఆలోచన చేస్తున్నారు. రాయచోటిలో పాలకొండ్రాయుడు సుగవాసి ప్రసాద్‌బాబు డిగ్రీ పూర్తి చేసి తండ్రి వారసుడిగా రాజకీయాల్లోకి ప్రవేశించి మున్సిపల్‌ కౌన్సిలర్‌గా గెలుపొందారు.

తండ్రి వారసత్వాన్ని……

2014లో టికెట్‌ కోసం ప్రయత్నించినా దక్కలేదు. ఈసారి టికెట్‌ దక్కించుకునే ప్ర‌య‌త్నాల్లో ఉన్నారు. కడప నియోజకవర్గంలోని మాజీ మంత్రి ఖలీల్‌బాషా తనయుడు డాక్టర్‌ సొహైల్‌ వైద్యవృత్తిలో మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం టీడీపీ డాక్టర్‌ సెల్‌ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్న సొహైల్‌ తండ్రి వారసుడిగా రాజకీయ ప్రవేశం చేసేందుకు పావులు కదుపుతున్నారు. ఈ సారి టికెట్‌ కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. మరో మాజీ మంత్రి అహ్మదుల్లా తనయుడు అస్రఫ్‌.. తండ్రి పోటీ చేసిన సమయంలో అష్రఫ్‌ అన్నీ తానై వ్యవహరిస్తున్నాడు. ఈసారి పూర్తి స్థాయిలో రాజకీయ నాయకుడిగా మారి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. క‌మలాపురంలోని మాజీ ఎమ్మెల్సీ పుత్తా నరసింహారెడ్డి ఎన్నికల్లో పోటీ చేసే సమయంలో ఆయన తనయుడు పుత్తా కృష్ణచైతన్యరెడ్డి తండ్రి బాటలో నడుస్తూ రాజకీయాల్లో రాణించాలని ఆలోచన చేస్తున్నారు.ఇదే నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి కుమారుడు అనిల్‌కుమార్‌రెడ్డి ప్రస్తుతం డీసీసీబీ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తూనే నియోజకవర్గ కార్యక్రమాలకు హాజరవుతూ వస్తున్నారు. ఈసారి టికెట్‌ రేసులో తండ్రి వీరశివారెడ్డికి లేదా తనకు టికెట్‌ ఇవ్వాలని అనిల్‌కుమార్‌రెడ్డి పార్టీ నేతలను కోరుతున్నార‌ట‌. ఒక్క జిల్లాలోనే కాదు రాష్ట్రంలోని జిల్లాల్లోనూ ఇదే ప‌రిస్థితులు ఉన్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*