బ‌ళ్లారి బాబు ఎవరు?

మ‌రో ప‌ది రోజుల్లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న క‌ర్ణాట‌క‌లో అత్యంత కీల‌క‌మైన ప్రాంతం, ముఖ్యంగా మైనింగ్ కింగ్ గాలి జ‌నార్ద‌న రెడ్డికి మంచి ప‌ట్టున్న బ‌ళ్లారి న‌గ‌ర నియోజ‌క‌వ‌ర్గంపై అంచ‌నాలు రోజుకు రోజుకు పెరుగుతున్నాయి. గాలి ఫ్యామిలీ ఎంట్రీతో దేశ రాజ‌కీయాల్లోనే బ‌ళ్లారి ఎంతో కీల‌క‌మైన ప్రాంతంగా పేరు తెచ్చుకుంది. బ‌ళ్లారి జిల్లా కేంద్రంగా చుట్టు ప‌క్క‌ల ఉన్న నియోజ‌క‌వ‌ర్గాలు ఎక్కువగా ఎస్టీ రిజ‌ర్వ్‌డ్ కేట‌గిరిలో ఉంటే బ‌ళ్లారి సిటీ మాత్రం జ‌న‌ర‌ల్ కేట‌గిరిలో ఉంది. ఇక్క‌డ అభ్య‌ర్థులు ఎంత మంది త‌ల‌ప‌డుతున్నార‌నే విష‌యం క‌న్నా.. ప్ర‌ధాన పార్టీల అభ్య‌ర్థుల‌దే హ‌వా క‌నిపిస్తోంది. దీంతో ఇక్క‌డ త్రిము ఖ పోటీ నెల‌కొంది. కాంగ్రెస్, బీజేపీ అభ్య‌ర్థులు నువ్వా నేనా! అనే రేంజ్‌లో త‌ల‌ప‌డుతుండ‌గా.. దేవెగౌడ నేతృత్వం లోని జేడీఎస్ కూడా కీల‌క‌మైన అభ్య‌ర్థినే రంగంలోకి దింపింది.

ఆర్థికంగా ముగ్గురూ….

దీంతో ఇక్క‌డ పోటీ నువ్వా నేనా అనే రేంజ్‌ను మించి సాగుతోంది. కాంగ్రెస్ త‌ర‌ఫున సిట్టింగ్ ఎమ్మెల్యే అనిల్ లాడ్, బీజేపీ త‌ర‌ఫున గాలి జ‌నార్ద‌న రెడ్డి సోద‌రుడు, మాజీ ఎమ్మెల్యే గాలి సోమ‌శేఖ‌ర రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక‌,వీరిద్ద‌రికీ పోటీ ఇస్తున్న జీడీ ఎస్ అభ్య‌ర్థి మ‌హ‌మ్మ‌ద్ ఇక్బాల్ కూడా దీటుగా త‌ల‌ప‌డుతున్నారు. వీరిలో గాలి సోమ‌శేఖ‌ర్‌రెడ్డి మాజీ మంత్రి అయితే అనిల్ లాడ్ మాజీ రాజ్య‌స‌భ స‌భ్యుడు కావ‌డం విశేషం. ఇక‌, ఈ ముగ్గురు బ‌లాబ‌లాల‌ను విశ్లేషిస్తే.. ఆర్థికంగా ఈ ముగ్గురూ కూడా చాలా సంప‌న్నులే కావ‌డం గ‌మ‌నార్హం. దీంతో ఓట‌ర్ల‌ను త‌మ వైపు తిప్పుకొనేందుకు వీరు త‌మ త‌మ వ్యూహాల్లో ముందుకు సాగుతున్నారు.

కులాల వారీ అంచ‌నాలు ఇవే…

అయితే, ఇదే స‌మ‌యంలో ఇక్క‌డ కులాల వారీగా కూడా ఓట్ల ప‌రిస్థితి ఇప్పుడు తెర‌మీదికి వ‌స్తోంది. ఏయే సామాజిక వ‌ర్గం ఎవ‌రి వైపు? ఏయే సామాజిక వ‌ర్గానికి ఎన్ని ఓట్లు ఉన్నాయి? వారి ఆలోచ‌న ఎలా ఉంది? వారు ఎవ‌రికి ఓటేస్తారు? వ‌ంటి కీల‌క అంశాలు తెర‌మీదికి వ‌చ్చాయి. కాంగ్రెస్ అభ్య‌ర్థి అనిల్ వినూత్నంగా ప్ర‌చారం చేస్తున్నారు. తాను సాఫ్ట్ అని, గాలి సోమ‌శేఖ‌ర‌రెడ్డి కి ఓట్లేస్తే.. ఆయ‌న గెలిస్తే.. న‌గ‌రంలో రౌడీ యిజం పెరుగుతుంద‌ని ఆయ‌న ప్ర‌చారం చేస్తున్నారు. ఇక‌, త‌న‌కు ఎలాంటి అల‌వాట్లూ లేవ‌ని, తాను గెలిస్తే.. మ‌రింత మంచి ప‌నులు చేసేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని వివ‌రిస్తున్నాడు.

గాలి మాటేంటంటే…?

ఇక‌, గాలి విష‌యానికి వ‌స్తే.. చేతికి ఎముక లేకుండా డ‌బ్బు పంచుతున్నార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఇక‌, హామీల ప‌రం గా చూస్తే.. బీజేపీ ఉంటేనే అబివృద్ధి సాధ్య‌మ‌ని వివ‌రిస్తున్నాడు. బ‌ళ్లారిలో ఇంత అభివృద్ధి జ‌రిగింది అంటే అదంతా బీజేపీ పాల‌న‌లోనే అని బీజేపీ చెప్పుకుంటోంది. ఇక‌, జేడీఎస్ అభ్య‌ర్థి కూడా ఈ ఇద్ద‌రికీ వ్య‌తిరేకంగా కామెంట్లు చేస్తున్నాడు. అంతా బాగానే ఉంది. వాస్త‌వంగా చూస్తే బ‌ళ్లారి స్వాతంత్య్రం వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి కాంగ్రెస్‌కు కంచుకోట‌. గ‌తంలో ఇక్క‌డ ఎంపీగా సుష్మాస్వ‌రాజ్‌, సోనియాగాంధీ కూడా పోటీప‌డ్డారు. అప్పుడు సోనియా 50 వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు.

కులాల లెక్కలివే….

స్వాతంత్య్రం వచ్చాక ఇక్క‌డ 1994లో మాత్ర‌మే బీజేపీ ఎంపీ సీటును గెలుచుకుంది. త‌ర్వాత ఈ ఎంపీ సీటు పున‌ర్విభ‌జ‌న‌లో ఎస్టీల‌కు రిజ‌ర్వ్ అయ్యింది. గాలి సోద‌రుల ఎంట్రీతో ఇక్క‌డ బీజేపీ స్ట్రాంగ్ అయ్యింది. బ‌ళ్లారి జిల్లాతో పాటు చుట్టుప‌క్క‌ల ప్రాంతాల‌ను బీజేపీకి కంచుకోట‌లుగా మార్చేశారు. అయితే, ఇక్క‌డ రెండు ప్ర‌ధాన సామాజిక వ‌ర్గాలు అభ్య‌ర్థ‌లు త‌ల‌రాత‌లు నిర్ణ‌యిస్తాయ‌ని స‌మాచారం. ప్ర‌ధానంగా లింగాయ‌త్‌లు, ముస్లింలు ఇక్క‌డ డిసైడింగ్ ఫ్యాక్ట‌ర్లుగా ఉండ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, ఈ నియోజ‌క‌వ‌ర్గంలో మొత్తం 2,33,260 ఓట్లు ఉన్నాయి. వీటిలో లింగాయ‌త్‌-41000, క‌మ్మ‌-21, 000, రెడ్డు-23,000, బ‌లిజ‌లు 20000, ఎస్సీలు 24000, ఎస్టీలు 25000, కురుబ‌లు-24000, ముస్లింలు-41000, ఇత‌రులు-14,260 మంది ఉన్నారు. వీరిలో ముఖ్య‌మైన లింగాయ‌త్‌లు, ముస్లింలు ఎటు మొగ్గితే.. వారినే విజ‌యం వ‌రిస్తుంది. మ‌రి ఎవ‌రు గెలుస్తారో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*