ఇక్కడ మాకొక అభ్యర్థి కావలెను….! లోకల్స్ కు ప్రయారిటీ

విశాఖ పార్లమెంటు స్థానం అన్ని పార్టీలకూ తలనొప్పిగా మారింది. గత కొన్నేళ్లుగా ఇక్కడ నాన్ లోకల్ అభ్యర్థులే విజయం సాధిస్తూ వస్తున్నారు. ఈసారి విశాఖ ఎంపీగా పోటీ చేసేందుకు అన్ని పార్టీల్లో నేతలు పెద్దగా ఆసక్తి కనపర్చడం లేదు. అధికార తెలుగుదేశం పార్టీ, వైసీపీ, జనసేన వంటి పార్టీలు కూడా ఇందుకు మినహాయింపు కాదు. విశాఖ రైల్వే జోన్ కీలకంగా మారడంతో పోటీకి అందరూ అనాసక్తి చూపుతున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఎవరిని విశాఖ ఎంపీగా నిలబెట్టాలన్న మీమాంసలో అన్ని పార్టీలూ ఉండటం విశేషం.

నాన్ లోకల్స్ నే ఎక్కువగా…..

విశాఖ పార్లమెంటు స్థానానికి ఒకప్పుడు పోటీ ఎక్కువ. విశాఖ నగరంలో దాదాపు 80 శాతం ఓటింగ్ ఉండటంతో పెద్దగా డబ్బులు ఖర్చు చేయకుండానే పార్లమెంటులో అడుగుపెట్టే వీలుంది. దీంతో నిన్న మొన్నటి వరకూ ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు పోటీ పడేవారు. 1990కు ముందు విశాఖ వాసులు స్థానికులకే అవకాశం కల్పించారు. కాని ఆ తర్వాత స్థానికేతరులు పోటీ చేస్తుండటంతో వారినే విజయం వరిస్తూ వస్తోంది. 1996లో టి.సుబ్బరామిరెడ్డి గెలిచారు. ఈయన నాన్ లోకల్. 1999లో ఎంవీఎస్ మూర్తి, 2004లో నేదురుమిల్లి జనార్థన్ రెడ్డి విజయం సాధించారు. 2009లో దగ్గుబాటి పురంద్రీశ్వరి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు. దీంతో నాన్ లోకల్ వారినే విశాఖ వాసులు ఆదరిస్తున్నారన్నది గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

గత ఎన్నికల్లో మాత్రం…..

అయితే గత ఎన్నికల్లో మాత్రం లోకల్స్ కే విశాఖవాసులు జై కొట్టారు. విశాఖ ఎంపీగా కంభంపాటి హరిబాబు బీజేపీ, టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీకి దిగడం, వైస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి విజయమ్మ వైసీపీ నుంచి పోటీ చేయడంతో లోకల్, నాన్ లోకల్ నినాదాన్ని ఎత్తుకున్నారు. దీంతో హరిబాబును విజయం వరించింది. ఈసారి ఎంపీగా పోటీ చేసేందుకు హరిబాబు కూడా అనాసక్తి చూపుతున్నారు. తెలుగుదేశం, వైసీపీల్లో కూడా పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. వైసీపీ తరుపున విజయసాయి రెడ్డి పోటీ చేసే అవకాశముందన్న వార్తలు వస్తున్నాయి. తెలుగుదేశం పార్టీకి అభ్యర్థుల కొరత లేకపోయినా అందరూ అనాసక్తి చూపిస్తుండటంతో ఎవరిని బరిలోకి దించుతారన్నది తేలకుండా ఉంది.

లోకల్స్ విముఖత చూపిస్తుండటంతో….

ఇదిలా ఉంటే విశాఖ పార్లమెంటు స్థానానికి అన్ని పార్టీలూ ఇప్పుడు స్థానికేతరులకే ఇచ్చేలా పరిస్థితి కన్పిస్తోంది. స్థానిక నేతలు ఎమ్మెల్యే టిక్కెట్ కే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎంపీగా పోటీ చేసేందుకు విముఖత చూపుతున్నారు. రైల్వే జోన్ ప్రధాన అంశంగా మారడంతో ఆ ప్రభావం అధికార పార్టీలపై పడనుంది. అంతేకాకుండా ఉత్తరాంధ్ర అభివృద్ధి కూడా ఇందులో కీలకం కానుంది. అందుకే తెలుగుదేశం పార్టీతో సహా జనసేన, వైసీపీలు కూడా స్థానికేతరులకే ఈసారి విశాఖ ఎంపీ టిక్కెట్ ఇస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. మరి విశాఖ వాసులు నాన్ లోకల్స్ ను ఈసారి ఆదరిస్తారా? లేక ఏ పార్టీ అయినా స్థానికులకు అవకాశమిస్తే వారిని అక్కున చేర్చుకుంటారా? అన్నది చూడాల్సి ఉంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*