అక్కడ టీడీపీకి వణుకు..వైసీపీదే గెలుపా…?

విశాఖ జిల్లా ఏజెన్సీ తెలుగుదేశం పార్టీలో వణుకు మొదలైంది. గత నెల ఆ పార్టీకి చెందిన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుని, మాజీ ఎమ్మెల్యే శివేరి సోమను అతి దారుణంగా మావోయిస్టులు చంపేశారు. ఆ తరువాత మరో పన్నెండు మందిపై టార్గెట్ పెట్టినట్లుగా ప్రచారం సాగుతోంది. తాజాగా మావోయిస్ట్ పార్టీ గాలికొండ ఏరియా కార్యదర్శి గోపి పేరు మీద ఒక లేఖ విడుదలైంది. గిరిజన ద్రోహులైన టీడీపీ నేతలను తరిమికొట్టాలని ఆ లేఖలో గోపి పిలుపు ఇవ్వడం విశేషం.

మంత్రితో సహా టీడీపీ తమ్ముళ్ళు…..

మావోయిస్టులు ఏజెన్సీలో అక్రమ క్వారీలకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. అలాగే అక్రమ మైనింగునకు కూడా వారు ఎదురు నిలుచుంటున్నారు. కానీ అనధికారికంగా ఏజెన్సీలో మైనింగ్ జరుగుతోందని మావోయిస్టులు అంటున్నారు అలా గిరిజనం పచ్చని పొలాలలో చిచ్చు రేపుతున్న వారిపై మండిపడుతున్నారు. మంత్రి అయ్యన్నపాత్రుడు మాజీ మంత్రి మణికుమారి, పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ వంటి వారు అక్రమ మైనింగ్ లకు కొమ్ము కాస్తున్నారని మావోయిస్టులు ఆరోపిస్తున్నారు. ఈ వైఖరి మార్చుకోని వారిపైన కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరిస్తున్నారు.

వణుకుతున్న తమ్ముళ్ళు…..

ఏకంగా చంద్రబాబు పైన కూడా మావోలు పదునైన కామెంట్లే చేస్తున్నారు. బాక్సైట్ తవ్వకాలు లేవంటూ గిరిజనులను మభ్య పెడుతున్నారని విమర్శిస్తున్నారు. మొత్తం టీడీపీ పైనే మావోలు కత్తి కట్టినట్లుగా కనిపిస్తోంది. ఏజెన్సీలో తిరగాలంటేనే భయపడుతున్నారు. ఇప్పటికే మంత్రి అయ్యన్నపాత్రుడు, పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిలకు భద్రత పెంచారు. బుల్లెట్ ప్రూఫ్ వాహనం కూడా సమకూర్చారు. రేపటి రోజున ఎన్నికల్లో ప్రచారం చేయడం మాత్రం కష్టమేనని అంటున్నారు.

రాజకీయంగా ఎదురీత…..

ఏజెన్సీలో టీడీపీ రాజకీయంగా ఎదురీత ఈదుతోంది. అక్కడ ఆ పార్టీ గత ఎన్నికల్లో పాడేరు, అరకు అసెంబ్లీ సీట్లతో పాటు, అరకు ఎంపీ సీటు కూడా కోల్పోయింది. ఈ మూడు చోట్లా వైసీపీ నుంచి గెలిచిన వారిని ఫిరాయించి తమ వైపు తిప్పుకుంది. గిరిజనులు అక్కడ వైసీపీని గెలిపిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా టీడీపీకి ఇక్కడ ఇబ్బందులు తప్పవన్న మాట గట్టిగా వినిపిస్తోంది. అసలు పోటీ చేసేందుకు కూడా క్యాండిడేట్లు ఈ టైంలో వస్తారా అన్న సందేహాలూ కలుగుతున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*