ఆ పక్కనుంటావా… వెంకన్న? ఈ పక్కనుంటావా?..

‘దేవుడు చేసిన మనుషుల్లారా, మనుషులు చేసిన దేవుళ్లారా..వినండి మనుషుల లీల.. కనండి దేవుడి గోల..’అంటూ ఎప్పుడో నాలుగు దశాబ్దాల పూర్వం నాటి పాట. అదే ఇప్పుడు తిరుమల క్షేత్రంలో నిజమై నిరూపిస్తోంది. ఎంతో గొప్ప ఆచారాలను ,ఆధ్యాత్మికతను స్వార్థపరులు అవకాశంగా మలచుకుని దేవుడితోనే రాజకీయం చేస్తున్నారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకునిగా భక్తజన నీరాజనాలందుకునే వెంకటేశ్వరునికి అష్టకష్టాలు తప్పడం లేదు. సర్కారు, స్వామి సేవకులు, రాజకీయ నేతలు కలగలిసి ఆదిమధ్యాంతరహితుడిని అడ్డంగా బుక్ చేస్తున్నారు. రోడ్డుమీదకు లాగుతున్నారు. ఆభరణాలు మొదలు సేవల వరకూ వివాదాస్పదం చేస్తున్నారు. కొండమీది దేవుడు ఒక పరపతికి సింబల్ గా, సెంటిమెంటుకు లేబుల్ గా వాడేసుకుంటున్నారు. వీరి చర్యలు నిజమైన భక్తులు నివ్వెర పోయేలా విస్తుగొలుపుతున్నాయి . ఉన్నావా? అసలున్నావా? ఉంటే కళ్లు మూసుకున్నావా?అంటూ ఆవేదనతో, ఆర్తితో , ఆక్రోశంతో రగిలిపోవాల్సిన అనివార్యతను కల్పిస్తున్నారు. రచ్చరచ్చ చేస్తూ దేవునికే రాజకీయ రంగు పులిమేస్తున్నారు. ఆ పక్కనుంటావా వెంకన్న? ఈ పక్కనుంటావా? అంటూ ఆనందనిలయునిపైనే ప్రశ్నలు సంధిస్తున్నారు.

రాజకీయ పంగనామాలు…

కాదేదీ రాజకీయాలకు అనర్హం అంటే ఇదే. ప్రశాంతత, మనశ్శాంతి పొందేందుకు కోట్లాది భక్తులు దైవ దర్శనంతో పరవశించి పోతుంటారు. కానీ కలియుగ వైకుంఠంలో వీవీఐపీలు, వీఐపీలకే అదనపు దర్శనాలు, అద్భుత ప్రసాద వితరణలు సాగుతుంటాయి. ఇక్కడ పదవి ఉన్నవాడు, పైరవీ చేసుకోగలిగినవాడికి లభించే సదుపాయాలు, సౌకర్యాలు వేరు. కాటేజీల కేటాయింపు మొదలు సుప్రభాత దర్శనాల వరకూ అన్నిటా వారిదే పైమాట. అధికారంలో ఉన్నవారిదే చెల్లుబాట. ఆధ్యాత్మిక భావాలతో సంబంధం లేకుండా ధర్మకర్తల మండలిని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చేశాయి సర్కారులు. వీఐపీల కోసం దేవుని దర్శనవేళలు, సేవల మార్పుల వంటివన్నీ సాగిపోతుంటాయి. మంత్రి పదవులకు ప్రత్యామ్నాయంగా, అవసరాలకు ఉపయోగపడతారని భావించినా ట్రస్టు బోర్డు సభ్యత్వాలు ఇవ్వడమనే ఆనవాయితీని ప్రభుత్వాలు పాటిస్తున్నాయి. దేవుని పేరిట రాజకీయ వాదులను సంతృప్తి పరుస్తున్నారు. దీంతో ప్రభుత్వ కనుసన్నల్లోనే వెంకటేశ్వరుని దైనందిన సేవలన్నీ కొనసాగుతుండటం ఒక విచిత్రమైన పరిస్థితి.

వృత్తి..ప్రవృత్తి వ్యత్యాసం…

రమణదీక్షితుల వివాదం, స్వామి ఆభరణాలు మాయం, పోటులో తవ్వకాలు వంటివన్నీ ఇప్పుడు సంచలనం కలిగిస్తున్నాయి. మాజీ ప్రధానార్చకుడే అనుమానాలు రేకెత్తించడం ప్రశ్నలకు ప్రధాన కారణమవుతోంది. ఆయన బీజేపీతో సన్నిహితంగా మెలగడంతో రాజకీయమూ చోటు చేసుకుంటోంది. అర్చకత్వం అంటే ఉద్యోగం కాదు, స్వామి వారికి భక్తి ప్రపత్తులతో తన కాలం,తన దేహం సమర్పించుకునే ఆత్మనివేదనం. దానిని మరిచిపోయి వీఐపీలకు ప్రత్యేకాశీర్వచనాలు, అతిథి గృహాల వద్దకు వెళ్లి పూజలు చేయడం వంటి కార్యకలాపాలకు దిగజారిపోయారు కొందరు అర్చకులు. దేవస్థానం కొలువులో అన్యమతస్థులూ వచ్చి చేరిపోయారు. ఉద్యోగం వెంకన్నవద్ద ప్రార్థనలు పరప్రభువుల చెంత అన్నట్లుంది తంతు. నిజానికి అన్యమతస్థులకు ఇక్కడ ఉద్యోగాలివ్వకూడదని నియమాలున్నాయి. కానీ పాటించేవారు కరవు అయ్యారు. భక్తజన విశ్వాసాలు, ఆస్తికత, విరాళాలతో కొన సాగుతున్న టీటీడీ ఉద్యోగాల్లో వేరే వాళ్లను నియమించడంలోనూ రాజకీయానిదే పాపం. అధికారంలో ఉన్నవాళ్లకు ఓట్ల రాజకీయమే. చిత్తశుద్ధి కరవు. అందుకే ఇటువంటి వాటిని కట్టడి చేయడంలోనూ వైఫల్యాలు కనిపిస్తాయి. వృత్తి, ప్రవృత్తిల మధ్య వ్యత్యాసం దేవుని పట్ల సర్కారు వారికి, అర్చకులకు గల అంకితభావాన్ని బట్టబయలు చేస్తోంది.

పరపతి మొక్కులవాడు…

నిజానికి పురాణాలు, ఇతిహాసాలు తరచి చూస్తే అర్థమయ్యే విషయం ఒకటే. భక్తి తప్ప సంపద అనేది దేవునికి పట్టదు. గజేంద్రుడు ఒక జంతువు. అయినా తనభక్తుడని వైకుంఠాన్ని వదిలి వచ్చి రక్షిస్తాడు. కుచేలుడు కడుపేద. అక్కున చేర్చుకుంటాడు. రారాజు దుర్యోధనునివైపు చూడకుండా తనకు ఇష్టుడైనందుకే తొలిచూపు అర్జునుని వైపు ప్రసరిస్తాడు శ్రీక్రుష్ణుడు. ఇన్ని ఉదంతాలు ఎదురుగా కనిపిస్తున్నప్పటికీ కలియుగంలో మాత్రం సామాన్యభక్తులను పక్కనపెట్టేశారు. కిలోమీటర్ల కొద్దీ కాలినడకన తిరుమల చేరే భక్తులు ఈనాటికీ వేల సంఖ్యలో ఉన్నారు. వారికంటే వీఐపీలకే స్వామిదర్శనంలో పరపతి. అంతవరకూ బాగానే ఉంది. వెంకటేశ్వరుని తాజాగా కోర్టు మెట్లు ఎక్కించేశారు. ఆలయంలో ఆభరణాలు మాయమయ్యాయన్న వివాదం రాజకీయం కావడంతో న్యాయవిచారణ జరపమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైకోర్టు కు లేఖ రాశారు. కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థలు, నిఘా సంస్థలను వదిలేసి న్యాయస్థానం జోక్యం కోరడం దివాళాకోరుతనం అనే విమర్శలు వినవస్తున్నాయి. రాష్ట్రప్రభుత్వాన్ని బోనులోకి లాగాలని దేవస్థానం విషయంలో సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని ఒక ప్రయివేటు వ్యక్తి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీని వెనక ఒక రాజకీయ పార్టీ హస్తం ఉందనేది ప్రధాన ఆరోపణ. హతవిధీ అనుకుని వెంకటేశ్వరుడు తిరుమలనే కాదు, అసలు ఈలోకాన్నే విడిచిపెట్టి పారిపోయేలా చేసేట్లున్నారు ఈ అపరభక్తులు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*