ఒకవేళ వస్తే….భయమెందుకు?

వాస్త‌వానికి దేశ‌వ్యాప్తంగా వ‌చ్చే ఏడాదిలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల స‌మ‌రం జ‌ర‌గాల్సి ఉంది. అయితే, కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం మాత్రం ముంద‌స్తుగానే అంటే ఈ ఏడాది అక్టోబ‌రు లేదా డిసెంబ‌రులోనే ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని నిర్ణ‌యించి న‌ట్టు గ‌త కొన్నాళ్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ఏపీలోని అధికార టీడీపీలో గుబులు రేగింది. పార్టీ అధినేత చంద్ర‌బాబు ముంద‌స్తుకు రెడీ అంటున్నారు. అయితే, ఆయ‌న కుమారుడు, మంత్రి లోకేష్ మాత్రం దేశం మొత్తం ముంద‌స్తుకు వెళ్లినా అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను మాత్రం స‌మ‌యం ప్ర‌కారం వ‌చ్చే ఏడాది మేలోనే నిర్వ‌హిస్తామ‌ని చెప్పారు.

పార్టీలో కీలక మార్పులు…..

ఈ ప‌రిణామాల వెనుక ఆ పార్టీ భ‌య‌ప‌డుతున్న‌ట్టుగా కొంద‌రువిశ్లేషిస్తున్నారు. ఈ క్ర‌మంలో అస‌లు టీడీపీలో ముంద‌స్తు వ‌స్తే ఏం చేయాల‌నే దానిపై టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఇటీవ‌ల త‌మ్ముళ్ల‌తో భేటీ అయ్యారు. బాబు అంచ‌నాల ప్ర‌కారం పార్టీలో కీల‌క మార్పులు జ‌ర‌గనున్నాయి. రాష్ట్రంలో రాజ‌కీయ‌ పరిస్థితులను అంచనా వేసేందుకు తెలుగుదేశం పార్టీ ఇప్పటికే చురుకైన పాత్ర పోషిస్తోంది. నియోజకవర్గాల్లో సంతృప్తికర స్థాయి ఏ మేరకు నమోదవుతుందనేది ఎప్పటికప్పుడు ఆరా తీస్తోంది. తాము అధికారంలో ఉండగా అమలు చేసిన పథకాల తీరుతెన్ను లను ఇప్పటికే బేరీజు వేస్తూ వచ్చింది.

ప్రత్యర్థి పార్టీలపై…..

తాజాగా అంగన్‌వాడీ, వీఆర్‌ఏలకు వేతనాలు పెంపుతో సహా తాజా పరిణామాలన్నింటినీ ఏ మేరకు పార్టీకి అనుకూలమో బేరీజు వేస్తూనే ఉంది. దీనికి తగ్గట్టుగా ప్రత్యర్ధి పార్టీలపై ఒక కన్నేసి ఉంచింది. తమకు ప్రధాన రాజకీయ శత్రువుగా ఉన్న వైసీపీని దెబ్బతీసేందుకు సర్వ శక్తులు ఒడ్డుతోంది. తెలుగుదేశం ఈసారి ఎన్నికల్లో గెలుపే ప్రధానంగా శిక్షణా శిబిరాలకు తెరలేపింది. రాబోయే కొద్ది రోజుల్లోనే లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో గుర్తించిన కార్యకర్తలందరికీ రాజకీయ శిక్షణా శిబిరాలను నిర్వహించాలనేది ప్రధాన ఉద్దేశం. దీనికి సరిపడా ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది.

మెరికల్లాంటి నేతలను….

బీజేపీ వర్గాల నుంచి ఇప్పటికే ఎదురుదాడి ప్రారంభమైన నేపథ్యంలో దీనిని తిప్పికొట్టేందుకు మెరికల్లాంటి నాయకులను ఎంపిక చేసేందుకు రంగంలోకి దిగుతోంది. ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లోనూ ప్రస్తుత సిట్టింగ్‌ ఎమ్మెల్యేల తీరు తెన్నులను అంచనా వేసి వీరిలో కొందరిని మార్పు చేసే వీలు లేకపోలేదు. అంతలా టీడీపీ రాబోయే ఎన్నికలకు సన్నాహాల్లో ఉంది. దాదాపు ఐదు నెలలపాటు జిల్లాలో నియోజకవర్గ స్థాయి సభలు, సమావేశాలు, సైకిల్‌ ర్యాలీలు, గ్రామదర్శిని పేరిట ప్రజలతో నేరుగా మమేకం కావడం వంటివి దీనిలో భాగమే. దీనిని బ‌ట్టి బాబు ముంద‌స్తుకు రెడీ అవుతున్నార‌నే అంటున్నారు సీనియ‌ర్లు.

అప్పుడు దెబ్బతినడంతో…..

అయితే 2004లో ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లిన చంద్ర‌బాబు దెబ్బ‌తిన్నారు. అయితే ఇప్పుడు ముంద‌స్తుకు వెళ్లాలా ? వ‌ద్దా ? అన్న ఆప్ష‌న్ పూర్తిగా చంద్ర‌బాబుకు లేదు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళితే డిసెంబ‌ర్‌లో అసెంబ్లీ, వ‌చ్చే ఏప్రిల్‌లో లోక్‌స‌భ ఎన్నిక‌ల‌కు వెళ్లాల్సి రావ‌డం స‌హ‌జంగానే ఇబ్బందిగా ఉంటుంది. ఈ క్ర‌మంలోనే బాబు ముంద‌స్తు ఎన్నిక‌లు వ‌స్తే ఎలా ఎదుర్కోవాల‌న్న‌దానిపై ప్రాథ‌మిక క‌స‌ర‌త్తులు పూర్తి చేసే ప‌నిలో ఉన్న‌ట్టు ప‌రిస్థితులు చెపుతున్నాయి. మ‌రి ముంద‌స్తుకు వెళితే మ‌ళ్లీ అధికారం వ‌స్తుందా ? 2004లో మిస్ అయిన రికార్డు బ‌ద్ద‌లు కొడ‌తారా? అన్న‌ది వేచి చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*