టీడీపీలో డేట్ ఫీవర్….!!

ఏపీలో తెలుగుతమ్ముళ్లకు తెలంగాణ ఎన్నికల టెన్షన్ పట్టుకుంది. తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీతోపొత్తు పెట్టుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇప్పటి వరకూ తెలంగాణ ఎన్నికల ప్రచారానికి వెళ్లలేదు. హిందూపురం ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణ మాత్రం ఖమ్మం జిల్లా పర్యటనకు వెళ్లి వచ్చారు.తెలంగాణలో ప్రజాకూటమిని ఏర్పాటు చేసి అక్కడ తెలంగాణ రాష్ట్ర సమితిని మట్టి కరిపించాలని చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారు.కేసీఆర్ ను ఓడించగలిగితే అది కాంగ్రెస్ పార్టీకన్నా ఎక్కువ పేరు చంద్రబాబుకు వస్తుందన్నది తెలుగుతమ్ముళ్ల నమ్మకం. అందుకే డిసెంబరు 11వ తేదీ కోసం టెన్షన్ గా ఎదురు చూస్తున్నారు.

కూటమి గెలిచిందంటే….?

తెలంగాణలో మహాకూటమి గెలిచిందంటే ఆ ప్రభావం ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉంటుందని తెలుగుదేశం పార్టీ నేతలు విశ్వసిస్తున్నారు. తెలంగాణ ఎన్నికలు జరిగిన ఆరు నెలల్లోపే ఏపీ ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ ఎన్నికలలో మహాకూటమి గెలిస్తే చంద్రబాబు సమర్థత, నాయకత్వంపై ఏపీ ప్రజల్లో నమ్మకం పెరుగుతుందంటున్నారు. రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ కంటే రాష్ట్రాన్ని కొట్లాడి తెచ్చుకున్న కె.చంద్రశేఖర్ రావుపైనే ఏపీ ప్రజలకు ఎక్కువగా కోపం ఉందని పసుపు పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. కేసీఆర్ చంద్రబాబుపై చేస్తున్న విమర్శలు కూడా తమకు కలసి వస్తాయని అంటున్నారు.

అందుకే సీరియస్ గా…..

అందుకే చంద్రబాబు తెలంగాణ ఎన్నికలను సీరియస్ గా తీసుకుంటున్నారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలోనూ రాహుల్ గాంధీతో కలసి ప్రచారంలో పాల్గొంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు ఖమ్మం, హైదరాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో కూడా చంద్రబాబు ప్రచారం నిర్వహించే అవకాశముందని అంటున్నారు. తెలంగాణలో కేవలం 14 స్థానాలు దక్కినా మహాకూటమి అధికారంలోకి వస్తే రెండు రాష్ట్రాల విభజన సమస్యలను సులువుగా పరిష్కరించుకోవచ్చని ఏపీ ఎన్నికల్లో ప్రధాన అజెండాగా చంద్రబాబు మార్చనున్నారు.

ఓటమి పాలయినా…..

అయితే పొరపాటున మహాకూటమి ఓటమి పాలయితే మాత్రం ఆ తప్పును కాంగ్రెస్ పైకి నెట్టేసేందుకు కూడా తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది. సరైన అభ్యర్థులను ఖరారు చేయకపోవడం వల్లనే ఓటమి పాలయ్యారని ఏపీలో ప్రజలకు వివరించే అవకాశముంది. ఇలా చంద్రబాబు ద్విముఖ వ్యూహంతోనే ముందుకు వెళుతున్నారు. తాను రాష్ట్ర ప్రయోజనాల కోసం పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రితోనే విభేదాలు పెట్టుకున్నానని చెప్పుకోగలిగే అవకాశం ఉంటుంది. మొత్తం మీద డిసెంబరు 11 జ్వరం ఏపీ తెలుగుతమ్ముళ్లకు పట్టుకుందనే చెప్పాలి. ఎన్నికల ప్రచారానికి ఇప్పటికే ఏపీలోని టీడీపీ శ్రేణులు రంగంలోకి దింపారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*