టీడీపీకి మైనార్టీలు ఎంతెంత దూరం..?

రాష్ట్రంలో కీల‌క ఓటు బ్యాంకుగా ఉన్న మైనార్టీలు టీడీపీకి దూర‌మ‌వుతున్నారా? గ‌త కొన్నాళ్లుగా రాష్ట్రంలో జ‌రుగుతున్న ప‌రిణామాల ప‌ట్ల వారు తీవ్రంగా క‌లత చెందుతున్నారా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. రాష్ట్రంలోని గుంటూరు, ప్ర‌కాశం, క‌డ‌ప‌, క‌ర్నూలు జిల్లాల్లో మైనార్టీ ఓటు బ్యాంకు ఎక్కువ‌గా ఉంది. ఆయా ప్రాంతాల్లో వీరు అభ్య‌ర్థుల‌ను నిర్ణ‌యించే శ‌క్తిగా అవ‌త‌రించారు. క‌ర్నూలు జిల్లా నంద్యాల‌, విజ‌య‌వాడ‌, గుంటూరు తూర్పు, విశాఖ న‌గ‌రంలోని నియోజ‌వ‌క‌ర్గాల్లో వీరి ప్ర‌భావం భారీగా ఉంది.

బాబు ప్రయత్నాలు…..

ఈ నేప‌థ్యంలో మైనార్టీ ఓట్ల కోసం వివిధ రాజ‌కీయ ప‌క్షాలు కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తుంటాయి. ముఖ్యంగా కాంగ్రెస్‌కు ఒక‌ప్పుడు వీరు కీల‌క ఓటు బ్యాంకుగా ఉన్నారు. గ‌తంలో వైఎస్ హ‌యాంలో మైనార్టీల‌కు 4% రిజ‌ర్వేష‌న్ ప్ర‌తిపాద‌న వ‌చ్చింది. అయితే, హైకోర్టు ఆదేశాల‌తో దీనిని వెన‌క్కి తీసుకున్నారు. ఇప్పుడు ఏపీలోనూ ఇదే ప‌రిస్థితి ఉంది. మైనార్టీ ఓటు బ్యాంకును అన్ని ప‌క్షాలూ కీల‌కంగా భావిస్తున్నాయి. అయితే, రాబోయే ఎన్నిక‌ల్లో గెలుపొంది తిరిగి అధికారంలోకి రావాల‌ని భావిస్తున్న టీడీపీకి ఈ వ‌ర్గాలు అత్యంత కీల‌కం. దీనికిగాను చంద్ర‌బాబు కూడా వీరిని ఆక‌ట్టుకునేందుకు శ‌త విధాలా ప్ర‌య‌త్నిస్తున్నారు. కానీ, ఆయ‌న ప్ర‌య‌త్నాలు మాత్రం ముందుకు సాగ‌డం లేదు.

మైనారిటీ శాఖ ఏర్పాటు చేయక….

ప్ర‌ధానంగా రాష్ట్రంలో అధికారంలోకి వ‌చ్చి 4 ఏళ్లు గ‌డిచిపోయినా.. ఇప్ప‌టి వ‌రకు మైనార్టీ శాఖ‌ను ఏర్పాటు చేయ‌లేదు. అదేస‌మ‌యంలో మైనార్టీ నాయకుడు వైసీపీకి చెందిన విజ‌య‌వాడ ఎమ్మెల్యే జ‌లీల్ ఖాన్‌ను పార్టీలో చేర్చుకున్నా.. ఆయ‌న‌కు రాష్ట్ర వ‌క్ఫ్ బోర్డు చైర్మ‌న్ ప‌ద‌వి ఇచ్చి చేతులు దులుపుకొన్నార‌నే వాద‌న‌లు వినిపిస్తున్నాయి. బాబు కేబినెట్‌లో మైనార్టీ వ‌ర్గానికి చెందిన వ్య‌క్తుల‌కు మంత్రి ప‌ద‌వి లేక‌పోవ‌డం కూడా పెద్ద మైన‌స్‌.

మైనార్టీ వర్గాలకు రక్షణ లేక….

ఇవిలావుంటే, ఇటీవ‌ల కాలంలో గుంటూరు కేంద్రంగా మైనార్టీ వ‌ర్గానికి చెందిన బాలిక‌ల‌కు ర‌క్ష‌ణ లేకుండా పోతోంద‌ని తాజాగా ఆ వ‌ర్గాలే ప్ర‌భుత్వానికి విన‌తి ప‌త్రం అందించాయి. గ‌డిచిన 15 రోజుల్లో చోటు చేసుకున్న రెండు ప‌రిణామాల‌ను వారు ఈ సంద‌ర్భంగా ఉటంకించారు. త‌మ‌కు, త‌మ బాలిక‌ల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాల్సిన అవ‌స‌రం ప్ర‌భుత్వంపై ఉంద‌ని అంటున్నారు. మ‌రి ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో టీడీపీ యాక్ష‌న్ ప్లాన్ రూపొందించాల‌ని అంటున్నారు మైనార్టీ నాయకులు. అదేవిధంగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ‌కు ఎక్కువ టికెట్లు కేటాయించాల‌ని కూడా కోరుతున్నారు. ఈ ప‌రిణామాలు టీడీపీకి క‌ల‌వ‌ర పెడుతున్నాయి. ఎన్ని చ‌ర్య‌లుతీసుకుంటున్నా బాలిక‌ల‌పై జ‌రుగుతున్న ఘోరాల‌ను అరిక‌ట్ట‌లేక‌పోవ‌డం ముఖ్యంగా మైనార్టీ వ‌ర్గాల‌పై జ‌రుగుతున్న నేరాల‌కు అడ్డుక‌ట్ట వేయ‌లేక‌పోవ‌డం వంటివి వ‌చ్చే ఎన్నిక‌ల్లో వారి ఓటు బ్యాంకును ప్ర‌భావితం చేయ‌డం ఖాయ‌మ‌ని చెబుతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*