జెండా మారిస్తే…జాతకం మారేనా?

ఎన్నికలు సమీపిస్తున్న వేళ జంపింగ్ లు సహజం. ఒక పార్టీ నుంచి మరొక పార్టీకి జంప్ అవుతారు. పార్టీ మారాలనుకున్న నేతలను రెండు అంశాలను ప్రధానంగా పరిగణనలోకి తీసుకుంటారు. ముఖ్యంగా సీనియర్ నేతలు సీరియస్ గా ఆలోచించే నిర్ణయం తీసుకుంటారు. అనుచరులతో సమావేశం చివరలో జరిపినా, ముందుగా తమకు టిక్కెట్ వస్తుందా? రాదా? అనేది ఒకటయితే….రెండోది తాము చేరబోయే పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశముందా? అన్నది కూడా పరిగణనలోకి తీసుకుంటారు. అయితే కొన్నిసార్లు సీనియర్ల లెక్కలు కూడా తప్పుతుంటాయి. రాజకీయంగా వారి తలరాతలు మారుతుంటాయి. జంప్ చేసిన వాళ్లలో కొందరికి అదృష్టం వరిస్తే….మరికొందరికి దురదృష్టం వెంటాడుతుంది. ఇది రాబోయే ఎన్నికలే కాదు గత ఎన్నికల్లోనూ చూశాం.

గత ఎన్నికల్లో జంప్ చేసి…..

గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి జంప్ చేసిన వాళ్లు లాభపడ్డారు. పితాని సత్యనారాయణ చివరి నిమిషంలో సైకలెక్కేసి ఎమ్మెల్యే అయి..కొన్నాళ్ల తర్వాత మంత్రి పదవిని కొట్టేశారు. ఇక తోట నరసింహం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంత్రిగా పనిచేసి టీడీపీలో చేరి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికై పార్లమెంటరీ పక్ష నేతగా వ్యవహరిస్తున్నారు. రాజకీయాల్లో లక్కీ లీడర్ గా అందరూ అంగీకరిస్తున్న గంటా శ్రీనివాసరావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన గతంలో ప్రజారాజ్యం పార్టీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ లో ఆ పార్టీ విలీనమయ్యాక మంత్రి అయ్యారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి టీడీపీలో చేరి కీలకమైన మంత్రి పదవిని చేపట్టారు. టీజీ వెంకటేశ్ కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరి రాజ్యసభ సభ్యుడయ్యారు. కాని గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి జంప్ చేసిన మాజీ మంత్రి పార్థసారధి లాంటి వాళ్లకు మాత్రం లక్కు దక్కలేదు.

పవర్ లోకి వస్తుందనేనా?

ఇక వచ్చే ఎన్నికల్లో మరోసారి జంప్ జిలానీలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇప్పటికే సీనియర్ నేతలు రెండు పార్టీల వైపూ చూస్తుండటం విశేషం. ఆనం రామనారాయణరెడ్డి కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి చేరి…అక్కడ ఇమడ లేక త్వరలోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఆనం రామనారాయణరెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆర్థికమంత్రిగా పనిచేశారు. ఇక వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందన్న ఏకైక ధీమాతోనే ఆనం పార్టీలో చేరుతున్నారన్నది ఆనం అనుచరులు చెబుతున్న మాట. తనకు టిక్కెట్ ఎక్కడో చోట జగన్ కేటాయిస్తారన్న విశ్వాసాన్ని ఆనం వ్యక్తం చేస్తున్నారు.

కొండ్రు మాత్రం టిక్కెట్ కోసమే…..

మరో సీనియర్ నేత, మాజీ మంత్రి కొండ్రు మురళి కూడా కాంగ్రెస్ ను వీడి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. కాంగ్రెస్ కు రాష్ట్రంలో భవిష్యత్ లేదని భావించిన కొండ్రు మురళి తొలుత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని అనుకున్నారు. కాని రాజా నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కంభాల జోగులు ఉన్నారు. జోగులు పార్టీని నమ్ముకునే ఉన్నారు. టీడీపీ ఎన్ని ఆఫర్లు ఇచ్చినా పార్టీని వీడలేదు. దీంతో వైసీపీలో చేరినా టిక్కెట్ రాదని భావించిన కొండ్రు తనకు టిక్కెట్ కన్ ఫర్మ్ చేసుకున్న తర్వాతనే తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. మరి కొండ్రుకు టిక్కెట్ లభిస్తుందా? లేదా? అన్నది పక్కన పెడితే ఆయన కేవలం టిక్కెట్ ఇస్తామని చెప్పడంతోనే టీడీపీలో చేరుతున్నారన్నది వాస్తవం. ఇలా ఎన్నికల వేళ కొందరు టిక్కెట్ కోసం పార్టీలు మారుతుంటే మరికొందరు పవర్ లోకి వస్తుందని ఛేంజ్ అవుతున్నారు. మరి ఎన్నికల తర్వాత గాని తెలియదు ఎవరు లక్కీ లీడర్లో….!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*