ఇక్కడ సైకిల్ బ్రేక్‌డౌన్‌..ఫ్యాన్ స్పీడప్…!

2014 ఎన్నిక‌ల్లో టీడీపీకి కంచుకోటగా నిలిచిన జిల్లాల్లో ప‌శ్చిమ‌గోదావ‌రి తొలి వ‌రుస‌లో ఉంటుంది. ఏ జిల్లాలోనూ లేనంత‌గా టీడీపీ క్లీన్‌స్వీప్ చేసింది. 15కి 15 స్థానాల‌ను టీడీపీ కూట‌మి ఖాతాలో వేసుకుంది. పొత్తులో బీజేపీకి ఇచ్చిన న‌ర‌సాపురం ఎంపీతో పాటు తాడేప‌ల్లిగూడెం అసెంబ్లీ సీటు కూడా బీజేపీ గెలిచింది. రైతు రుణ‌మాఫీ, డ్వాక్రా రుణ మాఫీ హామీలు ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా వెళ్ల‌డంతో ఆయా వ‌ర్గాల ప్ర‌జలు టీడీపీపై ఓట్ల వ‌ర్షం కురిపించారు. ప్ర‌తిప‌క్షం పేరు అంత‌గా వినిపించ‌ని ఈ జిల్లాలో.. వైసీపీ అధినేత జ‌గ‌న్ చేప‌ట్టిన పాద‌యాత్ర‌కు అడుగ‌డుగునా జ‌నం నీరాజ నాలు ప‌ట్టారు. ఇది దేనికి సంకేతం? ప‌్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల్లో న‌మ్మ‌కం త‌గ్గిందా? లేక ప్ర‌భుత్వం చేసిన త‌ప్పులే ప్రజ‌ల‌ను జ‌గ‌న్ వైపు ఆక‌ర్షితుల‌య్యేలా చేస్తున్నాయా? అనే సందేహాలు అందరిలోనూ వినిపిస్తున్నాయి.

స్వయంకృతాపరాధమేనా?

నాలుగేళ్ల‌లో ఇంత వ్య‌తిరేక‌తను కూడ‌గ‌ట్టుకోవ‌డానికి టీడీపీ నేత‌ల స్వ‌యం కృతాప‌రాధమే కార‌ణమ‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. క‌ర్ణుడి మ‌ర‌ణానికి కార‌ణాలేంటి అడిగితే.. ఒక‌టా రెండా..! అలాగే ఇప్పుడు ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో టీడీపీపై వ్య‌తిరేక‌త పెర‌గ‌డానికి కూడా అంతే స్థాయిలో కార‌ణాలు ఉన్నాయ‌ట‌. ఈ సారి జిల్లాలో టీడీపీ స‌గం సీట్లు గెలుచుకుంటే గొప్పేనని పార్టీ నేతలే చెబుతున్నారు. దీనికి బలమైన కారణాలు ఉన్నాయట‌. పశ్చిమ గోదావరి జిల్లా ప్రధానంగా వ్యవసాయాధార ప్రాంతం. గత ఎన్నికల సమయంలో రైతు రుణమాఫీ హామీ ఇచ్చిన చంద్రబాబు ఈ హామీని పూర్తిగా అమలు చేయటంలో విఫలమయ్యార‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు.

మాట ఇచ్చి తప్పడంతో…..

ఎంత రుణం ఉంటే అంత రుణం మాఫీ చేస్తామని హామీ ఇచ్చి.. అధికారంలోకి వచ్చిన తర్వాత అడ్డగోలుగా కోతలు వేయటంతో తాము తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చిందని రైతులు ఆగ్ర‌హం వ్య‌క్తంచేస్తున్నారు. పైకి అంతా ప్రశాంతంగా ఉన్నా..ఎన్నికల సమయంలో వారు తమ కసి తీర్చుకోవటం ఖాయం అనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఇక డ్వాక్రా రుణాల మాఫీ విషయంలోనూ అదే తీరు. ఓ వైపు హామీల అమలు విషయంలోనూ వీరు తీవ్రంగా ఆగ్ర‌హంతో ఉన్నార‌ట‌. ఇక నాయకుల దందాలు, అరాచకాలు టీడీపీకి తీరని నష్టం చేయటం ఖాయం అని చెబుతున్నారు.

అడ్డగోలు దోపిడీ…..

దీనికి తోడు నిడదవోలు, కొవ్వూరు, ఆచంట, పోలవరం నియోజకవర్గాల్లో సాగుతున్న అడ్డగోలు ఇసుక దోపిడీ టీడీపీపై వ్యతిరేకతను పీక్ కు చేరింద‌ట‌. గతంలో అధికారంలో ఉన్న టీడీపీ నేతలు, మంత్రులు అయినా రాష్ట్ర స్థాయిలో ఏదైనా పనులు చేసి సంపాదించుకునే వారని, ఇంతలా జిల్లా, నియోజకవర్గాల్లో దోపిడీ ఎన్నడూలేదని చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న గెలుపు గ్యారంటీ జాబితాలో ఉండి, గోపాలపురం, దెందులూరు, తణుకు, ఉంగుటూరు నియోజకవర్గాలు ఉన్నాయి. ఇద్దరు మంత్రులు పితాని, జవహర్ కూడా ఎదురుగాలి తప్పదని..ఓ సర్వేలో తేలింద‌ట‌.

హోదా ఏమాత్రం ప్రభావం…?

ప్రస్తుత మంత్రులతోపాటు మాజీ మంత్రులు ఓటమి గండం తప్పేలాలేదనే సంకేతాలు వెలువడుతున్నాయి. నాలుగేళ్ల పాటు వదిలేసి.. ఇఫ్పుడు కొత్తగా చంద్రబాబు అందుకున్న `ప్రత్యేక హోదా` నినాదం పశ్చిమ గోదావరి జిల్లాపై ఏ మాత్రం ప్రభావం చూపించే అవకాశం కూడా కనిపించ‌డంలేద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. ఈ జిల్లాలో చంద్రబాబు సాగిస్తున్న మోడీ వ్యతిరేక, బీజేపీ వ్యతిరేక ప్రచారం ప్రభావం నామమాత్రంగా కూడా ఉండదని తేలింది. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాకతో కూడా ఉభయ గోదావరి జిల్లాల్లో రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయ‌ని అంచ‌నా వేస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*