దాసూ… నీకు ఛాన్స్ లేదయ్యా….?

కృష్ణా జిల్లాలో పశ్చిమ కృష్ణాలో ఖమ్మం – పశ్చిమగోదావరి జిల్లాలకు సరిహద్దుగా విస్తరించి ఉన్న నియోజకవర్గం తిరువూరు. ఎస్సీ రిజర్వ్‌డ్‌ నియోజకవర్గం అయిన తిరువూరులో తిరువూరు నగర పంచాయ‌తి, తిరువూరు, ఏ.కొండూరు, విస్సన్నపేట, గంపలగూడెం మండలాలు విస్తరించి ఉన్నాయి. సామాజిక సమీకరణల పరంగా చూస్తే నియోజకవర్గంలో టీడీపీలో కమ్మ సామాజికవర్గం గతంలో కాంగ్రెస్‌, ఇప్పుడు వైసీపీలో రెడ్డి సామాజికవర్గం ప్ర‌ధాన‌ పాత్ర పోషిస్తున్నాయి. తిరువూరు, ఏ.కొండూరు, విస్సన్నపేట మండలాల్లో వైసీపీలో రెడ్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో టీడీపీలో కమ్మ సామాజికవర్గానిదే కీ రోల్‌. ప్రస్తుతం ఇక్కడ నుంచి వైసీపీ తరపున కొక్కిలిగడ్డ రక్షణనిధి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

స్వామిదాసుపై విజయం సాధించి……

గతంలో ప‌మిడిముక్క‌ల జెట్పీటీసిగా పని చేసిన రక్షణనిధి గత ఎన్నికల్లో తిరువూరు నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి నల్లగడ్ల స్వామిదాసుపై విజయం సాధించారు. నాలుగున్నర ఏళ్లలో అభివృద్ధి పరంగా చూస్తే ఎమ్మెల్యే ప్రతిపక్షంలో ఉండడంతో నియోజకవర్గ ప్రజలకు చేసింది ఏమి లేదు. స్థానిక సమస్యలు పట్ల సంపూర్ణ అవగాహన ఉన్నా గతంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధిగా పని చెయ్యడంతో ఆ అనుభవం సమస్యలను గుర్తించేందుకే పనికివస్తుందే తప్ప సమస్యల పరిష్కారంలో ఆయన పూర్తిగా చొరవ చూపలేకపోతున్నారు. నియోజకవర్గంలో టీడీపీ సంస్థాగతంగా, ప్రజాప్రతినిధుల పరంగా బలంగా ఉండడంతో వారిదే ఆధిపత్యం. ఏపీలో నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఉన్న స్వామిదాసు, మంత్రి దేవినేని ఉమ సైతం తిరువూరుపై ప్రత్యేక దృష్టి సారించడంతో ఇక్కడ సిట్టింగ్‌ ఎమ్మెల్యే విపక్షంలో ఉండడంతో నామ‌మాత్రంగా మారారు.

ఇద్దరికీ టిక్కెట్లు రావా…?

విచిత్రం ఏంటంటే వచ్చే ఎన్నికల్లో ఇటు వైసీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యేకు అటు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌గా ఉన్న స్వామిదాసుకు టిక్కెట్లు రావడం సందేహమే అన్న చర్చ జరుగుతుంది. ఎమ్మెల్యే రక్షణనిధి సంగతి ఎలా ఉన్నా ఇప్పటికే గత మూడు ఎన్నికల్లోనూ వరుసగా ఓడిపోతూ పార్టీకి నియోజకవర్గంలో మైనెస్‌గా మారిన స్వామిదాసుకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్‌ ఇవ్వకూడదని అధిష్టానం దాదాపుగా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 2004, 2009, 2014 ఎన్నికల్లో వరుసగా హ్యాట్రిక్‌ ఓటమిలు చవిచూసిన స్వామిదాసు గత రెండు ఎన్నికల్లోనూ నిర్లక్ష్య‌పూరిత వైఖ‌రితో స్వల్ప తేడాతో ఓడిపోవాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే ఆయన్ను పక్కన పెట్టి అక్కడ పార్టీలో శ్రేణులను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లేలా బలమైన అభ్యర్థి కోసం అన్వేషణ జరుగుతుంది.

జనసేన నామమాత్రమే…..

ఇప్పటికే టీడీపీ అధిష్టానం పరిశీలనలో రెండు, మూడు పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఇందులో ఆర్టీసీ చైర్మ‌న్‌ వర్ల రామయ్య సైతం ఉన్నారు, మరో ఒకరిద్దరు ప్రభుత్వ అధికారులు సైతం టీడీపీ టిక్కెట్‌ రేసులో ఉన్నారు. ఇక రక్షణనిధి విషయానికి వస్తే ఆయన సొంత నియోజకవర్గం పామర్రు కూడా రిజర్వ్‌డ్‌ నియోజకవర్గం కావడంతో రక్షణనిధిని అక్కడకు మార్చవచ్చు అన్న ప్రచారం కూడా జరుగుతుంది. అలాగే తిరువూరులో మరో అభ్యర్థిని ఎంపిక చేసే ఛాన్స్‌ ఉందని కూడా అంటున్నారు. ఇక కొత్తగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న జనసేన విషయానికి వస్తే జనసేన ప్రభావం నియోజకవర్గంలో శూన్యం. వచ్చే ఎన్నికల్లో తిరువూరు వేదికగా వైసీపీ, టీడీపీ మధ్య‌ రసవత్తర పోరు ఖాయం. టీడీపీ అభ్యర్థిని మారిస్తేనే ఇక్కడ గట్టి పోటీ ఇస్తుందే తప్పా మళ్ళీ స్వామిదాసును కొనసాగిస్తే గత మూడు ఎన్నికల్లో వస్తున్న ఫలితం మరే ఛాన్స్ లేద‌ని కూడా రాజ‌కీయ వ‌ర్గాల అంచ‌నా.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*