ఆయన్ని ఓడిచ్చేది టీడీపీ వాళ్లే….!

రాజ‌కీయాలు ఎప్పుడు ఎలాంటి మ‌లుపులు తిరుగుతాయో చెప్ప‌డం క‌ష్టం! సొంత పార్టీ నాయ‌కులే ప్ర‌త్య‌ర్థులుగా మారిన సంద‌ర్భాలు అనేకం ఉన్నాయి. అదేవిధంగా ఎన్నిక‌ల స‌మ‌యంలో నాయ‌కుల‌కు సొంత పార్టీ నుంచే ఎర్త్ పెట్టేవారు కూడా ఎక్కువ‌గా ఉన్న సంద‌ర్భాలు అనేకం ఉన్నాయి. తాజాగా ఇలాంటి ప‌రిణామ‌మే నెల్లూరు జిల్లా వెంక‌ట‌గిరి టీడీపీ ఎమ్మెల్యే ఎదుర్కొంటు న్నారు. సొంత పార్టీలోనే ఆయ‌నకు వ్య‌తిరేక వ‌ర్గం త‌యారైంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఈ వ‌ర్గం ఇప్పుడు ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా ప్ర‌చారం చేస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో బ‌లంగా బ‌రిలోకి దిగుతున్న వెంక‌ట‌గిరి ఎమ్మెల్యేపై సొంత పార్టీ నాయ‌కులే పొగ‌పెడుతున్నార‌ని అంటున్నారు. దీంతో ఒక్క‌సారిగా వెంక‌ట‌గిరి వార్త‌ల్లోకి వ‌చ్చింది.

రెండుసార్లు వరుసగా……

విష‌యంలోకి వెళ్తే.. నెల్లూరు జిల్లా వెంక‌ట‌గిరి నియోజ‌క‌వ‌ర్గం నుంచి వ‌రుస విజ‌యాల‌తో మంచి జోష్ మీదున్నారు కొరుగుండ్ల రామ‌కృష్ణ‌. 2009, 2014 ఎన్నిక‌ల్లో ఆయ‌న ఇక్క‌డ తిరుగులేని విజ‌యాల‌ను కైవ‌సం చేసుకున్నారు. ఒక‌సారి కాంగ్రెస్ అభ్య‌ర్థి నేదురుమ‌ల్లి రాజ్య‌ల‌క్ష్మిని, గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థి కొమ్మి ల‌క్ష్మినాయుడుల‌ను మ‌ట్టిక‌రిపించారు. ఇక్క‌డ మ‌రోసారి గెలిచేందుకు ఆయ‌న ప్రిపేర్ అవుతున్నారు. ప్ర‌జ‌ల‌కు నిత్యం అందుబాటులో ఉంటున్నారు. అంతేకాదు, ఇక్క‌డ ఈయ‌న‌ను ఓడించ‌డం అంత ఈజీకాద‌ని గ్ర‌హించిన వైసీపీ.. ఎవ‌రిని నిల‌బెట్టాలా? అనే అంశంపై గ‌త నెల రోజులుగా త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతోంది. అంటే .. ఇక్క‌డ కొరుగుండ్ల ఏ రేంజ్‌లో ప్ర‌జ‌ల మ‌నసుల్లో పాతుకుపోయారో అర్ధ‌మ‌వుతుంది.

స్వయంకృతాపరాధమే……

మ‌రి అలాంటి నేత‌కు సొంత పార్టీటీడీపీలోనే వ్య‌తిరేక వ‌ర్గం త‌యారైంది. ఇందుకు ఆయ‌న స్వ‌యం కృతాప‌రాథం కూడా కొంత ఉంది. దూకుడుగా ఉండ‌డం, ఇటీవ‌ల పెరిగిన అవినీతి లాంటి కార‌ణాల‌తో పాటు ఆయ‌న‌ను ఎలాగైనా బ‌ద్నాం చేయాల‌ని సొంత పార్టీ నాయ‌కులే చేస్తోన్న ప్ర‌య‌త్నాలు ఆయ‌న‌కు మైన‌స్‌గా మారాయి. ఈ క్ర‌మంలోనే తాజాగా ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా మీడియాకు లీకిస్తున్నారు టీడీపీ నాయ‌కులు. త‌మ‌కు కాంట్రాక్టులు క‌ట్ట‌బెట్ట‌డం లేద‌ని గుస్సాపై ఉన్న నాయ‌కులు కురుగొండ్ల‌కు వ్య‌తిరేకంగా పావులు కదుపుతున్నారు.

సెగ మామూలుగా లేదు….

తాజాగా మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ దొంతు శారదను కొరుగొండ్ల తీవ్రంగా అవ‌మానించార‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. జాతీయ చేనేత దినం రోజు మున్సిపల్‌ కౌన్సిల్‌ అత్యవసర సమావేశంలో చైర్‌పర్సన్‌ కుర్చీని ఎమ్మెల్యే ఉద్దేశ పూర్వ‌కంగానే తీసి వేయించార‌నే ప్ర‌చారం ఊపందుకుంది. ఇది రాజ‌కీయంగా జిల్లాలో కాక పుట్టిస్తోంది. ప్ర‌త్యేక స‌మావేశం సంద‌ర్భం చైర్‌ప ర్స‌న్‌కు కుర్చీ లేకుండా చేసిన ఘ‌నత ఎమ్మెల్యేదేనంటూ పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. దీనిపై ఎమ్మెల్యే వివ‌ర‌ణ ఇచ్చుకున్నా ఈ సెగ మాత్రం ఆగ‌డం లేదు. ఎమ్మెల్యే కావాల‌నే మ‌హిళా ప్ర‌జాప్ర‌తినిధిని అవ‌మానించార‌న్న విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*