ఆ మంత్రిగారి భార్య వచ్చేస్తున్నారు…!

ప్రకాశం జిల్లా ద‌ర్శి నియోజ‌క‌వ‌ర్గం అత్యంత కీల‌క‌మైంది. ఇక్కడ నుంచి టీడీపీ త‌రఫున గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసి గెలిచిన వైశ్య సామాజిక వ‌ర్గానికి చెందిన శిద్దారాఘ‌రావు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. టీడీపీలో సీనియ‌ర్ నేత కావ‌డంతో చంద్ర బాబు ఆయ‌న‌కు సామాజిక స‌మీక‌ర‌ణ‌ల్లో భాగంగా మంత్రిగా కూడా ప్రమోట్ చేశారు. ఇక్క‌డ శిద్దాకు వంక పెట్టాలంటే.. కార‌ణాలు వెతుక్కునే ప‌ని చేప‌ట్టాల్సిందే. ఆయ‌న అలానే అభివృద్ధి చేస్తున్నారు. 2014 ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌ఫున ఇక్కడ పోటీచేసిన బాచేప‌ల్లి శివ‌ప్ర‌సాద్ రెడ్డిపై కేవ‌లం 1300 ఓట్ల పైచిలుకు తేడాతోనే గెలుపొందిన‌ప్ప‌టికీ.. చంద్ర‌బాబు.. శిద్దాకు ప్రాధాన్యం పెంచారు. దీనికి త‌గిన విధంగానే శిద్దా కూడా త‌న ప‌నితీరును చూపిస్తున్నారు. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ప్రధాన స‌మ‌స్య తాగునీరు. అదేవిధంగా ప్రధాన మౌలిక స‌దుపాయ‌మైన ర‌హ‌దారులు.

అభివృద్ధిపై దృష్టి పెట్టి…..

ఈ రెండు విష‌యాల్లోనూ ప‌ద‌విలోకి వ‌చ్చిన వెంట‌నే దృష్టి పెట్టిన మంత్రి శిద్దా.. వ‌డివ‌డిగా చ‌ర్యలు తీసుకున్నారు. లెక్కకు మిక్కిలిగా ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేసి.. ఉచితంగానే మిన‌ర‌ల్‌ వాట‌ర్‌ను ఆయ‌న పంపిణీ చేస్తున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో తాగునీటిపై ఎప్పటిక‌ప్పుడు నివేదిక‌లు తెప్పించుకుని చ‌ర్యలు చేప‌డుతున్నారు. ఇక‌, ప్రధాన రోడ్లకు కూడా మోక్షం క‌లిగించారు. దీంతో నియోజ‌క‌వ‌ర్గంలోని అన్ని ప్రధాన ర‌హ‌దారులు ఇప్పుడు అద్దంగా ఉన్నాయ‌నే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయితే, కిందిస్థాయి నేత‌ల‌తో ఆయ‌న‌కు ట‌చ్ త‌క్కువ‌గా ఉంద‌నే విమ‌ర్శలు మాత్రం వినిపిస్తున్నాయి.

దొనకొండ ఎఫెక్ట్…..

పార్టీ కార్యక్రమాల‌ను ప్రజ‌ల్లోకి తీసుకు వెళ్లడంలోను, కింది స్థాయి నేత‌ల‌కు అప్పాయింట్‌మెంట్ ఇవ్వడంలోనూ మంత్రి ఉత్సాహం చూపించ‌డం లేదు. అయితే, ఆయ‌న ఎన్నికల స‌మ‌యంలో ఇచ్చిన కొన్ని హామీలు మాత్రం అమ‌లు కావ‌డం లేదు. దొన‌కొండ రాజ‌ధానిగా వ‌స్తుంద‌ని ముందుగా భావించ‌డంతో ఇండ‌స్ట్రీయ‌లిస్టులు భారీ ఎత్తున ఇక్కడ స్థలాలు కొన‌డం, పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంద‌ని భావించారు. అయితే, రాజ‌ధాని ఇక్కడ రాక‌పోవ‌డంతో ప‌రిస్థితి తిర‌గ‌బ‌డింది. ఈ ప‌రిణామం ఒక్క‌టే శిద్దాకు మైన‌స్‌గా మారిపోయింది.

ఎంపీగా వెళ్లాలని…..

ఇదిలావుంటే, వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న న‌ర‌స‌రావుపేట ఎంపీ స్థానాన్ని ఆశిస్తున్నట్టు వార్తలు వ‌స్తున్నాయి. దీనికి చంద్రబాబు ఓకే అంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ద‌ర్శి నుంచి త‌న స‌తీమ‌ణి.. ల‌క్ష్మీపద్మావ‌తిని ఇక్కడ నుంచి బ‌రిలోకి దింపుతార‌నే ప్రచారం జ‌రుగుతోంది. అయితే శిద్ధా కోరిక ఎలా ఉన్నా న‌ర‌సారావుపేట టీడీపీ ఎంపీ సీటుకు గ‌ట్టి పోటీ ఉంది. ఈ క్రమంలోనే శిద్ధా కోరిక ఎంత వ‌ర‌కు తీరుతుంద‌న్నది చెప్పలేని ప‌రిస్థితి. ఇక నియోజ‌క‌వ‌ర్గంలోనూ, మంత్రి శాఖ‌లోనూ ఆయ‌న త‌న‌యుడు తండ్రి ప‌నుల్లో జోక్యం చేసుకుంటున్నార‌ని అంటున్నారు టీడీపీ నాయ‌కులు. ప్రతి ప‌నిలోనూ క‌మీష‌న్ ఏజెంట్‌గా మారిపోయాడ‌ని, ప‌నులు జ‌రుగుతున్నా.. అవినీతి పెరిగిపోతోంద‌ని అంటున్నారు. ద‌ర్శిలో గ‌త ఎన్నిక‌ల్లోనే చావుత‌ప్పి క‌న్నులొట్టబోయిన చందంగా గెలిచిన శిద్ధా ఇప్పుడు ఆయ‌న ఎంపీగా వెళ్లి, ఆయ‌న భార్యను ఇక్కడ పోటీ చేయించాల‌ని చూస్తే చంద్రబాబు అందుకు ఒప్పుకుంటారా ? అన్నది కూడా సందేహ‌మే. మ‌రి ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో శిద్ధా ఫ్యూచ‌ర్ ఏమిట‌న్నది తేలాల్సి ఉంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*