ఈ ఎమ్మెల్యేను టీడీపీ వాళ్లే ఓడిస్తారట…!

ఆయ‌న ఎస్సీ వ‌ర్గానికి చెందిన ఎమ్మెల్యే. ఆ వ‌ర్గాని మేలు చేస్తార‌ని, ఆ వ‌ర్గానికి ల‌బ్ధి చేకూరుస్తార‌ని, ప్రగ‌తి ఫ‌లాలు అందిస్తార‌ని అంద‌రూ ఆశించారు. కానీ, ఆయ‌న స్టయిల్ వేరు. సొంత ప‌నులు చేసుకోవ‌డంలోను, త‌న‌పై ఎవ‌రైనా విమ‌ర్శలు చేస్తే.. క‌క్ష సాధింపులోను.. ఆ ఎస్సీ ట్యాగ్‌ను వాడుకుంటున్నారు త‌ప్పితే.. ప్రజ‌ల బాగుకోసం కానేకాదు. ఈ మాట ఎవ‌రో ప‌రాయి వాళ్లో.. ప్రత్యర్థులో అంతే ఆశ్చర్యపోవాల్సిన ప‌నిలేదు. రాజ‌కీయాల్లో ఓర్చుకోలేక ఇలా మాట్లాడుతున్నార‌ని స‌రిపెట్టుకోవ‌చ్చు. కానీ, సొంత పార్టీ నేత‌లే ఆయ‌న‌ను క‌డిగేస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ ఇస్తే.. ఓడించి తీరుతామ‌ని శ‌ప‌థం చేస్తున్నారు. మ‌రి ఇంత‌కీ ఆయ‌న ఎమ్మెల్యే ఎవ‌రు? ఏం చేస్తున్నారు? ఎందుకు అంత‌గా వ్య‌తిరేక‌త‌ను మూట‌గ‌ట్టుకున్నారు? వంటి వివ‌రాలు తెలుసుకుందాం.

గత ఎన్నికలలో….

ప్రకాశం జిల్లా కొండ‌పి నియోజ‌క‌వ‌ర్గం ఎస్సీ వ‌ర్గానికి రిజ‌ర్వ్ అయింది. ఇక్కడ నుంచి 2014లో ఇక్కడ నుంచి టీడీపీ త‌ర‌ఫున డోలా బాల వీరాంజ‌నేయ స్వామి పోటీ చేసి గెలుపొందారు. అప్పటి వైసీపీ అభ్యర్థి.. ప్రస్తుతం టీడీపీలో ఎస్సీల త‌ర‌ఫున కీల‌క వాయిస్ వినిపిస్తున్న జూపూడి ప్రభాక‌ర‌రావుపై 5 వేల‌పైచిలుకు ఓట్లతో విజ‌యం సాధించారు. ఇక‌, ఇది వాస్తవానికి ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గమే అయినా 42 వేల మంది ప్రధాన సామాజిక ఉండ‌డం, గ‌తంలో ఇక్కడ డీలిమిటేష‌న్‌కు ముందు అదే సామాజికవ‌ర్గానికి చెందిన వారే ఇక్కడ ఎమ్మెల్యేలుగా ఎన్నిక‌వ‌డంతో ఇక్కడ ఇప్పటికీ వారి ఆధిప‌త్యమే కొన‌సాగుతోంది. ఇక‌, ఎమ్మెల్యేగా ఎన్నికైన వీరాంజ‌నేయ‌స్వామిపై సొంత పార్టీ లోనేలుక‌లుక‌లు వినిపిస్తున్నాయి. ఆయ‌న ప‌నితీరు బాగోలేద‌ని వ్యాఖ్యానిస్తున్నారు.

దామచర్ల ఫ్యామిలీకి…..

మాజీ మంత్రి, ప్రస్తుత ఒంగోలు ఎమ్మెల్యే అయిన దామ‌చ‌ర్ల జ‌నార్థన్ తాత దామ‌చ‌ర్ల ఆంజ‌నేయులు కుటుంబానికి ఇది సొంత నియోజ‌క‌వ‌ర్గం. ఇక్కడ దామ‌చ‌ర్ల ఫ్యామిలీ హ‌వానే ఉంటుంది. అయితే ప్రస్తుతం ఎమ్మెల్యే వీరాంజ‌నేయ‌స్వామి దామ‌చ‌ర్ల జ‌నార్థన్ సోద‌రుడు అయిన దామ‌చ‌ర్ల స‌త్య చేతిలో కీలుబొమ్మగా మారిపోయాడ‌న్న విమ‌ర్శలు జిల్లాలో తీవ్రంగా వినిపిస్తున్నాయి. ఇటీవ‌ల దామ‌చ‌ర్ల ఫ్యామిలీలో కూడా విబేధాలు పొడ చూప‌డంతో నిన్నటి వ‌ర‌కు ఒంగోలులో హ‌ల్‌చ‌ల్ చేసిన స‌త్య జ‌నార్థన్ వార్నింగ్‌తో ఇప్పుడు అక్కడ మూటాముల్లు స‌ర్దేసి కొండ‌పిలో త‌న హ‌వా చాటుకునే ప్రయ‌త్నాలు చేస్తున్నాడు.

దామచర్ల సోదరుడు…..

ఈ క్రమంలోనే కొండ‌పిలో ఎమ్మెల్యే వీరాంజ‌నేయ‌స్వామికి స‌త్య మ‌ద్దతు ప‌లుకుతున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో ఎమ్మెల్యే పూర్తిగా డ‌మ్మీ. స‌త్య చెప్పిందే వేదం. దీంతో ఇక్కడ ఎమ్మెల్యేకు జిల్లా పార్టీ అధ్యక్షుడిగాను, ఒంగోలు ఎమ్మెల్యేగా ఉన్న దామ‌చ‌ర్ల జ‌నార్థన్‌కు గ్యాప్ వ‌చ్చేసింది. ఇక్కడ ఎమ్మెల్యే తీరుపై పార్టీలో తీవ్రమైన వ్యతిరేక‌త వ్యక్తమ‌వుతోంది. అయితే, తాను ఎస్సీని కాబ‌ట్టే.. విమ‌ర్శిస్తున్నారంటూ.. ఇక్కడి ఎమ్మెల్యే ప్రతి విష‌యానికీ ఎస్సీ చ‌ట్టాన్ని ప్రయోగిస్తున్నారు. ఎమ్మెల్యే పనితీరు బాగాలేదు మెరుగుపరుచుకోవాల్సి ఉందన్న మీడియా సంస్దలపై ఆయన ఎస్సీ అట్రాసీ కేసులు నమోదు చేయించి సంచలనం సృష్టిస్తున్నారు.

ఎన్నికేసులు పెట్టారో…..

గత నాలుగేళ్లల్లో కేవలం కొండపి నియోజకవర్గంలోనే దాదాపు 18 ఎస్సీ అట్రాసీ కేసులు నమోదు అయ్యాయి. వీటిలో ఎక్కువ శాతం ఎమ్మెల్యే పెట్టించినవని..అది కూడా స్వంత పార్టీ కార్యకర్తలు..నాయకులపైనే ఆయన పెట్టించారని తెలుస్తోంది. అంతే కాకుండా…నియోజకవర్గంలో తనకు రాజకీయ భిక్ష పెట్టిన దామచర్ల కుటుంబంలో చిచ్చుపెట్టారనే మాట కూడా వారి నుంచి వస్తోంది. టీడీపీ నాయకుల మధ్య విభేదాలు సృష్టించారని… నాయకులను నాలుగు గ్రూపులుగా చీల్చి..పార్టీని బలహీన పర్చారని పెద్ద ఎత్తున వినిపిస్తోంది. దీంతో ఇక్కడ నుంచి మళ్లీ ఆయనకు పోటీ చేసే అవకాశం ఇస్తే..పార్టీ గెలవదని..నియోజకవర్గ కార్యకర్తల్లో ఎక్కువ మంది చెబుతున్నారు. మ‌రి ఇప్పటికైనా ఆయ‌న తీరు మార్చుకుంటారో లేక క‌స్సు బుస్సు మంటారో చూడాలి. ఇక్కడ పార్టీ నాయ‌కులు చాలామంది జూపూడిని ఆహ్వానిస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*