వరుసగా పార్టీలు మారారో….ఈయన గతే…!

రాజ‌కీయాల్లో ఆలోచించి తీసుకున్న నిర్ణయాలే ఒక్కోసారి ఎదురు తిరుగుతుంటాయి. అలాంటిది అనాలోచితంగా తీసుకునే నిర్ణయాలు మ‌రింత ప్రమాద క‌రంగా ఉంటాయి. ఇలాంటి ఒక్క నిర్ణయం రాజ‌కీయంగా కీల‌క స్థానాల్లో ఉన్నవారిని సైతం కింద‌కి తోసేసే ప‌రిస్థితిని తెస్తుంద‌నడంలో సందేహం లేదు. ఇలాంటి నాయ‌కుడికి ఉదాహ‌ర‌ణే.. కొత్తప‌ల్లి సుబ్బారాయుడు. కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కుడిగా, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా నేత‌గా ఆయ‌న ప్రత్యేక గుర్తింపు పొందారు. ప్రస్తుతం ఆయ‌న గ‌త ఏప్రిల్‌లో చంద్రబాబు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కాపు కార్పొరేష‌న్ కు చీఫ్‌గా నియ‌మితుల‌య్యారు. వాస్తవానికి గ‌తంలో ఆయ‌న చేసిన రాజ‌కీయాల‌కు, ఇప్పుడు చేప‌ట్టిన ప‌ద‌వికి ఎలాంటి సంబంధం లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. దీంతో ఆయ‌న గురించిన చ‌ర్చ ఆస‌క్తిగా సాగుతోంది.

వరుస విజయాలతో….

ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో కొత్తప‌ల్లి పేరు రాజ‌కీయాల‌కు ప‌ర్యాయ‌ప‌దం. ఆయ‌న నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఒక‌సారి ఎంపీగాను చ‌క్రం తిప్పారు. అయితే, అనూహ్యంగా ఆయ‌న వేసిన అడుగు రాజ‌కీయంగా ఆయ‌న‌ను అథః పాతాళానికి తొక్కేసింది. పార్టీలను మార్చడం ఆయ‌న‌కు శాపంగా మారింది. న‌ర‌సాపురం నుంచి ప్రాతినిధ్యం వ‌హించిన కొత్తప‌ల్లి చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా కూడా ప‌నిచేశారు. 1989లో టీడీపీ తీర్థం పుచ్చుకున్న ఆయ‌న పార్టీ త‌ర‌ఫున మూడు సార్లు వ‌రుస‌గా ఎమ్మెల్యే అయ్యారు. ఖ‌చ్చితంగా విజ‌యం సాధించే నేత‌గా ఆయ‌న పేరు తెచ్చుకున్నారు. మ‌ధ్యలో ఓ సారి ఎంపీగా గెలిచి, త‌న సోద‌రుడు జాన‌కీరామ్‌ను కూడా ఎమ్మెల్యేగా గెలిపించుకున్న ఘ‌న‌త ద‌క్కించుకున్నారు. అయితే, అనూహ్యంగా ఆయ‌న 2009లో ఆయ‌న చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం వైపు మ‌ళ్లారు. ఇదే ఆయ‌న‌కు డౌన్ ట్రెండ్ తెచ్చింది.

గుర్తింపు ఇచ్చినా…..

అప్పటి నుంచి ఆయ‌న‌ను ప‌ట్టించుకునేవారే క‌రువ‌య్యారు. నిజానికి టీడీపీతో మ‌మేక‌మైన కొత్తప‌ల్లికి చంద్రబాబు పెద్ద ఎత్తున గుర్తింపు ఇచ్చారు. ఆయ‌న మాట‌కు తిరుగులేకుండా చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడి హోదాలో ఉండి కొత్తప‌ల్లి చివ‌రి వ‌ర‌కు బాబును న‌మ్మించి మ‌రీ సామాజిక వ‌ర్గాల స‌మీక‌ర‌ణ‌లో భాగంగా కొత్తపల్లి చిరు పంచ‌కు చేర‌డం , ఆయ‌న పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయ‌డం, దీంతో కొత్తప‌ల్లి కాంగ్రెస్‌లోకి వెళ్లిపోవడం జ‌రిగాయి. అయితే, 2014 రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో కాంగ్రెస్‌కు ఏపీలో నూక‌లు చెల్లిపోయాయి. దీంతో కొత్తప‌ల్లి వెంట‌నే వెనుకా ముందు ఆలోచించుకోకుండానే వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ ఎన్నిక‌ల్లో టికెట్ కూడా తెచ్చుకున్నారు. అయితే, అనూహ్యంగా ఆ ఎన్నిక‌ల్లో కొత్తప‌ల్లి ఘోర ప‌రాజ‌యం పాల‌య్యారు. మ‌రోప‌క్క కేడ‌ర్ కూడా పూర్తిగా కోల్పోయారు.

ఆయన ఫ్యూచర్ ఏంటో ఆయనకే…..

ఇక‌, ఈ నేప‌థ్యంలో కొంతకాలం క్రితం మ‌ళ్లీ మాతృ పార్టీలోకి చేరిపోయారు. కొత్తప‌ల్లి చివ‌ర‌కు అన్ని పార్టీలు మారి టీడీపీలో చేరినా ఇప్పుడు ఆయ‌న‌కు గ‌తంలో ఉన్న క్రేజ్‌లో స‌గం కూడా లేదు. ఒక‌ప్పుడు గ‌ర్జించిన సింహంలా ఉండే ఆయ‌న ఇప్పుడు మామూలు రాజ‌కీయ నేత స్థాయికి ప‌డిపోయారు. ప్రస్తుతం కాపు కార్పొరేష‌న్ లో చైర్మన్‌గా ఉన్నారు. నిజానికి టీడీపీనే న‌మ్ముకుని ఉంటే.. ప‌రిస్థితి మంత్రి స్థాయిలో ఉండేద‌ని కొత్తప‌ల్లి అనుచ‌రులు అంటారు. ఏదేమైనా.. నేటి త‌రం ఫిరాయింపు నేత‌ల‌కు కొత్త ప‌ల్లి రాజ‌కీయ జీవితం ఓ పాఠం అన‌డం లో సందేహం లేదు. ఇక ప్రస్తుతం అక్కడ టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే బండారు మాధ‌వ‌నాయుడు స్ట్రాంగ్‌గా పాతుకుపోవ‌డంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో కొత్తప‌ల్లికి న‌ర‌సాపురం సీటు ద‌క్కే ప‌రిస్థితి లేదు. వ‌చ్చే ఎన్నిక‌ల త‌ర్వాత కొత్తప‌ల్లి ఫ్యూచ‌ర్ ఏంటో ఆయ‌న‌కే తెలియ‌దు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*