టీడీపీ వర్సెస్ టీడీపీ..వార్ షురూ…!

గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజ‌క‌వ‌ర్గం రాజ‌కీయాలు రాబోయే రోజుల్లో హాట్ హాట్‌గా మార‌నున్నాయా? ఇక్క‌డ టీడీపీ రాజ‌కీయాలు మరింత వేడిగా మార‌నున్నాయా? సొంత‌పార్టీలోనే నేత‌లు ఒక‌రిపై ఒక‌రు క‌త్తులు దూసుకోవ‌డం ఖాయ‌మా? దీనికి రాబోయే అసెంబ్లీ ఎన్నిక‌లే వేదిక కానున్నాయా? అంటే.. తాజా ప‌రిణామాలు ఔన‌నే అంటున్నాయి. విష‌యంలోకి వెళ్తే.. పెద‌కూర‌పాడు ప్ర‌స్తుతం టీడీపీకి పెట్ట‌ని కోట‌గా ఉంది. ఇక్క‌డ కొన్ని ద‌శాబ్దాల పాటు హ‌వా చ‌లాయించిన కాంగ్రెస్ నేత క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌(ప్ర‌స్తుతం బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు)కు బ్రేకులు వేసి ఇక్క‌డ గ‌డిచిన రెండు ఎన్నిక‌ల నుంచి టీడీపీ గెలుపు గుర్రం ఎక్కుతోంది.

రెండుసార్లు వరుసగా….

2009, 2014 ఎన్నిక‌ల్లో పెద‌కూర‌పాడు నియోజ‌క‌వ‌ర్గం నుంచి టీడీపీ టికెట్‌పై పోటీ చేసిన కొమ్మాల‌పాటి శ్రీధ‌ర్‌.. విజ‌యం సాధిస్తూ వ‌చ్చారు. నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ జెండాయే ఎగ‌ర‌ని టైంలో ఇక్క‌డ పార్టీ వ‌ర‌సు విజ‌యాలు సాధించింది అంటే శ్రీథ‌ర్ ప‌డిన క‌ష్టమే. రాజ‌ధాని ఎఫెక్ట్‌తో పాటు ఎమ్మెల్యే స‌హ‌కారంతో ఇక్క‌డ అభివృద్ధి జ‌రిగింది. అయితే ప‌దేళ్లుగా ఆయ‌న ఎమ్మెల్యేగా ఉండ‌డంతో పాటు ఇత‌ర‌త్రా కార‌ణాల వ‌ల్ల స్థానికంగా కొంత‌మంది కేడ‌ర్‌లో ఇటీవ‌లే అసంతృప్తి క‌నిపిస్తోంది. అయితే, రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో చెప్ప‌లేని ప‌రిస్థితి నెల‌కొంటుంది కాబ‌ట్టి.. ఈ నియోజ‌క‌వ‌ర్గం రేసులో తాను కూడా ఉన్న‌ట్టు సీనియ‌ర్ పార్ల‌మెంటేరియ‌న్‌, న‌ర‌సారావుపేట‌ టీడీపీ ఎంపీ రాయ‌పాటి సాంబ‌శివ‌రావు కుమారుడు రాయ‌పాటి రంగారావు సంకేతాలు ఇవ్వ‌డంతో పెద‌కూర‌పాడు టీడీపీ సీటు కోసం రాజ‌కీయం ర‌స‌కందాయంలో ప‌డింది.

ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే…..

ఇక ఇక్క‌డ ఎంపీ వ‌ర్గానికి ఎమ్మెల్యే వ‌ర్గానికి ఇప్ప‌టి వ‌ర‌కు ఇంట‌ర్న‌ల్‌గా మాత్ర‌మే ఉన్న చిన్నపాటి యుద్ధం కాస్తా ఇప్పుడు ముదిరిపాకాన ప‌డింద‌న్న చ‌ర్చ‌లు కూడా జిల్లాలో స్టార్ట్ అయ్యాయి. ఇటీవ‌ల పెద‌కూర‌పాడు నియోజ‌క‌వ‌ర్గంలో ఇసుక వ్య‌వ‌హారంలో రంగారావుపై తీవ్ర ఆరోప‌ణ‌ల‌తో మీడియాలో పెద్ద ఎత్తున వ్య‌తిరేక వార్త‌లు వ‌చ్చాయి. దీనిపై కేసులు కూడా న‌మోద‌య్యాయి. ఇక్క‌డ రంగారావుతో పాటు చంద్ర‌బాబు త‌న‌యుడు, మంత్రి నారా లోకేశ్ పేరు కూడా వ‌చ్చింది. అయితే రంగారావుతో పాటు లోకేశ్‌పై ఇక్క‌డ వ‌చ్చిన‌ వ్య‌తిరేక వార్త‌లు, వ్య‌తిరేక క‌థ‌నాల వెనుక టీడీపీకే చెందిన ప్ర‌ముఖుల హ‌స్తం ఉంద‌ని రాయ‌పాటి వ‌ర్గం భావిస్తోంది.

సొంతపార్టీ నేతలే కత్తికట్టారంటూ….

ఓ సంద‌ర్భంలో సొంత పార్టీ నేత‌లే త‌మ‌పై క‌త్తిక‌ట్టార‌ని ఆయ‌న విమ‌ర్శ‌లు కూడా సంధించారు. మొత్తంగా పెద‌కూర‌పాడులో త‌న‌పై జ‌రుగుతున్న రాజ‌కీయాల‌పై రంగారావు ఆగ్ర‌హంగా ఉన్నారు. సుదీర్ఘ రాజ‌కీయాల్లో రాయ‌పాటి ఫ్యామిలీపై ఎలాంటి అవినీతి మ‌ర‌కా లేదు. ఇప్పుడు ఆయ‌న కుమారుడి పేరు ప్ర‌ముఖంగా రావ‌డంతో దీనిని ఎంపీ వ‌ర్గం సీరియ‌స్‌గా తీసుకుంది. చివ‌ర‌కు ఈ వ్య‌వ‌హారం చంద్ర‌బాబు వ‌ద్ద‌కు చేర‌డం, ఆయ‌న ఇంటిలిజెన్స్ రిపోర్టులు తెప్పించుకునే వ‌ర‌కు ప‌రిస్థితి వెళ్లింద‌ని తెలుస్తోంది. త‌మ సొంత నియోజ‌క‌వ‌ర్గం అయిన‌ పెద‌కూర‌పాడు నియోజ‌క‌వ‌ర్గంలోనే త‌న‌పై ఆరోప‌ణ‌లు, వ్య‌తిరేక క‌థ‌నాలు వ‌చ్చిన నేప‌థ్యంలో అదే నియోజ‌క‌వ‌ర్గంలోని అచ్చంపేటలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో రంగారావు అధిష్టానం ఆదేశిస్తే పెద‌కూర‌పాడు నుంచి అయినా పోటీ చేసేందుకు సిద్ధం అని ప్ర‌క‌టించారు. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డ టీడీపీ సీటుపై అప్పుడే రాయ‌పాటి వ‌ర్సెస్ కొమ్మాల‌పాటి మ‌ధ్య అప్ర‌క‌టిత యుద్ధం మొద‌లైన‌ట్టే క‌నిపిస్తోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*