ఆ మూడు స్థానాల‌కు య‌మ డిమాండ్‌….!

ఉమ్మడి ఖ‌మ్మం జిల్లాలో మూడు అసెంబ్లీ స్థానాల‌కు మాంచి డిమాండ్ ఉంది. రోజురోజుకూ ఆ స్థానాల్లో ఆశావ‌హుల సంఖ్య పెరుగుతోంది. అధికార టీఆర్ఎస్ నుంచేగాకుండా ప్రధాన‌ప్రతిప‌క్షం అయిన కాంగ్రెస్‌, టీడీపీ నుంచి పోటీచేసేంద‌ుకు చాలామంది క్యూలో ఉన్నారు. ప్రధానంగా టీఆర్ఎస్‌, కాంగ్రెస్ నుంచి ఆశావ‌హుల సంఖ్య ఎక్కువ‌గా ఉంటోంది. ఉమ్మడి ఖ‌మ్మం జిల్లాలో ఉన్న ప‌ది అసెంబ్లీ స్థానాల్లో మూడు జ‌న‌ర‌ల్ స్థానాలు ఖమ్మం, పాలేరు, కొత్తగూడెం. వీటిపై పట్టు పెంచుకునేందుకు చేస్తున్న అంతర్గత కసరత్తు రాజకీయ వర్గాల్లో ఉత్కంఠను రేపుతోంది. మిగిలిన ఏడు నియోజ‌క‌వ‌ర్గాల్లో సత్తుపల్లి, మధిర ఎస్సీ నియోజకవర్గాలుగా, ఇల్లెందు, వైరా, పినపాక, భద్రాచలం, అశ్వారావుపేట ఎస్టీ నియోజకవర్గాలుగా ఉన్నాయి. జనరల్‌ సీట్లలో ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ శాసనసభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

భిన్నమైన వాతావరణం…..

అయితే ఇటీవ‌ల జ‌రిగిన టీఆర్ఎస్ ప్లీన‌రీలో సిట్టింగులంద‌రికీ సీట్లు ఇస్తామ‌ని సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించారు. కానీ, క్షేత్రస్థాయిలో ఇందుకు భిన్నమైన వాతావ‌ర‌ణం ఉంది. 2014లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 స్థానాలకు గాను టీఆర్‌ఎస్‌ అన్ని స్థానాల్లో పోటీ చేసినా..కొత్తగూడెంలో మాత్రమే జలగం వెంకటరావు పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. ఇక ఖమ్మం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన పువ్వాడ అజయ్‌కుమార్‌ తదనంతర రాజకీయ పరిణామాల్లో అధికార పార్టీ తీర్థం పుచ్చుకోగా.. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రస్తుతం పాలేరు నియోజకవర్గ శాసనసభ్యుడిగా వ్యవహరిస్తున్నారు. ఇదిల ఉండ‌గా వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఈ మూడు స్థానాల్లో పోటీ చేసేందుకు టీఆర్ఎస్ నుంచి కూడా ఆశావ‌హుల సంఖ్య ఎక్కుగానే ఉంద‌నే ప్రచారం జ‌రుగుతోంది.

ఎంపీ కన్ను దానిపైనే….

ఖ‌మ్మం ఎంపీ పొంగులేటి శ్రీ‌నివాస్‌రెడ్డి వ‌చ్చే ఎన్నిక‌ల్లో అసెంబ్లీ స్థానానికి పోటీచేస్తార‌నీ, అయితే ఉన్న మూడు జ‌న‌ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎక్కడి పోటీచేస్తార‌న్న విష‌య‌మంలో మాత్రం అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే పొంగులేటి అటు కొత్తగూడెంతో పాటు ఖ‌మ్మం సీట్లపై క‌న్నేశారు. ముందుగా బిజినెస్ పేరుతో కొత్తగూడెంలో ప‌ట్టుకోసం ప్రయ‌త్నాలు చేశారు. అక్కడ జ‌ల‌గం పొంగులేటికి చెక్ పెట్టేందుకు త‌న‌కు చిర‌కాల శ‌త్రువు అయిన మంత్రి తుమ్మల సాయం కోరిన‌ట్టు టాక్‌. ఇలా లాభం లేద‌ని డిసైడ్ అయిన పొంగులేటి ఇప్పుడు ఖ‌మ్మం సిటీలో పువ్వాడ‌కు ఎర్త్ పెట్టే ప్రయ‌త్నాలు చేస్తున్నారు.

కాంగ్రెస్ కు పట్టున్న……

నిజానికి రాజకీయంగా ఖమ్మం, కొత్తగూడెం, పాలేరు నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు మంచి పట్టుంది. పాలేరు, కొత్తగూడెం నియోజకవర్గాల నుంచి 2004లో గెలుపొందిన సంభాని చంద్రశేఖర్, వనమా వెంకటేశ్వరరావులు అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో మంత్రులుగా పనిచేయడంతో ఈ నియోజకవర్గాలకు రాష్ట్రస్థాయి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామ క్రమంలో వైఎస్సార్‌సీపీ నుంచి పోటీ చేసిన వనమా వెంకటేశ్వరరావు కాంగ్రెస్‌ గూటికి చేరగా..ఆయనకు స్వయాన తోడల్లుడైన ఎడవల్లి కృష్ణ సైతం కాంగ్రెస్‌ పార్టీలో మాజీ కేంద్రమంత్రి రేణుకాచౌదరి ఆశీస్సులతో చేరారు. ఈ నియోజకవర్గంలో ఇరువురు నేతలు హోరాహోరీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. . ఇక కొత్తగూడెం కాంగ్రెస్ సీటు కోసం వ‌న‌మా వెంక‌టేశ్వ‌ర‌రావుతో పాటు ఎడ‌వ‌ల్లి కృష్ణ ఇద్దరూ ట్రై చేస్తున్నారు. అదే టైంలో క‌మ్యూనిస్టుల‌తో పొత్తు ఉంటే ఈ సీటు కోసం వాళ్లు కూడా ప‌ట్టుబ‌ట్టే ఛాన్సులు ఉన్నాయి.

టీడీపీలోనూ….

ఇక టీడీపీలోనూ ఈ మూడు సీట్ల కోసం స్వర్ణకుమారి, కోనేరు చిన్నితో పాటు కొత్తగూడెం పార్టీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మయ్య త‌దిత‌రులు రేసులో ఉన్నారు. ఇక్క‌డ టీడీపీకి కాస్తో కూస్తో ప‌ట్టు ఉండ‌డంతో టీడీపీ నుంచి కూడా ప‌లువురు వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకునేందుకు ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. ఏదేమైనా ప‌ది స్థాన‌ల్లో మూడు మాత్రమే జ‌న‌ర‌ల్ సీట్లు కావ‌డంతో ఆయా పార్టీల నాయ‌క‌త్వాల‌కు సీట్ల స‌ర్దుబాటు త‌ల‌నొప్పిగా మారే అవ‌కాశం ఉంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*