ఎవరిని దింపాలి….?

tiruvaroor-constiuency-key-role-in-tamil-politics

తిరువారూర్ నియోజకవర్గ ఉప ఎన్నిక డీఎంకేకు ప్రతిష్టాత్మకం కానుంది. తండ్రి కరుణానిధి మరణించిన తర్వాత జరిగే తొలి ఎన్నిక కావడంతో స్టాలిన్ కు వ్యక్తిగతంగా కూడా కీలక ఎన్నికే అని చెప్పాలి. కరుణానిధి ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం కావడం, డీఎంకే సిట్టింగ్ స్థానం కావడంతో ఈ ఎన్నిక ఫలితాలే డీఎంకే, స్టాలిన్ భవిష్యత్తును నిర్దేశిస్తాయని చెప్పాల్సిన పనిలేదు. అందుకోసం ఈ ఎన్నికను ఆషామాషీగా తీసుకోకూడదని భావించిన డీఎంకే ఈ ఎన్నికపై కసరత్తులు ప్రారంభించింది.

స్టాలిన్ పోటీ చేయాలంటూ….

తిరువారూర్ లో ఎవరిని పోటీకి దింపాలన్న దానిపై స్టాలిన్ మేధోమదనం చేస్తున్నారు. డీఎంకే నుంచి స్టాలిన్ పోటీ చేస్తే బాగుంటుందని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. ఈ మేరకు స్టాలిన్ పై వత్తిడి కూడా తెస్తున్నారు. కరుణానిధి ప్రాతినిధ్యం వహించడంతో అక్కడి నుంచి స్టాలిన్ ఉంటే బాగుంటుందన్న సూచన పార్టీ నేతల్లో అధికశాతం మంది వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటికే స్టాలిన్ వేరే నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉండటంతో ఆయన దీనిపై సీనియర్ నేతలతో చర్చలు జరుపుతున్నారు.

ఉదయనిధి కోసం….

తన కుమారుడు ఉదయనిధిని బరిలోకి దింపాలన్న యోచనలో స్టాలిన్ ఉన్నట్లు తెలుస్తోంది. తన వారసుడిగా ఉదయనిధిని రాజకీయ అరంగేట్రం చేయించడానికి ఇది మంచి అవకాశంగా స్టాలిన్ భావిస్తున్నారు. ఇటు కుటుంబంలోనూ అటు పార్టీలోనూ పట్టు నిలుపుకునే ప్రయత్నంలో స్టాలిన్ ఉన్నారు. తన సోదరుడు ఆళగిరి వ్యవహారం కూడా ఈ ఎన్నికతో తేలిపోతుందని స్టాలిన్ భావిస్తున్నారు. అందుకోసమే ఈ ఎన్నికల్లో గెలుపు ధ్యేయంగా ఆయన పావులు కదుపుతున్నారు.

అన్నాడీఎంకే, దినకరన్ కూడా….

మరోవైపు అన్నాడీఎంకే, దినకరన్ పార్టీలు కూడా తిరువారూర్ ఎన్నికలో గెలిచి తమ సత్తా చాటాలనుకుంటోంది. పళని స్వామి, పన్నీర్ సెల్వంలు కూడా ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గెలవలేని చోట గెలిస్తేనే తమ నాయకత్వం నిలబడుతుందని భావిస్తున్న పళని, పన్నీర్ లు అభ్యర్థి ఎంపికపై తలమునకలై ఉన్నారు. అయితే స్టాలిన్ మాత్రం ఈ ఎన్నికల్లోనూ కూటమితో వెళ్లే అవకాశముందంటున్నారు. మరి ఒక ఉప ఎన్నిక తమిళనాడు రాజకీయ చరిత్రను మార్చివేస్తుందంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*