ఇక్కడ టిక్కెట్ ఎవరికంటే చెప్పడం…?

పశ్చిమగోదావరి జిల్లాలో నరసాపురం లోక్‌సభ నియోజకవర్గంలో డెల్టాలో చివరిగా విస్తరించి ఉన్న నియోజకవర్గం నరసాపురం. ఇటు గోదావరి గలగలలు… అటు సముద్ర తీరాన్ని ఆనుకుని ఉన్న ఈ నియోజకవర్గం ఓటర్ల పరంగా… వైశాల్య‌ పరంగా జిల్లాలోనే అతి చిన్న నియోజకవర్గం. నరసాపురం నియోజకవర్గంలో కేవలం 1,38,000 ఓటర్లు మాత్రమే ఉన్నారు. జిల్లాకు మూలగా ఉన్న ఈ నియోజకవర్గంలో రెండు ప్రధాన పార్టీలు టీడీపీ, వైసీపీలో రాజకీయం ఎప్పుడు ఎలా టర్న్‌ అవుతుందో, వచ్చే ఎన్నికల్లో ఇక్కడ ఈ రెండు పార్టీల నుంచి ఎవరు పోటీ చేస్తారో ? ఎవ్వరికి అర్థంకాని పరిస్థితి.

అన్నిపార్టీలూ మారడంతో…..

నియోజకవర్గ రాజకీయాల్లో గత మూడున్నర దశాబ్దాలుగా తిరుగులేని ఏకచక్రాధిపత్యం వహిస్తున్న మాజీ మంత్రి, ప్రస్తుత ఏపీ కార్పోరేషన్ చైర్మ‌న్‌ కొత్తప‌ల్లి సుబ్బారాయుడు వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే టీడీపీ వయా ప్రజారాజ్యం, కాంగ్రెస్‌, వైసీపీ తిరిగి టీడీపీలోకి రీ ఎంట్రీ ఇచ్చిన కొత్తప‌ల్లికి చంద్రబాబు ఆయన సీనియార్టీ నేపథ్యంలో కీలకమైన ఏపీ కాపు కార్పొరేష‌న్ చైర్మ‌న్ పదవి ఇచ్చారు. కొత్తప‌ల్లి పలు పార్టీలు మారడంతో నియోజకవర్గంలో ఆయనపై ఓ వర్గం జనాల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. ఇక గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన బండారు మాధవనాయుడు కొత్తప‌ల్లిపై 20 వేల ఓట్ల పైచిలుకు మెజార్టీతో ఘ‌న‌విజయం సాధించారు.

ముందునుంచి బండారు…….

నియోజకవర్గంలో ముందు నుంచి బండారు వ్యూహాత్మకంగా ఎవరితోనూ ఎలాంటి విభేదాలు లేకుండా పార్టీలో అందరిని సమన్వయం చేసుకుంటూ ముందుకు కదిలారు. ఎలాంటి రిమార్క్‌ లేకుండా ముందుకు వెళ్లడంతో పాటు నియోజకవర్గంలో కీలక ప్రాజక్ట్‌లైన నరసాపురం – కోటిప‌ల్లి రైల్వే లైను, గోదావరిపై వంతెన, పోర్టు ఇలా వీటి కోసం త‌న వంతుగా శ్ర‌మిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయనపై ఇటు టీడీపీలోనూ… నియోజకవర్గ జనాల్లోనూ కొంత సానుకూల అభిప్రాయమే కనిపిస్తోంది. తన కంచుకోటలో మాధవనాయుడు పాగా వేయ‌డాన్ని జీర్ణించుకోలేని పరిస్థితుల్లో ఉన్న కొత్తప‌ల్లి వచ్చే ఎన్నికల్లో మాధవనాయుడిని తప్పించి టీడీపీ నుంచి తానే ఎలాగైనా పోటీ చెయ్యాలని పావులు కదుపుతున్నారు.

పార్టీలకతీతంగా క్యాడర్……

వాస్తవంగా చూస్తే నియోజకవర్గంలో కొత్తప‌ల్లికి పార్టీలకు అతీతంగా కొంత కేడర్‌ ఉంది. కొత్తప‌ల్లి ఏ పార్టీలో చేరినా వారంతా ఆయన వెంటే నడుస్తారు. అయితే ఇటు బండారు మాధవనాయుడు కూడా అందరిని సమన్వయం చేసుకుంటు ముందుకు వెళ్లడంతో కొత్తప‌ల్లికి నియోజ‌క‌వ‌ర్గ టీడీపీలో ఇంకా పట్టు చిక్కలేదు. కొత్త‌ప‌ల్లి ప్ర‌య‌త్నాలు ఎలా ఉన్నా సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా బలంగా ఉన్న మాధవనాయుడిని ఎలా తప్పిస్తారన్న సందేహాలు కూడా ఉన్నాయి. తాను చేసిన అభివృద్ధితో పాటు అందరిని సయన్వయంతో కలుపుకుని ముందుకు వెళ్లడంతో వచ్చే ఎన్నికల్లో తనకే సీటు వస్తుందని మాధవనాయుడు దీమాతో ఉన్నాడు. సీనియార్టీ నేపథ్యంలో ఎట్టి పరిస్థితిలోను చంద్రబాబు తనకే బీ ఫామ్‌ ఇస్తారని సుబ్బారాయుడు తన సన్నిహితుల వద్ద ప్ర‌చారం చేసుకుంటున్నారు. ఇక గత రెండేళ్లుగా నియోజకవర్గంలో వీరిద్దరూ వేరు వేరు వర్గాలకు నాయకత్వం వహిస్తూ కలిసి పనిచెయ్యడం లేదు. మరి ఈ ఇద్దరి వార్‌ నేపథ్యంలో ఫైన‌ల్‌గా టీడీపీ సీటు ఎవరికి దక్కుతుందో ? చివరి వరకు అంచనా వెయ్యలేని పరిస్థితి.

చివరి నిమిషంలో……..

టీడీపీలో సీటు పోరు ఇలా ఉంటే విపక్ష వైసీపీలోనూ ఎవరికి సీటు వస్తుందో చివరి వరకు అర్థంకాని పరిస్థితి. జ‌గ‌న్ కోసం తన శాసనసభ్యత్వానే వదులుకున్న మాజీ ఎమ్మెల్యే ముదునూరు ప్రసాద్‌రాజుకు సైతం జగన్ గ‌త ఎన్నిక‌ల‌కు ముందు షాక్‌ ఇచ్చారు. కొత్తప‌ల్లి సుబ్బారాయుడు కాంగ్రెస్‌ నుంచి వైసీపీలోకి జంప్‌ చెయ్యడంతో ప్రసాద్‌రాజును చివరిలో ఆచంటకు పంపీ సుబ్బారాయుడికి ఇక్కడ సీటు ఇచ్చారు. అక్కడ ప్రసాద‌రాజు ఇక్కడ సుబ్బారాయుడు ఇద్దరూ ఓడిపోయారు. తిరిగి సుబ్బారాయుడు టీడీపీలోకి వెళ్లడంతో జగన్‌ ప్రసాద‌రాజుకు తిరిగి నరసాపురం సమన్వయకర్త పగ్గాలు అప్పగించారు.

సామాజిక సమీకరణాల నేపథ్యంలో…….

ఓ విధంగా చెప్పాలంటే సుబ్బారాయుడు కోసం జ‌గ‌న్ ప్ర‌సాద‌రాజు పొలిటిక‌ల్ కెరీర్‌ను సైతం ప‌ణంగా పెట్టిన‌ట్టే. అయినా సుబ్బారాయుడు జ‌గ‌న్‌కు షాక్ ఇచ్చి తిరిగి టీడీపీలోకి వెళ్లిపోయారు. వచ్చే ఎన్నికల్లో అయినా ప్రసాద‌రాజుకు సీటు వస్తుందా ? అంటే చెప్పలేని పరిస్థితి. జగన్‌ కుటుంబానికి నమ్మిన బంటుగా ఉన్నా, జగన్‌ కోసం తన పదవిని వదులుకున్న ప్రసాద‌రాజుకు సీటు విష‌యంలో జగన్‌ ఎంతవరకు న్యాయం చేస్తార‌న్న‌ది చెప్ప‌లేని పరిస్థితి. గత రెండు ఎన్నికల్లో వరుసగా ఓడిపోవడంతో పాటు సామాజిక సమీకరణల నేపథ్యంలో డెల్టాలో ఇప్పటికే క్షత్రియలకు ఏకంగా నరసాపురం ఎంపీ సీటుతో కలుపుకుని నాలుగు సీట్లు ఇచ్చే పరిస్థితి ఉంది. ఈ క్ర‌మంలోనే ప్రసాద‌రాజును తప్పించి ఇక్కడ మరో సామాజిక వ‌ర్గానికి సీటు ఇస్తారన్న చర్చలు కూడా నడుస్తున్నాయి. దీంతో ఇటు టీడీపీలోనే కాకుండా అటు వైసీపీలోను చివరి వరకు ఎవరికి అభ్యర్థిత్వం దక్కుతుందో ? చెప్పలేని పరిస్థితి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*