టీజీ హర్ట్ అయ్యారు…ఏం చేయబోతున్నారు?

కర్నూలు సిటీ సీటుపై టీజీ వెంకటేశ్ ఆశలు ఇక గల్లంతేనా? ఇప్పుడు టీజీ వెంకటేశ్ ఏం చేయబోతున్నారు. అధిష్టానాన్నే నిలదీయనున్నారా? అవును. టీజీ వెంకటేశ్ ఇప్పుడు అలకబూనారు. నిన్న మంత్రి నారా లోకేష్ చేసిన కామెంట్స్ తో టీజీ హర్ట్ అయ్యారని చెబుతున్నారు.కర్నూలు ఎమ్మెల్యే టిక్కెట్ పై టీజీ వెంకటేశ్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తన కుమారుడు టీజీ భరత్ ను ఎమ్మెల్యేగా చేయాలన్నది ఆయన ఆశ. అందుకోసం గత మూడేళ్లుగా గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. రాజ్యసభ సభ్యుడిగా తనకు వచ్చే నిధులను ఎక్కువగా కర్నూలు నియోజకవర్గంలోనే వెచ్చిస్తున్నారు. అంతేకాదు వివిధ సేవా కార్యక్రమాల ద్వారా తన కుమారుడు టీజీ భరత్ ను ఇప్పటికే ప్రజలకు పరిచయం చేశారు.

అలకబూని……

టీజీ భరత్ కూడా తనకే టిక్కెట్ వస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. ఆయన ఎక్కువగా లోకేష్ పైనే నమ్మకం పెట్టుకున్నారు. లోకేష్ పార్టీలో కీలకంగా మారడంతో యువనాయకత్వాన్ని ప్రోత్సహిస్తారని చెప్పి ఆయనకు దగ్గరయ్యే ప్రయత్నంచేశారు. అయితే హటాత్తుగా లోకేష్ కర్నూలు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎస్వీ మోహన్ రెడ్డిని ప్రకటించడంతో టీజీ ఫ్యామిలీ హతాశులయ్యారు. లోకేష్ వ్యాఖ్యలను వారు జీర్ణించుకోలేకపోతున్నారు. లోకేష్ ఆ ప్రకటన చేసిన తర్వాత జరిగిన ప్రభుత్వ వైద్యశాలలోని గైనిక్ విభాగం ప్రారంభోత్సవ కార్యక్రమానికి టీజీ దూరంగా ఉండటం కూడా చర్చనీయాంశంగా మారింది. ఇంతేకాకుండా మీడియాతో టీజీ చేసిన వ్యాఖ్యలు కొంత రాజకీయంగా టీడీపీని ఇబ్బంది పెట్టేవిగానే ఉన్నాయి.

ఆశ్చర్యపోయిన టీజీ….

తెలుగుదేశం పార్టీలో అభ్యర్థులను ముందుగానే ప్రకటించడం చరిత్రలో ఇదే తొలిసారి అని టీజీ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాత్రం తనతో సర్వేచేసిన తర్వాతే టిక్కెట్లు కేటాయిస్తామని చెప్పారని, కాని లోకేష్ మాత్రం అభ్యర్థులను ప్రకటించారని, ఇది తమకు అర్థం కాని విషయమని టీజీ వెంకటేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. లోకేష్ ప్రకటన ఎందుకు చేశారో? అధిష్టానమే సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు. టీజీ అనుచరులు కూడా లోకేష్ ప్రకటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన కాన్వాయ్ ను అడ్డుకునే ప్రయత్నం కూడా చేశారు. కానీ టీజీ వారించి వారిని పంపించి వేశారు.

బాబుతో భేటీ తర్వాత…..

ఇక టీజీ వెంకటేశ్ వ్యాఖ్యలను బట్టి ఆయన పార్టీ అధినేత చంద్రబాబుతో ముఖాముఖి భేటీ కావాలని నిర్ణయించుకున్నారని చెబుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ పర్యటన నుంచి వచ్చిన అనంతరం ఆయనను కలసి తాడో పేడో తేల్చుకునేందుకు టీజీ సిద్ధమయినట్లు చెబుతున్నారు. గెలుపు గుర్రాలకే టిక్కెట్లు ఇవ్వాలని, సర్వేలు చేయించి ఎవరికి అనుకూలంగా ఫలితాలొస్తే వారికి టిక్కెట్ ఇస్తే తమకు అభ్యంతరం లేదని టీజీ వెంకటేశ్ వర్గీయులు చెబుతున్నారు. ఏకపక్షంగా ప్రకటించడంపైనే తమ అభ్యంతరం అంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబును కలిసిన తర్వాత కార్యాచరణ ప్రకటించేందుకు టీజీ సిద్ధమవుతున్నట్లు తెలిసింది. కర్నూలు జిల్లాలో నెలకొన్న రాజకీయ పరిణామాలను బట్టి చూస్తే టిక్కెట్ దక్కకుంటే ఒకరికొకరు కలసి పనిచేసే పరిస్థితి మాత్రం కన్పించడం లేదు.

Ravi Batchali
About Ravi Batchali 17093 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*