అక్కడి నుంచే ఓట్ల వరద…..!

పోలవరం మా మానస పుత్రిక అంటుంది కాంగ్రెస్. మొత్తం డబ్బు ఇచ్చి కట్టిస్తుందే తామే అంటుంది బిజెపి. శరవేగంగా కట్టేది మేమే కదా అంటుంది టిడిపి. ప్రాజెక్ట్ పేరుతో అధికార టిడిపి మొత్తం తినేసిందని అంటున్నాయి వైసిపి, జనసేన పార్టీలు. రాష్ట్ర బిజెపి సైతం పోలవరం అవకతవకలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతుంది. ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయం మొత్తం ఈ ప్రాజెక్ట్ చుట్టే తిరగడం విశేషం. ప్రజలకు ఇది చేశామని చెప్పుకోవడానికి ఈ మెగా ప్రాజెక్ట్ మాత్రమే ప్రస్తుతం కనిపిస్తుంది. దాంతో వచ్చే ఎన్నికలే లక్ష్యంగా అన్ని పార్టీలు పోలవరం మీద ఫోకస్ గట్టిగా పెట్టాయి.

గడ్కరీ రంగంలోకి దిగాకా …

పోలవరం జాతీయ ప్రాజెక్ట్. ఇది పూర్తి అయితే దక్షిణభారతదేశంలో తాగు సాగునీటి సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నారు గడ్కరీ. పోలవరం నుంచి నాగార్జున సాగర్ కి అక్కడినుంచి సోమశిల ప్రాజెక్ట్ కి అక్కడినుంచి తమిళనాడుకు నీటిని అందించవచ్చని లెక్కశారు ఆయన. అందువల్ల తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నడుమ నీటి తగవులుకు పరిష్కారం దొరుకుతుందని అందుకే ప్రధాని మోడీ, తానూ సీరియస్ గా ఈ ప్రాజెక్ట్ ప్రగతిపై దృష్టి పెట్టినట్లు వెల్లడించారు కేంద్రమంత్రి. రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శల వర్షాన్ని విశాఖలో కురిపించారు గడ్కరీ. ప్రాజెక్ట్ ప్రాంతాన్ని సందర్శించడమే కాకుండా ఆయన పెద్దఎత్తున పోలవరం తమ గొప్పే అని చెప్పేందుకు సమావేశాలు మొదలు పెట్టేశారు.

డబ్బులు ఇవ్వరే అంటున్న చంద్రబాబు …

పోలవరం ప్రాజెక్ట్ వేగవంతంగా నిర్మిస్తూ ఉంటే కేంద్రం డబ్బులు మాత్రం ఆ స్థాయిలో ఇవ్వడం లేదని మండిపడుతున్నారు ఎపి సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో బిజెపి, వైసిపి నేతలు అభివృద్ధికి అడ్డుపడుతున్నారంటూ ఎప్పటిలాగే బాబు ఫైర్ అయ్యారు. నిధులు ఆలస్యం చేయొద్దని కేంద్రమంత్రిని కోరామని వెల్లడించారు ఆయన.

కమీషన్లకోసం కుస్తీ అంటున్న కాంగ్రెస్ …

పోలవరం ప్రాజెక్ట్ కాంగ్రెస్ మానస పుత్రిక అంటుంది ఆ పార్టీ. ఎపి పిసిసి చీఫ్ రఘువీరారెడ్డి కమీషన్ల కోసం చంద్రబాబు గడ్కరీ కొట్లాట మొదలు పెట్టారని తనదైన స్టయిల్ లో విరుచుకుపడ్డారు. అందుకే ప్రాజెక్ట్ పనులు నత్తనడకన నడుస్తున్నా ప్రజలను రెండు పార్టీలు తప్పుదోవ పట్టిస్తున్నాయన్నది కాంగ్రెస్ ఆరోపణ. ఇక వైసిపి, జనసేన సైతం ఇలాంటి ఆరోపణలతో హోరెత్తిస్తున్నాయి.

అందరి టార్గెట్ అదే …

కేంద్ర,రాష్ట్రప్రభుత్వాలు పోలవరం క్రెడిట్ కోసం ఎన్నికల ముందు కుస్తీ ప్రారంభించాయి. మరోపక్క అన్ని పార్టీలు నిర్మాణంలో నాణ్యత లేదంటూ భూసేకరణలో అంతా ఇంతా అవినీతి కాదంటూ విపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి అందరి టార్గెట్ ఇప్పుడు పోలవరం తమ ఘనతగా చెప్పుకుని ప్రజలముందుకు వెళ్ళడమే. మరి జనం ఎవరి మాటకు విలువ ఇస్తారో వచ్చే ఎన్నికల్లో తేలనుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*