ఏపీ అధోగతేనా…??

telugudesamparty-ysrcongresspary-andharapradesh

ఎన్నికల పండగ వస్తే చాలు నాయకులకు పూనకం వస్తుంది. గతంలో ఓట్ల కొనుగోలుకు పార్టీలు డబ్బులు పంచిపెట్టే సంప్రదాయం ఉండేది. పదిహేనేళ్ల క్రితం వంద రూపాయలు ఇచ్చి పేదలనుంచి పార్టీలు ఓట్లను కొనేవి. మగాళ్లకైతే మందుబాటిళ్లు సరఫరాచేసి ఆ మత్తులోనే ప్రజాస్వామ్యాన్ని ఖరీదు చేసేవారు. 2014 ఎన్నికల నాటికి ఓటు ఖరీదు రెండువేలకు చేరుకుంది. తాజాగా అధికారంలో ఉన్న పార్టీలు కొత్త పద్ధతిని కనిపెట్టాయి. తమ పార్టీలు ఓట్లు కొంటే సరిపోవడం లేదు. ఎదుటి పార్టీ కూడా డబ్బులు పంచుతోంది. అందులోనూ ప్రభుత్వ వ్యతిరేకత పనిచేస్తుంది. అందుకే సర్కారీ సొమ్మును పథకాల రూపంలో దుర్వినియోగం చేయడం మొదలు పెట్టారు. అధికారం శాశ్వతంగా తమ వద్దనే ఉండాలంటే ఏదో రకంగా ప్రజలపై వలవేయడానికి పూనుకుంటున్నారు. దీనికి సంక్షేమం పేరు పెడుతున్నారు. ఎన్నికలకు అయిదారు నెలలముందు కొత్త స్కీములను రంగంలోకి తెస్తున్నారు. తెలంగాణ దీనికి మార్గదర్శకంగా నిలిచింది. ఆంధ్రప్రదేశ్ ఆ బాటలోనే నడుస్తోంది. ఎన్నికలంటే డబ్బుల పండుగగా మార్చేస్తున్నారు.

హస్తం అరాచకం…

రాహుల్ గాంధీ ‘న్యాయ్’ పేరిట అమల్లోకి తెస్తామంటూ ఇచ్చిన కనీస ఆదాయ హామీ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. ఇప్పటికే ఆ పార్టీ రైతు రుణమాఫీని హామీగా ప్రసాదించింది. ఇప్పుడు కనీస ఆదాయపథకాన్ని ప్రస్తావిస్తూ 25 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరుస్తామని ఘనంగా ప్రకటన చేశారు. ఒక్కో కుటుంబానికి ఏడాదికి 72 వేల రూపాయలు వచ్చేలా చూస్తామంటున్నారు. మూడు లక్షల అరవై వేల కోట్ల రూపాయల వరకూ దీనికి కేటాయించాల్సి వస్తుందనేది అంచనా. స్థూలజాతీయోత్పత్తిలో రెండుశాతం నిధులు ఇందుకు అవసరమవుతాయి. మరో రెండు శాతం రుణమాఫీ పద్దుకింద చెల్లిపోతుంది. ప్రస్తుతం దేశంలో 27 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ అమలవుతోంది. కేంద్రానికి సమకూరే ఆదాయంలో 42 శాతం రాష్ట్రాలకు వాటా ఇచ్చేయాలి. రక్షణ, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు, ప్రభుత్వ నిర్వహణ, అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు ఎక్కడ్నుంచి తెస్తారంటే సమాధానం దొరకదు. ఆర్థిక సంక్షోభానికి దారితీసేలా ఎన్నికల ప్రణాళికను రచించడం పై ఆర్థికవేత్తలు తీవ్ర విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. దేశంలో దీర్ఘకాలం పరిపాలన చేసిన పార్టీకి కనీసం దేశ ఆర్థిక వ్యవస్థపై అవగాహన లేదా? అనే విమర్శలు ఎదురవుతున్నాయి. అధికారంలో కొనసాగడమే లక్ష్యంగా కమలం పార్టీ కూడా ప్రణాళికను వండి వారిస్తే వారికే మరిన్ని చాన్సులు పెరుగుతాయి.

పోటాపోటీ…

ఆంధ్రప్రదేశ్ లో పోటీ సంగతి చెప్పనక్కర్లేదు. టీడీపీ, వైసీపీలు ఇస్తున్న హామీలు మొత్తం దేశంలోని బడ్జెట్ అంతటినీ తెచ్చిపెట్టేస్తామన్నంత ఘనంగా కనిపిస్తున్నాయి. రాష్ట్రం కొత్తగా ఏర్పడింది. మౌలికవసతుల రంగంపై పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాల్సి ఉంది. అప్పుడే పరిశ్రమలు, విద్యాసంస్థలు వస్తాయి. వ్యవసాయ,వ్యాపార,సేవా రంగాలు పెరుగుతాయి. ఉపాధి అవకాశాలు విస్తరిస్తాయి. తద్వారా ఆర్థిక రంగం, స్థూల రాష్ట్రోత్పత్తి పెరుగుతుంది. దార్శనికత కలిగిన నేతలు ఎవరైనా ఈదిశలోనే యోచన చేస్తారు. కానీ రాష్ట్రంలో అధికారయావ తప్ప పార్టీలకు మరేమీకనిపించడం లేదు. 2014 ఎన్నికలకు ముందు ఇచ్చిన రైతు రుణమాఫీ హామీని ఇంకా పూర్తిచేయలేదు. నిధుల కొరతతో ప్రభుత్వం అల్లాడిపోతోంది. పసుపు,కుంకుమ, పింఛన్ల మొత్తం పెంపుదల, అన్నదాత సుఖీభవ వంటి పేరులతో మరో 20వేల కోట్ల రూపాయల కొత్త ఖర్చును ఖజానాపై మోపింది తెలుగుదేశం ప్రభుత్వం. ఇదంతా అప్పు చేసిన సొమ్మే. అభివ్రుద్ధి కార్యక్రమాలకు వినియోగించాల్సిన నిధుల మొత్తాన్ని మళ్లించివేశారు. ప్రభుత్వ బాండ్లను వేలం వేసి రుణాలు తెచ్చి మరీ ఎన్నికల తాయిలాలకు వినియోగించేశారు. పోస్టు డేటెడ్ చెక్కులతో ప్రజాస్వామ్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. అటువైపు ప్రతిపక్షమూ తక్కువేమీ తినలేదు . నవరత్నాల పేరిట ఇచ్చిన హామీల విలువ పదిలక్షల కోట్ల రూపాయల పైచిలుకు ఉంటుందని అంచనా. నిధుల సమీకరణ ఎలా అన్న ప్రశ్నకు వైసీపీ వద్ద జవాబు లేదు. 2014 ఎన్నికలకు వెళ్లేటప్పుడు రుణమాఫీపై ఆలోచించి సాధ్యం కాదని పక్కనపెట్టిన వైసీపీ ఇప్పుడు అటువంటి విచక్షణను విస్మరించి హామీలు గుప్పిస్తోంది.

ఎదురుచూపులు…

ఇచ్చిన హామీలు, వాగ్దానాలు సరిపోవని ఏపీలోని రెండు ప్రధానపార్టీలు ఆలోచిస్తున్నట్లున్నాయి. ఎన్నికల ప్రణాళికలను ప్రకటించకుండా ఎదురుచూస్తున్నాయి. ఎదుటిపార్టీ ప్రకటించిన తర్వాత దానిని బేరీజువేసుకుని మరిన్ని హామీలతో మేనిఫెస్టో ప్రకటించాలనే యోచనతో ఉన్నాయి. తమ పార్టీ విధానాలు, ప్రజావిశ్వాసంపై పార్టీలే నమ్మకాన్ని కోల్పోయాయి. అందుకే ప్రత్యర్థి పార్టీ అధికారిక ప్రకటనపై ఆధారపడి తాము ముందడుగు వేయాలనుకుంటున్నాయి. ఇంతకుమించిన దివాళాకోరుతనం మరొకటి ఉండదని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. అన్నిపార్టీలు మూస ప్రణాళికనే వాగ్దానం చేస్తున్నాయి. అందరివీ అవే పథకాలు. ఎక్కడ ప్లస్ మార్కులు కొట్టేస్తారో, వారికి ఎక్కువ ఓట్లు వచ్చేస్తాయో అన్న భయం ప్రధాన పార్టీలను వేధిస్తోంది. ఆంధ్రప్రదేశ్ విజన్ తో ముందడుగు వేయాల్సిన తరుణంలో రానున్న రెండు తరాలు ఆర్థికసంక్షోభంలో కూరుకుపోయేలా రెండు పార్టీల ముందస్తు హామీలు కనిపిస్తున్నాయి. రెండు వేల రూపాయల పింఛను ఇప్పటికే మూడువేలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. 45,50 ఏళ్ల మధ్యవయసు నుంచే పించన్లు ఇచ్చేస్తామంటున్నారు. ఇవన్నీ దార్శనికత కలిగిన నాయకత్వ లక్షణాలు కాదని నిర్ద్వంద్వంగానే చెప్పవచ్చు. వీటినిబట్టి చూస్తే.. ఓటర్లలో సామాజిక, రాజకీయ చైతన్యం ఏర్పడకపోతే ఏపీ భవిష్యత్తు అథోగతే అన్న వాదనలకు బలం చేకూరుతోంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Ravi Batchali
About Ravi Batchali 17221 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*