క్యాడర్ సెగలు గక్కుతోంది…ఎందుకంటే… !!

telugudesamparty cadre in angry

విశాఖ జిల్లా టీడీపీకి కంచుకోట అన్నది అందరికీ తెలిసిందే. పదేళ్ళ పాటు పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా కూడా మొక్కవోని దీక్షతో కార్యకర్తలు పార్టీకోసం పనిచేస్తూ వచ్చారు. ఎలాగైనా పసుపు జెండా ఎగరాలన్న వారి కసి, కృషి కలసి టీడీపీని 2014 ఎన్నికల్లో అధికారంలోకి తీసుకువచ్చింది. అయితే చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చాక మాత్రం కార్యకర్తలకు రిక్త హస్తమే చూపించారు. ఎటువంటి నామినేటెడ్ పదవులు ఇవ్వకుండా పుణ్యకాలమంతా సాగదీశారు. ఇపుడు మళ్లీ ఎన్నికలు వస్తున్నాయి. కార్యకర్తలు మాత్రం నిండా నైరాశ్యంలో ఉన్నారు.

పదిహేనేళ్ల పాటు…

పార్టీ అధికారంలోకి రాక పదేళ్ళు, వచ్చి అయిదేళ్ళు పదవులు లేక అల్లాడుతున్నామని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో అధికారంలోకి వస్తే తమకు కూడా ఏదో విధంగా ప్రయోజనం సమకూరుతుందని భావించిన కార్యకర్తలకు ఏదీ అందకుండానే మరో మారు ఎన్నికలు వచ్చేస్తున్నాయి. ఏపీలో అన్ని జిల్లాలకు ఏదో ఒక పదవిని ఇచ్చిన అధినాయకత్వం విశాఖ జిల్లాకు మాత్రం మొండి చేయి చూపించింది. దానికి కారణం ఇక్కడ ఉన్న ఇద్దరు మంత్రుల మధ్యన సఖ్యత లేకపోవడం. పార్టీలో వర్గాలు, గ్రూపుల కారణంగా పదవులు అందకుండా పోయాయని కేడర్లో వేదన వ్యక్తమవుతోంది.

కీలక పదవులు ఖాళీ….

ఉత్తరాంధ్రలో సుప్రసిద్ధ సింహాచల క్షేత్రం పాలకవర్గంతో పాటు, విశాఖ నగరాభివ్రుధ్ధి సంస్థ పాలకవర్గం, జిల్లా గ్రంధాలయ చైర్మన్ తో పాటు, అనేక కీలకమైన పదవులు భర్తీ కాకుండా పోయాయి. అదే విధంగా దాదాపు ఏడేళ్ళుగా జీవీఎంసీకి ఎన్నికలు నిర్వహించలేదు. దాంతో కార్పోరేటర్లు అవుద్దామనుకున్న వారికి కూడా నిరాశే మిగిలింది. ఇక జిల్లాలో అధికారాలు అన్ని ఎంపీ, ఎమ్మెల్యేలే దక్కించుకుని దర్జా వెలగబెడుతున్నారన్న ఆక్రోశం క్యాడర్లో నిండా గూడు కట్టుకుని ఉంది. ఎన్నికల్లో మాత్రం జెండా మోసేది తామైతే అందలాలు ఎక్కదే మాత్రం పెద్దలని తమ్ముళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈసారి ప్రతిష్టాత్మకంగా జరిగే ఎన్నికల్లో క్యాడర్ ఎంతమేరకు పనిచేస్తారన్నది ఇపుడు నాయకుల్లో కలవరం రేకెత్తిస్తోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*