స్వామి రంగంలోకి దిగిపోయారే….!

ప్రపంచ ప్రసిద్ధ తిరుమలేశుని ఆలయ నిర్వహణ వివాదాల సుడిలో తిరుగుతుంది. భగవంతుడి ఆభరణాలు మాయం, ఆలయ ఆచార సంప్రదాయాలకు మంగళం పడుతున్నారన్న విమర్శలు జాతీయ స్థాయిలో ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. ఆలయ ప్రధాన అర్చకులుగా పనిచేసిన రమణ దీక్షితులు మొదలు పెట్టిన ఆరోపణలు విమర్శలు వాటికి టిటిడి బోర్డు సమాధానాలు ప్రత్యారోపణలు, విమర్శలు ఇలా సాగిపోతుంది. ఈ నేపథ్యంలో దేశంలోనే మోస్ట్ లిటిగెంట్ గా గుర్తింపు వున్న సుబ్రమణ్య స్వామి రంగంలోకి దిగారు. తిరుపతి పవిత్రత కాపాడటానికి తక్షణం సిబిఐ విచారణ జరపాలంటూ సుప్రీం గుమ్మం తొక్కేందుకు స్వామి సిద్ధం కావడం సంచలనమే అయ్యింది. శ్రీనివాసుని సన్నిధి ని కాపాడటానికి తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్వామి చేసిన ట్వీట్ కలకలం గా మారింది.

మేం వస్తే సెట్ చేస్తాం అన్న జగన్ …

తాము అధికారంలోకి వస్తే తిరుమల పవిత్రతను కాపాడతామని వివాదం మొదలు అయిన వెంటనే వైసిపి అధినేత జగన్ హామీ ఇచ్చారు. 65 ఏళ్ళు దాటిన అర్చకులను తొలగించే ప్రక్రియ తీసివేస్తామని రమణదీక్షితులను తిరిగి నియమిస్తామని జగన్ తెలిపారు. తిరుమలలో భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా టిడిపి తన అధికారాన్ని వినియోగిస్తుందని జగన్ సీరియస్ అయ్యారు.

పవన్ సైతం …

జనసేనాని పవన్ కళ్యాణ్ తిరుమల తిరుపతి దేవస్థానం పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సామాన్యుల భక్తులకు ఒకలా ధనవంతులకు మరోలా వ్యవహారం సాగుతుందని గళమెత్తారు. శ్రీనివాసుని ఆస్తులకు రక్షణ ఎక్కడంటూ ప్రశ్నించారు. గతంలో ముంబయి కి చెందిన భక్తులు స్వామికి ఇచ్చిన ఆస్తులు కబ్జాకు గురయినట్లు తన దృష్టికి వచ్చింది. ఇలా అనేకం ఉన్నాయని దీనికి సమాధానం చెప్పాలిసిన వారు దేవస్థానం వారు కాదని సాక్షాత్తు ముఖ్యమంత్రే అని డిమాండ్ చేశారు.

ఐవైఆర్ సీన్ లోకి …

తిరుమల ఆలయ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులను తిరిగి నియమించాలని బ్రాహ్మణ ఐక్య సంఘటన వేదిక ద్వారా మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణ రావు డిమాండ్ చేశారు. స్వామి ఆభరణాలలో అవకతవకలు ఇతర అంశాలపై పూర్తి విచారణ జరగాలని కోరుతున్నారు. తమ డిమాండ్ల సాధన కోసం భారీ బహిరంగ సభ ఇతర పోరాటాలు చేసేందుకు ఐవైఆర్ సిద్ధం కావడం విశేషం.

ఎన్టీఆర్ తరువాత నేనే అంటున్న బాబు …

“తమ్ముళ్లు తిరుమల పవిత్రతను కాపాడటం ఎవరు చేశారు.? గతంలో ఎన్టీఆర్ ఇప్పుడు నేను”. అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు తుఫాన్ లా వస్తున్న విమర్శలు తిప్పి కొట్టే ప్రయత్నం చేశారు. రాజకీయ లబ్ది కోసమే విపక్షాలు ఈ రాద్ధాంతం చేస్తున్నాయని గోవిందుడి ఆభరణాల వివరాలు ఈవో వెల్లడించినప్పటికీ వివాదం చేస్తున్నారని బాబు పేర్కొన్నారు. మొత్తానికి టిటిడిలో అల్లరి కి సీఎం సమాధానం చెప్పుకునే పరిస్థితి ఏర్పడటం ఈ వ్యవహారం తీవ్రతకు అద్దం పడుతుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*