11 తర్వాత జంపింగ్ లే జంపింగ్ లట…!!

telugudesam party-ysr congress party-andhrapradesh

రాజ‌కీయాల‌కు… సెంటిమెంటుకు చాలా ద‌గ్గ‌ర సంబంధం ఉంది. నేత‌లు గ‌తంలో ఎలా వ్య‌వ‌హ‌రించేవారో తెలియ‌దు కానీ.. ఇప్పుడు మాత్రం అంద‌రూ త‌మ త‌మ ఫేట్‌ను బాగానే చూసుకుని రాజ‌కీయాలు చేస్తున్నారు. నిజానికి ఇలాంటి సెంటిమెంటును ఎక్కువ‌గా న‌మ్మేది తెలంగాణ అధికార పార్టీ నాయ‌కుడు కేసీఆర్ అయినా.. ఇప్పుడు ఈ వాతావ‌ర‌ణం.. ఏపీలోకి చేరింద‌ని చెప్పుకొంటున్నారు. మ‌రో నాలుగు మాసాల్లోనే ఎన్నిక‌లు ఉన్న నేప‌థ్యంలో రాష్ట్రంలో అటు-ఇటు అని జంప్ చేయాల‌ని చూస్తున్న నాయ‌కులు పెరుగుతున్నారు. ఇలాంటి వారు అటు వైసీపీలోను, ఇటు టీడీపీలోనూ ఉన్నారు. మ‌రికొంద‌రు కాంగ్రెస్‌లో కూడా ఉన్నారు. ప్ర‌ధానంగా కాంగ్రెస్‌-టీడీపీల బంధాన్ని వ్య‌తిరేకిస్తున్న నాయ‌కులు పార్టీ మారేందుకు రెడీ అవుతున్నారు. వీరిలో కేవీపీ రామ‌చంద్ర‌రావు పేరు ఇటీవ‌ల కాలంలో బాగా వినిపిస్తోంది. అదేవిదంగా ఇప్ప‌టికే కాంగ్రెస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన వ‌ట్టి వ‌సంత కుమార్ కూడా పార్టీ మారేందుకు రెడీ అవుతున్నారు.

టీడీపీలోకి….

ఇక‌, ఎప్ప‌టి నుంచో టీడీపీలోకి చేర‌తార‌ని ప్ర‌చారంలో ఉన్న అన‌కాప‌ల్లి మాజీ ఎంపీ స‌బ్బం హ‌రి, ఉత్త‌రాంధ్ర‌కు చెందిన కొణ‌తాల రామ‌కృష్ణ‌, గుంటూరుకు చెందిన మ‌రో టీడీపీ నాయ‌కుడు.. ఇలా ప‌ది మంది వ‌ర‌కు కీల‌క నాయ‌కులు పార్టీలు మారాల‌ని నిర్ణ‌యించుకున్నారు. అయితే, ముందుగానే పార్టీలు మారాల‌ని అనుకున్న‌వారిలో ఇప్పుడే మారితే.. పార్టీ తాలూకు అజెండా మొత్తాన్ని ఆరు మాసాల‌కు ముందే భుజాన వేసుకోవ‌డం ఎందుక‌ని వెన‌క్కి త‌గ్గారు. దీంతో వెయింటింగే మంచిద‌ని భావించారు. ఇక‌, ఈ లోగా తెలంగాణా ఎన్నిక‌లు వ‌చ్చేశాయి. ఈ ఎన్నిక‌ల్లో వ‌చ్చే ఫ‌లితాల‌ను కూడా చూసి.. అప్పుడు ఓ నిర్ణ‌యానికి వ‌ద్దామ‌ని నిర్ణ‌యించు కున్నారు. మ‌హాకూట‌మిగా చంద్ర‌బాబు-రాహుల్ ద్వ‌యం తెలంగాణాలో పోటీకి దిగింది. ఆ రాష్ట్రంలో కేసీఆర్ కూడా బ‌లంగానే ప్ర‌చారం నిర్వ‌హించారు. అయితే, తెలంగాణాలో క‌నుక మ‌హాకూట‌మి విజ‌యం సాధిస్తే.. ఇక్క‌డ టీడీపీలోకి జంపింగులు పెరిగే ఛాన్స్ ఉంది.

వైసీపీ లోకి కూడా….

దీనికి ప్ర‌ధాన కార‌ణం.. సిట్టింగులకు అక్క‌డ కేసీఆర్ టికెట్లు ఇవ్వ‌డ‌మే. ఇది ఆయ‌నకు ఓట‌మిని తెచ్చింద‌నే నిర్ణ‌యానికి వ‌స్తారు. ఫ‌లితంగా ఏపీలోని సిట్టింగుల్లో తీవ్ర వ్య‌తిరేక‌త ఎదుర్కొంటున్న దాదాపు 40 మందిని చంద్ర‌బాబు మార్చే అవ‌కాశం ఉంటుంది. ఈ కార‌ణంగానే పార్టీలు మారాల‌ని చూస్తున్న వారు ఈ నెల 11 వ‌ర‌కు వెయిట్ చేయాల‌ని చూస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఈ నెల 11న తెలంగాణా ఎన్నిక‌ల లెక్కింపు, ఫ‌లితం వెంట వెంట‌నే రానున్నాయి. దీంతో ఎవ‌రు గెలుస్తారు? ఎవ‌రు ప్ర‌తిప‌క్షంలో కూర్చుంటారో తెలుస్తుంది. దీన్ని బ‌ట్టి ఏపీలో నిర్ణ‌యాలు ఉంటాయ‌ని చెబుతున్నారు. అదేస‌మ‌యంలో రాజ‌కీయ నేత‌ల సెంటిమెంట్ కూడా ఇక్క‌డే ప‌ని చేస్తోంది. ఈ నెల 11 వ‌ర‌కు తెలుగు పంచాంగం ప్రకారం గురుమూఢం జ‌రుగుతోంది. అంటే.. ఈ కాలంలో ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకున్నా .. కొత్త ప‌నులు చేసినా పెద్ద‌గా క‌లిసిరావ‌ని పండితులు చెబుతున్నారు. దీంతో నేత‌లు జంప్ చేసేందుకు 11 వ‌ర‌కు ఆగాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు స‌మాచారం. మొత్తంగా ఎలా చూసినా.. ఈ నెల 11 త‌ర్వాత రాష్ట్రంలో రాజ‌కీయాలు మారే ఛాన్స్ క‌నిపిస్తోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*