రాజీలేదు…రణమేనా?

కడప జిల్లాలో బద్వేలు రాజకీయం ఎవరికీ అంతుపట్టదు. అప్పటికప్పుడు అగ్రనేతలు వస్తే రాజీ పడిపోయామంటారు. వారు అటు వెళ్లగానే మళ్లీ విభేదాలు మొదలు. బద్వేలు అంటేనే తెలుగుదేశం పార్టీ అధినేతకు భయం పట్టుకుంటుంది. ఎప్పుడు ఎవరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న టెన్షన్ టీడీపీ అగ్రనేతల్లో ఉంది. ఎన్నిసార్లు స్వయంగా చంద్రబాబు క్లాసు పీకినా అక్కడ ఓకే అని చెప్పేసి, నియోజకవర్గానికి వచ్చేసరికి జట్లు పట్టుకోవడం ఆనవాయితీగా మారింది. ఇటీవల చంద్రబాబు కడప జిల్లా పర్యటనకు వస్తున్నారని తెలిసి నేతల మధ్య సయోధ్య కుదర్చాలని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేసిన ప్రయత్నం ఫలించినట్లే కన్పించినా…అది మూణ్ణాళ్ల ముచ్చటే అయిందంటున్నారు.

వీరారెడ్డి కంచుకోటగా మార్చి…..

కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలో ఒకప్పుడు బిజివేముల వీరారెడ్డి ప్రాతినిధ్యం వహించారు. ఆయన మంత్రిగాకూడా పనిచేశారు. అప్పట్లో టీడీపీకి వీరారెడ్డి పెద్దతలకాయగా వ్యవహరించేవారు. నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి బలమైన క్యాడర్ ఉంది. ఓటు బ్యాంకు పుష్కలంగా ఉంది. వీరారెడ్డి మరణించడంతో ఆయన కూతురు విజయమ్మ రాజకీయాల్లోకి వచ్చారు. 2001లో జరిగిన ఉప ఎన్నికల్లో విజయమ్మ కాంగ్రెస్ నేత శివరామకృష్ణారావును ఓడించారు. నాటి నుంచి విజయమ్మ బద్వేలులో టీడీపీని ఒంటిచేత్తో నడిపించుకుంటూ వస్తున్నారు.

ఎస్సీ రిజర్వడ్ కావడంతో……

అయితే 2004లో జరిగిన ఎన్నికల్లో విజయమ్మ ఓడిపోయినా నియోజకవర్గ ఇన్ ఛార్జిగా వ్యవహరిస్తూ తన పట్టును నియోజకవర్గంలో కోల్పోకుండా కాపాడుకోగలిగారు. అయితే విజయమ్మ అదృష్టం బాగాలేదేమో…. 2009లో ఆ నియోజకవర్గం ఎస్సీలకు రిజర్వ్ అయింది. దీంతో విజయమ్మ ఇక్కడ పోటీ చేసే అవకాశం లేదు. అయినా నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థులుగా విజయమ్మ సూచించిన వారికే అధిష్టానం సీటు ఇచ్చినా 2009, 2014 ఎన్నికల్లో టీడీపీకి ఇక్కడ పరాజయమే ఎదురయింది. 2014 ఎన్నికల్లో విజయమ్మ బలపర్చిన విజయజ్యోతి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. పులివెందుల మున్సిపల్ కమిషనర్ గా పనిచేసిన జయరాములును ఇక్కడ అభ్యర్థిగా వైసీపీ రంగంలోకి దించింది. దీంతో గత ఎన్నికల్లో వైసీపీనే విజయం వరించింది. సహజంగా పోటీ చేసి ఓడిపోయిన వారికి ఇన్ ఛార్జి పదవి ఇస్తారు. కానీ ఇక్కడ విచిత్రంగా విజయమ్మకు పార్టీ అధిష్టానం ఇన్ ఛార్జిగా నియమించింది.

తమకే టిక్కెట్ అంటూ……

కాని చంద్రబాబు ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా జయరాములు వైసీపీ గుర్తు మీద గెలిచినా టీడీపీలో చేరిపోయారు. అప్పటి నుంచి విజయమ్మ పెత్తనానికి గండిపడుతూ వస్తోంది. పార్టీలో చేరే సందర్భంగా చంద్రబాబు తనకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఇస్తామని హామీ ఇచ్చారని జయరాములు చెబుతున్నారు. మరోవైపు గత ఎన్నికల్లో ఓటమిపాలయిన విజయజ్యోతి కూడా తనకే టిక్కెట్ అని ప్రచారం చేసుకుంటోంది. విజయజ్యోతి కూడా విజయమ్మను వదలి తనకంటూ సొంత గ్రూపును ఏర్పాటు చేసుకుని ప్రజల్లోకి వెళుతున్నారు. ఈపరిస్థితుల్లో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విజయమ్మ, జయరాములు మధ్య సయోధ్య కుదిర్చినట్లు కథనాలు వచ్చాయి. కాని వాస్తవంగా అక్కడ ఆ పరిస్థితి లేదంటున్నారు. అలాగే విజయజ్యోతి కూడా తనకు టిక్కెట్ రాకుంటే తన దారి తాను చూసుకుంటానని హెచ్చరిస్తున్నారు. మొత్తం మీద బద్వేలు నియోజకవర్గ పరిణామాలు టీడీపీ అధిష్టానాన్ని కలవరపెడుతున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*