టీఆర్ఎస్ మ‌రో త‌ప్ప‌ట‌డుగేనా..!

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి, సంప‌త్‌కుమార్‌ శాస‌న స‌భ్య‌త్వం ర‌ద్దు చెల్ల‌దంటూ హైకోర్టు తీర్పుపై ఎట్ట‌కేల‌కు అధికార టీఆర్ఎస్ మౌనం వీడింది. అనేక త‌ర్జ‌న‌భ‌ర్జ‌న‌ల త‌ర్వాత 12మంది ఎమ్మెల్యేల‌తో హైకోర్టు తీర్పు అమ‌లును నిలిపివేయాల‌ని అప్పీల్ చేయించింది. అయితే ఇక్క‌డే విష‌య‌మేమిటంటే… ప్ర‌త్య‌క్షంగా ప్ర‌భుత్వంగానీ, అసెంబ్లీగానీ స్పందించ‌కుండా మ‌ధ్య‌లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హైకోర్టు తీర్పును స‌వాల్ చేయ‌డంలో ఆంత‌ర్యం ఏమిట‌న్న‌దే ఎవ‌రికీ అంతుబ‌ట్ట‌డం లేదు. ఇద్ద‌రు కాంగ్రెస్ ఎమ్మెల్యేల శాస‌న స‌భ్య‌త్వంతో ప్ర‌భుత్వానికి సంబంధం లేద‌నీ, అది అసెంబ్లీ తీసుకున్న నిర్ణ‌య‌మ‌నీ చెప్పిన టీఆర్ఎస్ నేత‌లు ఇప్పుడు సింగిల్ జ‌డ్జి తీర్పు అమ‌లును నిలిపివేయాల‌ని కోరుతూ హైకోర్టులో అప్పీల్ చేయ‌డాన్నిమ‌రో త‌ప్ప‌ట‌డుగుగానే ప‌లువురు నాయ‌కులు భావిస్తున్నారు.

హైకోర్టు తీర్పుపై….

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ న‌ర‌సింహ‌న్‌ ప్రసంగం సందర్భంగా శాసనమండలి చైర్మన్‌ స్వామి గౌడ్‌పై హెడ్‌ఫోన్‌ విసిరి గాయపరిచారంటూ కోమటిరెడ్డి, సంపత్‌లను సభ నుంచి బహిష్కరించడం, వారు ప్రాతినిథ్యం వహిస్తున్న నల్లగొండ, ఆలంపూర్‌ అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయినట్లు ప్రకటిస్తూ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేయడం తెలిసిందే. వాటిని సవాలు చేస్తూ ఇద్ద‌రు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించడం.. శాస‌న స‌భ్వ‌త్వాల ర‌ద్దు చెల్ల‌దంటూ హైకోర్టు తీర్పు ఇచ్చిన విష‌యం తెలిసందే. ఈ తీర్పు అమ‌లును నిలిపివేయాల‌ని హైకోర్టు ధర్మాసనం ఎదుట శుక్రవారం టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్‌రెడ్డితోపాటు మ‌రో 11మంది ఎమ్మెల్యేలు అప్పీల్‌ దాఖలు చేశారు.

బుధవారం విచారణకు…..

అయితే సింగిల్‌ జడ్జి ముందు కోమటిరెడ్డి, సంపత్‌ దాఖలు చేసిన వ్యాజ్యంలో ఈ 12 మంది ఎమ్మెల్యేలు ప్రతివాదులు కాదు. దాంతో నిబంధనల మేరకు అప్పీల్‌ దాఖలుకు కోర్టు అనుమతి కోరుతూ అనుబంధ పిటిషన్‌ కూడా దాఖలు చేశారు. అప్పీల్‌ను అనుమతించి అత్యవసరంగా విచారణ జరపాలన్న ఎమ్మెల్యేల తరఫు న్యాయవాది చేసిన‌ అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. అప్పీల్‌ దాఖలుకు అనుమతించాలన్న అనుబంధ పిటిషన్‌పై బుధవారం ముందు విచారణ జరుపుతామని పేర్కొంది. హైకోర్టు తీర్పుపై ప్ర‌తివాదులు స్పందించ‌కుండా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అప్పీల్ చేయ‌డంతో సీఎం కేసీఆర్ వ్యూహ‌మేమిటోన‌ని అంద‌రూ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*