అయ్య ఎమ్మెల్యే అయినా…అంతా అమ్మగారిదే….!

అధికారంలోకి వ‌చ్చే వ‌ర‌కు తెర‌పై ఒక‌రు క‌నిపిస్తారు. అధికారం చేతిలోకి వ‌చ్చాక తెర‌పై క‌నిపించేవారు తెర‌వెనుక `క‌థ‌` న‌డిపించేవారు మ‌రొక‌రు ఉంటారు. ఇప్పుడు ఇదే త‌ర‌హా రాజ‌కీయం బెజ‌వాడ‌లో అధికార పార్టీకి చెందిన ఓ కీల‌క‌ ఎమ్మెల్యే కి సంబంధించి జ‌రుగుతోంద‌నే వ్యాఖ్య‌లు జోరుగా వినిపిస్తున్నాయి. మాస్, క్లాస్ ప్రాంతాలు క‌లిగి ఉన్న శివారు ప్రాంతాల కు చెందిన నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే పేరు త‌ర‌చుగా మీడియాలో వినిపిస్తూనే ఉంది. పైకి ఆయ‌నే ఎమ్మెల్యే అయినా.. తెర వెనుక మాత్రం “అమ్మ‌గారు“ మాత్రం బాగానే చ‌క్రం తిప్పుతున్నారు. ఓ బ‌ల‌మైన‌ సామాజిక వ‌ర్గానికి చెందిన ఈమె.. తానే ఎమ్మెల్యే అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తోన్నారు.

మూడంచెల్లో అనుమతి……

ఏదైనా ప‌నిపై ఎమ్మెల్యే ఇంటికి వెళ్లాలంటే మూడంచెల్లో అనుమ‌తులు పొందాల్సి రావ‌డం ఇప్ప‌టికే ఉన్న నియంతృత్వ ధోర‌ణికి నిద‌ర్శ‌నం. పైగా వెళ్లిన వారిని నిల‌బెట్టే మాట్లాడ‌డం ఆ ఎమ్మెల్యేగారి నైజానికి నిద‌ర్శ‌నంగా మారింది. నియో జక‌వ‌ర్గంలో తిరిగినా.. ఆ ఎమ్మెల్యేగారి ద‌ర్పానికి తిరుగు ఉండ‌దు. ఒక‌ప్పుడు ఒక కారు మాత్ర‌మే ఉన్న ఈ ఎమ్మెల్యే.. ప్ర‌స్తుతం మాత్రం నాలుగు కార్లులేందే నియోజ‌క‌వ‌ర్గంలోకి వ‌చ్చే ప‌రిస్థితి లేదు. ఇక‌, ఈయ‌న గారి స‌తీమ‌ణి.. అమ్మ‌గారిగా చ‌లామ‌ణి అవుతూ.. చ‌క్క‌బెడుతున్నార‌నే విమ‌ర్శ‌లు జోరందుకున్నాయి. ఈ ఫ్యామిలీకి ఓ పారిశ్రామిక సంస్థ ఉంది అది గ‌త 2014కు ముందు అప్పుల్లో ఉంటే.. ఇప్పుడు మాత్రం కోట్ల రూపాయ‌ల్లో లాభాల‌ను పంజుకుంది.

భూ కబ్జా ఆరోపణలపై….

దీని వెనుక పూర్తిగా ఆ ఎమ్మెల్యేగారి స‌తీమ‌ణి ఉంద‌న‌డంలో సందేహం లేద‌ని అంటున్నారు బెజవాడవాసులు. ఇక‌, భూ క‌బ్జాలు చేస్తున్నార‌న్న ఎమ్మెల్యేపై వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌కు తిరుగే లేకుండా పోయింది. ఓ స్వాతంత్ర స‌మ‌ర‌యోధునికి ప్ర‌భుత్వం ఇచ్చిన 60 కోట్ల‌కు పైగా విలువైన స్థ‌లాల‌ను క‌బ్జా చేశారు. దొంగ ప‌త్రాలు సృష్టించి.. ఎమ్మెల్యే స‌తీమ‌ణి చ‌క్రం తిప్పారు. అదేవిదంగా ఓ ఎన్నారై ఫ్యామిలీకి చెందిన భూమిని సైతం క‌బ్జా చేశార‌ని సాక్షాత్తూ విజ‌య‌వాడ పోలీస్ క‌మిష‌న‌ర్‌కు ఫిర్యాదులు అందాయంటే ప‌రిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ద‌మ‌వుతుంది. ఇక‌, ప్ర‌తి ప‌నికీ ఆమె ఇంతని బేరం చేస్తుంద‌ని, ఎమ్మెల్యేను క‌లిసేందుకు ఖ‌చ్చితంగా ముడుపులు చెల్లించాల్సిందేన‌నిది బ‌హిరంగ ర‌హ‌స్యం. ఈ నేప‌థ్యంలో ఇటీవ‌ల ఈ ఎమ్మెల్యే స‌తీమ‌ణిపై కేసు కూడా న‌మోదు కావ‌డం గ‌మ‌నార్హం. సో.. ఇదీ ఎమ్మెల్యేగారి స‌తీమ‌ణి.. క‌థ‌!!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*