ఆయనకిస్తే సైకిల్ గుర్తుకు ఓటెయ్యమంటూ..?

తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యేకు కష్టాలు చుట్టుముడుతున్నాయి. ఆయనకు ఈసారి టిక్కెట్ ఇవ్వకూడదని టీడీపీలోనే గొంతుకలు బలంగా విన్పిస్తున్నాయి. ఆయనకు టిక్కెట్ ఇస్తే తాము సహకరించేది లేదని పసుపదళం తెగేసి చెబుతుంది. ‘‘ఆయనను మార్చండి… లేకుంటే ఇక్కడ టీడీపీ గెలుపుకు మేం పనిచేయం’’ అని హైకమాండ్ కు కుండబద్దలు కొట్టేశారు. ఇప్పుడు ఆయనను మారిస్తే ఒక సమస్య. మార్చకుంటే మరో సమస్య. ఇదీ తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు ముందున్న సవాల్. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీలో విభేదాలు ముదిరిపాకాన పడ్డాయి. రెండు వర్గాలుగా విడిపోయిన వారు ఎవరూ తగ్గడం లేదు.

ఎమ్మెల్యేను మించి…..

దీంతో సంతనూతలపాడు పంచాయతీ త్వరలోనే చంద్రబాబు ఎదుటకు రానుంది. సంతనూతలపాడు నియోజకవర్గంలో గత ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి ఆదిమూలపు సురేష్ చేతిలో అప్పటి తెలుగుదేశం అభ్యర్థి బిఎస్ విజయకుమార్ ఓటమిపాలయ్యారు. అయితే పార్టీ అధికారంలోకి రావడంతో బీఎస్ విజయకుమార్ ను నియోజకవర్గ ఇన్ ఛార్జిగా అధిష్టానం నియమించింది. దీంతో ఎమ్మెల్యేకంటే ఈయన హవానే ఎక్కువగా నడుస్తుంది. కానీ విజయకుమార్ ఒంటెత్తు పోకడలను ఇక్కడ టీడీపీ నేతలే జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన తమ పట్ల అనుసరిస్తున్న వైఖరిని కూడా తట్టుకోలేక విజయ్ కుమార్ ను ఇన్ ఛార్జి పదవి నుంచి తప్పించాలని ఇటీవలే తీర్మానం చేసి మరీ అధిష్టానానికి పంపారు.

ఇక వారిదే ఆధిపత్యం……

సంతనూతలపాడు నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్ డ్ నియోజకవర్గమైనప్పటికీ అక్కడ కమ్మ సామాజిక వర్గం నేతలదే ఆధిపత్యం. వీరికి సంతనూతల పాడు మండలాధ్యక్షురాలు అనిత, నాగులుప్పలపాడు మండలాధ్యక్షుడు వీరయ్య చౌదరి నేతృత్వం వహిస్తున్నారు. అయితే ఎంపీపీలకు తెలియకుండానే విజయకుమార్ సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం వీరికిచికాకు తెప్పిస్తోంది. పింఛన్ల మంజూరు విషయంలో తాము ఇచ్చిన జాబితాను పక్కనపెట్టి విజయకుమార్ ఏకపక్షంగా మంజూరు చేశారని ఆరోపిస్తున్నారు. దీనిపై తెలుగుదేశం పార్టీ నేతలు కోర్టుకు కూడా వెళ్లడం విశేషం. ఇది రాష్ట్ర వ్యాప్తంగాచర్చనీయాంశం కావడంతో అధిష్టానం కూడా ఈ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టిపెట్టింది.

రంగంలోకి ఆశావహులు…..

విజయ్ కుమార్ విషయంలో చంద్రబాబు చేయించిన సర్వేల్లోనూ మైనస్ మార్కులే వచ్చాయని ప్రచారం జరుగుతోంది. దీంతో ఇక్కడ ఆశావహులు ఎక్కువై పోయారు. యర్రగొండపాలెంలో గత ఎన్నికల్లో వైసీపీ గుర్తుమీద గెలిచిన పాలపర్తి డేవిడ్ రాజు సంతనూతలపాడు టిక్కెట్ ను ఆశిస్తున్నారు. డేవిడ్ రాజు వైసీపీ నుంచి టీడీపీలోకి మారిన సంగతి తెలిసిందే. డేవిడ్ రాజు తో పాటుగా రాష్ట్ర తోళ్ల పరిశ్రమ అభివృద్ధి సంస్థ ఛైర్మన్ ఎరిక్షన్ బాబుతో పాటు పదవీ విరమణ చేసిన ఐఏఎస్ అధికారి రామాంజనేయులు కూడా ప్రయత్నిస్తున్నారు. వీరిద్దరూ ఇప్పుడు విజయకుమార్ పై అసంతృప్తిగా ఉన్న నేతలతో సమావేశమవుతున్నారు. తమకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. విజయ్ కుమార్ మాత్రం టిక్కెట్ తనదేనని ధీమాను వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే సంతనూతలపాడు నియోజకవర్గం నేతలతో చంద్రబాబు భేటీ కానున్నట్లు తెలిసింది. మరి చంద్రబాబు ఈ నియోజకవర్గం విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*