ఇక్కడ టీడీపీ గెలిచే ఒక్క సీటు ఏదీ?

నెల్లూరు జిల్లా రాజ‌కీయాల్లో కొద్ది కాలం నుంచి మంత్రి సోమిరెడ్డి పేరు విపరీతంగా వినిపిస్తోంది. మంత్రి ప‌ద‌వి చేప‌ట్ట‌క ముందు విప‌క్షాల‌పై దూకుడిగా వ్య‌వ‌హ‌రించిన ఆయ‌న‌.. ఇప్పుడు జిల్లా రాజ‌కీయాల‌ను త‌న చుట్టూ తిప్పుకునేలా చేస్తున్నారు. ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి ఇస్తే.. జిల్లాలో టీడీపీ బ‌లం పుంజుకుంటుంద‌ని అధినేత‌, సీఎం చంద్ర‌బాబు భావించారు. ఇప్పుడు ఆ ఆశ‌ల‌న్నీ అడియాశ‌లుగా మారిపోతున్నాయి. టీడీపీ మాత్రం దిక్కుతోచని స్థితిలో ప‌డిపోతోంది. టీడీపీ బ‌లం రెట్టింపు అవ‌డం సంగతి అటుంచితే.. ప్ర‌తిప‌క్ష వైసీపీ బ‌లం నానాటికీ పెరుగుతుండటం గ‌మ‌నార్హం. ప్ల‌స్ అవుతాడ‌నుకున్న మంత్రే.. మైన‌స్‌గా మార‌డంతో క్యాడ‌ర్ అయోమ‌యంలో ప‌డిపోయింది. ఇద్ద‌రు మంత్రులు జిల్లా నుంచి ఉన్నా.. ఎవ‌రికి వారే అన్న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తుండటంతో పార్టీ ప‌రిస్థితి చంద్ర‌బాబును క‌ల‌వ‌రానికి గురిచేస్తోంది. జిల్లా టీడీపీ నాయ‌కులు సోమిరెడ్డిపై ఆగ్ర‌హం వ్య‌క్తంచేస్తున్నారు.

క్యాడర్ లో అసహనం……

కీల‌కమైన ఎన్నిక‌ల స‌మ‌యంలో టీడీపీ నేత‌ల నిర్ణ‌యాలు పార్టీ క్యాడ‌ర్‌లో అయోమ‌యం క‌లిగిస్తున్నాయి. ముఖ్యంగా టీడీపీ వీక్‌గా ఉన్న జిల్లాల్లో.. ఆయా నేత‌ల త‌ప్పిదాల‌తో పార్టీ ప‌రిస్థితి దిగ‌జారిపోతోంది. జిల్లా రాజ‌కీయాల‌పై ప‌ట్టు లేని నాయ‌కుల‌కు పార్టీ అభ్య‌ర్థుల ఎంపిక బాధ్య‌తలు అప్ప‌గించ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారుతోంది. నెల్లూరు జిల్లాలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేసే అభ్య‌ర్థుల ఎంపిక బాధ్య‌త‌ల‌ను మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు రవిచంద్రయాదవ్‌కి అప్ప‌గించార‌నే ప్ర‌చారం జరుగుతోంది. ముఖ్యంగా మీడియా ప్రతినిధులకు ఆయా పేర్లను లీకులు ఇస్తూ.. అధిష్టానం దృష్టిలో ఈ పేర్లు ఉన్నాయని ప్రచారం చేస్తున్నారట. ప్ర‌స్తుతం నెల్లూరు జిల్లాలో టీడీపీ పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంద‌ని పార్టీ అధినేత చంద్రబాబు దృష్టికి వచ్చింది. మంత్రి సోమిరెడ్డి, రవిచంద్రయాదవ్ ఆయ‌న్ను పక్కదోవ పట్టిస్తున్నారని పార్టీ నేతలు దుయ్యబడుతున్నారు.

వారు వైసీపీలో వెళ్లేందుకు……

జిల్లాలో బలమైన మూడు కుటుంబాలను పార్టీలోకి తేవాల్సిన మంత్రి సోమిరెడ్డి, రవిచంద్రయాదవ్‌.. వారు వైసీపీలోకి వెళ్లేలా చేశార‌ని క్యాడర్ మండిప‌డుతోంది. ప్రజల్లో పట్టులేని నాయకులను, అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న వారికి, జీహుజార్‌ అంటూ తమ ముందు దండాలు పెట్టేవారికి వీరు అభ‌య‌మిస్తున్నార‌ని స్థానిక నాయ‌కులు ఆగ్ర‌హం వ్య‌క్తంచేస్తున్నారు. ఈ విష‌యం తెలిసిన చంద్ర‌బాబు మాత్రం న‌ష్ట నివార‌ణ చ‌ర్య‌లు ప్రారంభించారు. ఈ ప్రచారాన్ని నమ్మవద్దని.. సమయం వచ్చినప్పుడు తానే అభ్యర్థులను ఎంపిక చేస్తానని చెబుతున్నారట‌. మేకపాటి, ఆనం, నేదురుమల్లి కుటుంబాలను ధీటుగా ఎదుర్కొవాలంటే బలం లేని సోమిరెడ్డి వ‌ల్ల అవుతుందా అనే ప్ర‌శ్న వినిపిస్తోంది. గ‌తంలో ఇటువంటి విధానంలోనే దివంగత ఎన్టీఆర్‌ తన అభిమాని రమేష్‌ను ఎంపిక చేసి చేతులు కాల్చుకున్నారు. 2004లో చంద్రబాబు కూడా సోమిరెడ్డికి మంత్రి పదవి ఇచ్చి సింగిల్‌ సీటు కూడా దక్కని పరిస్థితికి తీసుకువచ్చారు.

ఇలాగైతే అంతే…….

ప్రస్తుతం పార్టీ పరిస్థితి దారుణంగా ఉందని, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి శిద్దా రాఘవరావు కానీ, పార్టీ నియమించిన పరిశీలకులు కూడా మంత్రి సోమిరెడ్డికి, రవిచంద్రకు వంతపాడుతున్నారే తప్ప.. అక్కడ ఉన్న యథార్థ పరిస్థితిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడం లేద‌ట‌. మంత్రి నారాయణ కూడా ఇప్పుడు ఈ వివాదాల్లో త‌ల దూర్చ‌కుండా.. త‌న ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా ఎక్క‌డి నుంచి పోటీచేస్తే గెలుస్తాన‌నే లెక్క‌లు వేసుకుంటున్నార‌ట‌. జిల్లాలో లక్షలాది మంది పార్టీ అభిమానులు ఉన్నారు. వారిని అనుకూలంగా మలచుకోవడం లో ఘోరంగా విఫలమైన సోమిరెడ్డిపై చంద్రబాబు ఆధారపడితే 1989, 2004ల పరిస్థితి పునారవృతం అయ్యే పరిస్థితి ఉందని నాయ‌కులు ఆందోళ‌న వ్య‌క్తంచేస్తున్నారు. ఇక జిల్లాలో గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ గెలిచిన మూడు సీట్లే కాకుండా టీడీపీ గ్యారెంటీగా గెలిచే సీటు ఏద‌ని అడిగితే స‌గ‌టు టీడీపీ అభిమానే ఒక్క నియోజ‌క‌వ‌ర్గం పేరు చెప్ప‌లేని ప‌రిస్థితి.