సీనియర్లు….ఇక గుడ్ బై….!

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో చెప్పలేని ప‌రిస్థితి నెల‌కొంది. ప్రస్తుతం ఎన్నికల వేడిలో ఏపీ ర‌గులుతోంది. ఈ నేప‌థ్యంలో కొంద‌రు టీడీపీ సీనియ‌ర్ నాయ‌కులు ప్రత్యక్ష ఎన్నిక‌ల నుంచి త‌ప్పుకొంటున్నారనే వార్తలు రాజ‌కీయాల‌ను మ‌రింత వేడెక్కిస్తున్నాయి. ఈ వ‌రుస‌లో దాదాపు ప‌దిమంది సీనియ‌ర్ నేత‌లు ఉన్నార‌ని తెలుస్తోంది. గ‌డ‌చిన 30 ఏళ్ళుగా వాళ్ళంతా వివిధ జిల్లాల్లో త‌మ‌దైన ముద్ర వేసుకున్నారు. అటువంటిది వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌కూడ‌ద‌ని సుమారు 10 మంది సీనియ‌ర్లు నిర్ణయించుకున్నట్లు స‌మాచారం. వారిలో కీల‌క‌మైన నేత‌లు ఇప్పటికే త‌మ మ‌నసులో మాట‌ల‌ను చంద్రబాబుకు చెప్పార‌ని స‌మాచారం. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాము త‌ప్పుకొంటున్నామ‌ని, త‌మ వారికి అవ‌కాశం క‌ల్పించాలి.. అనేది వీరి ప్రధాన డిమాండ్‌గా ఉండ‌డం గ‌మ‌నార్హం.

యనమల ప్రత్యక్ష రాజకీయాలకు…..

తూర్పు గోదావ‌రి జిల్లాలో సీనియ‌ర్ నేత‌, మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు, క‌ర్నూలు జిల్లాలో కేఈ కృష్ణమూర్తి, చిత్తూరు జిల్లాలో మాజీ మంత్రి బొజ్జల గోపాల‌కృష్ణారెడ్డి, విజ‌య‌న‌గ‌రం జిల్లాలో అశోక్ గ‌జ‌ప‌తిరాజు, అనంత‌పురం జిల్లాలో జేసీ సోద‌రులు దివాక‌ర్ రెడ్డి, ప్రభాక‌ర్ రెడ్డి, హ‌నుమంతరాయ చౌద‌రి, వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌క‌పోవ‌చ్చు. అయితే, ఎన్నిక‌లు ద‌గ్గరపడే కొద్దీ మ‌రింత మంది నేత‌ల పేర్లు బ‌య‌ట‌కు వ‌చ్చే అవ‌కాశం ఉంది. అయితే, వీరంతా పోటీకి దూరం అవుతున్న కార‌ణం డిఫ‌రెంట్‌గా ఉంది. క‌ర్నూలు జిల్లా ప‌త్తికొండ నియోజ‌క‌వ‌ర్గం నుండి త‌న కొడుకు శ్యాంబాబుకు టిక్కెట్టు ఇవ్వాల్సిందిగా ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి చంద్రబాబునాయుడును కోరుతున్నారు. శ్యాంబాబు ఇప్పటికే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌త్తికొండ‌లో పోటీ చేసేందుకు గ్రౌండ్ లెవ‌ల్లో తిరుగుతూ ప‌ట్టు సాధించుకునే ప్రయ‌త్నాల్లో ఉన్నారు.

బొజ్జల..అశోక్ దీ అదే బాట…

ఇక‌, చిత్తూరు జిల్లా శ్రీ‌కాళ‌హ‌స్తి నియోజ‌క‌వ‌ర్గం నుండి బొజ్జల గోపాల‌కృష్ణారెడ్డి స్దానంలో బొజ్జల సుధీర్ రెడ్డి వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీకి దిగ‌వ‌చ్చు. అనారోగ్యం, వ‌య‌స్సు త‌దిత‌ర కార‌ణాల‌తో బొజ్జ‌ల రాజ‌కీయాల నుండి త‌ప్పుకుంటు న్నారు. విజ‌య‌న‌గ‌రం జిల్లాలో అశోక్ వ‌చ్చేసారి త‌న కూతురును రంగంలోకి దింపే యోచ‌న‌లో ఉన్నారు. రాజుకు ఆరోగ్య స‌మ‌స్యలేమీ లేక‌పోయినా ప్రస్తుత రాజ‌కీయాల‌పై ఆయ‌న విసుగు చెందిన‌ట్టు ఆయ‌నే ప‌లు సంద‌ర్భాల్లో వెల్లడించారు.అయితే ఆయ‌న వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేసినా అసెంబ్లీకే వెళ్లే యోచ‌న‌లో ఉన్నారే త‌ప్పా ఎంపీగా వెళ్లరు. వీలుంటే ఆయ‌న కుమార్తె ఆదితిని విజ‌య‌న‌గ‌రం ఎంపీగా పోటీ చేయించ‌వ‌చ్చు.

జేసీ సోదరులు కూడా…..

ఇక‌, అనంత‌పురం జిల్లా తాడిప‌త్రి నియోజ‌క‌వ‌ర్గంలో జెసి ప్రభాక‌ర్ రెడ్డి త‌ప్పుకుంటున్నారు. ఇక‌, జెసి దివాక‌ర్ రెడ్డి కూడా రాజ‌కీయాల నుండి త‌ప్పుకుంటున్నారు. వాళ్ళిద్దరూ త‌మ వార‌సుల‌ను తాడిప‌త్రి ఎంఎల్ఏ, అనంత‌పురం ఎంపిగా పోటీ చేయ‌టానికి అవకాశం ఇవ్వాల‌ని చంద్రబాబును కోరుతున్నారు. వీరికి బ‌ల‌మైన కేడ‌ర్ కూడా ఉండ‌డం క‌లిసి వ‌స్తున్న ప‌రిణామం. అనంత‌పురం జిల్లాలోనే క‌ళ్యాణ‌దుర్గం నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే అయిన హ‌నుమంత‌రాయ చౌద‌రి కూడా వ‌య‌స్సు రీత్యా రాజ‌కీయాల నుండి త‌ప్పుకుంటున్నారు. త‌న స్ధానంలో కొడుకు మారుతికి అవ‌కాశం ఇవ్వాల‌ని కోరుతున్నారు. దీంతో ఇప్పుడు టీడీపీలో సీనియ‌ర్లు పోయి.. జూనియ‌ర్ల హ‌వా పెరుగుతుండ‌డం ఖాయ‌మ‌ని తెలుస్తోంది. మ‌రి చంద్రబాబు వీరికి ఎంత మేరకు అవ‌కాశం ఇస్తారో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*