కోడలైనా….కూతురైనా….టిక్కెట్ ఖాయం…!

మ‌రో ప‌దిమాసాల్లోనే రాష్ట్రంలో ఎన్నిక‌లు ఉన్నాయి. ఏ పార్టీకి ఆ పార్టీ వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నాయి. ఇక‌, అదికార టీడీపీ తిరిగి అధికారం ద‌క్కించుకోవాల‌ని ఎన్నో వ్యూహాల‌తో ముందుకు వెళ్తోంది. ఇదిలావుంటే, ఈ పార్టీలో వార‌సులు పెద్ద ఎత్తున రంగంలోకి దిగుతున్నారు. దాదాపు ముప్పై ఏళ్ల‌కు పైగా రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పుతున్న నాయ‌కులు త‌మ వార‌సుల‌కు అవ‌కాశం ఇవ్వాల‌ని భావిస్తున్నారు. వాస్త‌వానికి చంద్ర‌బాబు తొలుత వార‌స‌త్వ రాజ‌కీయాల‌కు వ్య‌తిరేకంగా కామెంట్లు చేశారు. కానీ, ఆయ‌న యూట‌ర్న్ తీసుకున్నాడు. త‌న కుమారుడు, లోకేష్‌ను శాస‌న మండ‌లికి పంపి.. అటు నుంచి మంత్రిని సైతం చేశారు. ఇలా చంద్ర‌బాబే వార‌సుల‌ను ప్రోత్స‌హిస్తుండ‌గా లేనిది త‌మ వ‌ర‌కు వ‌స్తే త‌ప్పేంట‌ని త‌మ్ముళ్లు భావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే తాజా జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌ల్లో నేత‌లు త‌మ వార‌సుల‌ను రంగంలోకి దింపాల‌ని యోచిస్తున్నారు.

ఈ ఇద్దరి నేతలకు….

ముఖ్యంగా తూర్పు గోదావ‌రి నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న కీల‌క నేత‌లు, చంద్ర‌బాబుకు అత్యంత స‌న్నిహితులు మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు, ఎంపీ, న‌టుడు మాగంటి ముర‌ళీ మోహ‌న్‌లు ఇద్ద‌రూ కూడా వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ వారసులుగా ఒక‌రు త‌మ కుమార్తెను, మ‌రొక‌రు త‌మ కోడ‌లిని రంగంలోకి దింపాల‌ని ప్ర‌ణాళిక సిద్ధం చేసుకున్నారు. ఈ నేప‌థ్యంలో రాజ‌కీయాలు ఆస‌క్తిగా మారాయి. ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె దివ్య కాకినాడ రూరల్‌ నుంచి టీడీపీ టిక్కెట్టు కోసం ఆశపడుతున్నారు. 2014లోనే తనకు టికెట్‌ ఇవ్వాలని ఆమె తండ్రికి విజ్ఞప్తి చేసినా.. యనమల సున్నితంగా తిరస్కరించారు. ఈసారైనా తనకు అసెంబ్లీ టిక్కెట్టు ఇప్పించాలంటూ ఆమె యనమలపై ఒత్తిడి తెస్తోంది. ఇప్ప‌టికే ఆమె తండ్రి వ్య‌వ‌హారాల‌ను చ‌క్క‌బెడుతున్న‌ట్టు అడ‌పాద‌డ‌పా వార్త‌లు వ‌స్తున్నాయి.

తుని సేఫ్ కాదని….

య‌న‌మ‌ల సొంత నియోజ‌క‌వ‌ర్గం తునిలో కులాల ఈక్వేష‌న్ల ప‌రంగా చూస్తే అంత సేఫ్ కాద‌ని డిసైడ్ అయిన ఆమె ఇప్పుడు కాకినాడ రూర‌ల్‌పై క‌న్నేసిన‌ట్టు తెలుస్తోంది. అయితే ఇప్ప‌టికే అక్క‌డ టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా పిల్లి అనంత‌ల‌క్ష్మి ఉన్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆమెకు టిక్కెట్ రాద‌ని ప్ర‌చారం జ‌రుగుతోన్న నేప‌థ్యంలో ప‌లువురు టీడీపీ ఆశావాహులు ఇక్క‌డ టిక్కెట్ రేసులో ఉన్నారు. ఇప్పుడు ఈ లిస్టులోకి దివ్య వ‌చ్చి చేర‌డంతో కాకినాడ రూర‌ల్ టీడీపీ సీటు రాజ‌కీయం ఆస‌క్తిగా మారింది. ఈ నేప‌థ్యంలో స్థానికంగా ఆమె ప‌ట్టు సాధించాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు స‌మాచారం. దీనిపై ప్ర‌స్తుతం చ‌ర్చ‌లు న‌డుస్తు న్నాయి.

కోడలు రూపాదేవికి….

య‌న‌మ‌ల త‌లుచుకుంటే.. పార్టీ నుంచి టికెట్ ఖాయ‌మ‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఇక‌, రాజ‌మండ్రి ఎంపీ ముర‌ళీమోహ‌న్‌.. త‌న కోడ‌లును వ‌చ్చే ఎన్నిక‌ల్లో బ‌రిలోకి దింపాల‌ని భావిస్తున్నారు. కోడలు రూపాదేవిని తన రాజకీయ వారసురాలిగా రంగంపేట మండలం వడిశలేరు సభలో గతంలోనే ప్రకటించారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటానంటున్నారు. లోక్‌సభ కంటే అసెంబ్లీకి పోటీ చేయడానికే రూపాదేవి ఇష్టపడుతున్నట్టు చెప్తున్నారు. రాజమహేంద్రవరం సిటీ స్థానం నుంచి సీటు ఆశిస్తున్నారు.

పార్టీలో గుర్తింపు పొందుతూ….

మురళీమోహన్‌ కోడలిగానే కాకుండా.. టీడీపీ రాష్ట్రస్థాయిలో కీలక సమావేశాలు, సోషల్‌ మీడియా వర్క్‌షాపుల్లో రూప క్రియాశీలకంగా ఉన్నారు. సమర్థవంతమైన నాయకురాలిగా, అందరినీ సమన్వయం చేసుకోవడంలో ఇప్పటికే ఆమె పార్టీలో గుర్తింపు పొందారు. అయితే ముర‌ళీమోహ‌న్ తిరిగి ఎంపీగా పోటీ చేయాల‌నుకుంటే రూప‌కు ఛాన్స్ వ‌స్తుందా ? లేదా ? అన్న‌ది చూడాలి. ఈ నేప‌థ్యంలో టీడీపీలో కీల‌క నేత‌లైన య‌న‌మ‌ల‌, ముర‌ళీమోహ‌న్ ఇంటి నుంచిమ‌హిళా మ‌ణులు రాజ‌కీయాల్లో క్రియాశీల‌కంగా వ్య‌వ‌హ‌రించ‌నుండ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. మ‌రి ప్ర‌జ‌లు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*