లోకేష్ కే ఠికాణా లేకుంటే…!!

telugudesamparty-in-visakhapatnam-district

విశాఖ జిల్లా టీడీపీకి కంచుకోట అటువంటి చోట అంతా చిందర వందర చేసుకుంటోంది తెలుగుదేశం. ఎపుడు కూడా ఓ పద్ధతి ప్రకారం అభ్యర్ధుల ఎంపికలు పూర్తి చేసే టీడీపీ ఈసారి మాత్రం ఆది నుంచి తప్పటడుగులే వేస్తూ వచ్చింది. అందులో మొదటిది లోకెష్ భీమిలీ నుంచి పోటీ అంటూ ప్రచారం చేయడం. గత వారం రోజులుగా తెగ హడావుడి చేసిన లోకేష్ రాజకీయ తుపాను మొత్తానికి విశాఖ సాగర తీరం దాటేసరికి టీడీపీ పరువు కూడా బాగానే పోయింది. దీనికి సంబంధించి టీడీపీ చేసిన అతి ఎన్నికల వేళ ఆ పార్టీ క్యాడర్లో అయోమయం, కొత్త సందేహాలకు కూడా ఆస్కారం ఇచ్చినట్లైంది.

అటూ ఇటూ..

నిజానికి విశాఖ అర్బన్ జిల్లా భీమిలీ నుంచి లోకేష్ పోటీ అన్నారు. అక్కడ టీడీపీకి ఎదురులేదని చినబాబు కూడా విజయఢంకా మోగిస్తారని టీడీపీ నేతలు ఊదరగొట్టారు. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖ ఎంపీగా పోటీ చేస్తారని చెప్పుకొచ్చారు. విశాఖ ఎంపీ సీటుకు ఆశపడిన దివంగత మాజీ ఎంపీ ఎంవీవీఎస్ మూర్తి మనవడు శ్రీభరత్ కి పెద్ద ఝలక్ ఇచ్చారు. మరో వైపు గంటాను విశాఖ ఎంపీ అభ్యర్ధి అంటూనే అనకాపల్లి, చోడవరం ఎమ్మెల్యే సీట్లలో కూడా పోటీకి ఆప్షన్ ఇచ్చామని చెప్పుకొచ్చారు. దీంతో పార్టీలో పెద్ద గందరగోళమే ఏర్పడింది. గంటా అయితే ఓ దశలో అసలు ఎక్కడా పోటీ చేయనని చెప్పేశారని టాక్. మరో వైపు విశాఖ ఉత్తరం నుంచి లోకెష్ పోటీ అన్నారు. దాంతో అక్కడ టీడీపీ ఆశావహులంతా గగ్గోలు పెట్టారు. ఇలా విలువైన నాలుగు రోజుల సమయాన్ని టీడీపీ పెద్దలు వేస్ట్ చేసిన మీదట లోకేష్ విశాఖ నుంచి పోటీ చేయరంటూ చావు కబురు చల్లగా చెప్పారు. దాంతో ఆ ఎపిసోడ్ ముగిసినా పార్టీకి జరగాల్సిన నష్టం మాత్రం బాగానే జరిగిపోయింది.

ఓటమి భయమేనా…?

టీడీపీకి భావి నాయకుడు, చంద్రబాబు తరువాత వారసుడు అలాంటిది లోకెష్ విశాఖ వచ్చినా గెలిచే అవకాశాలు లేవని ప్రచారం కావడం ఇపుడు టీడీపీ ఆత్మ స్థైర్యాన్ని గట్టిగా దెబ్బ తీసే విషయమే. కంచుకోట లాంటి భీమిలీలో కూడా లోకేష్ గెలవలేరన్న నిజం కూడా ఈ సందర్భంగా టీడీపీ తనకు తానుగా లోకానికి చెప్పేసుకున్నట్లైంది. టీడీపీ హై కమాండ్ కే ఠికాణా లేని విశాఖలో మిగిలిన వారు ఎలా గెలుస్తారన్న డౌట్లు కూడా అపుడే ఏర్పడిపోయాయి. దీన్ని ఆయుధంగా మలచుకుని వైసీపీ ఇపుడు తన ప్రచారాన్ని కదం తొక్కిస్తే టీడీపీకి దారుణమైన నష్టమే జరుగుతుంది. అసలు లోకేష్ ఎందుకు భీమిలీ కోరారు, మరెందుకు వెళ్ళిపోయారు అన్నది ఇపుడు టీడీపీలోనే హాట్ టాపిక్ అయింది. ఏది ఎలా ఉన్నా చక్కగా ఉన్న పార్టీని గందరగోళం చేసిన ఘనత‌ మాత్రం అచ్చంగా హై కమాండ్ దే. అదే సమయంలో విపక్షానికి అస్త్రాలు ఇచ్చి మరీ తమ ఓటమి గుట్టు బయటేసుకుంది కూడా పసుపు పార్టీయే. మరి దీనికి జనాల రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.

Ravi Batchali
About Ravi Batchali 15248 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*