టిక్కెట్ ఇవ్వరా….? తడాఖా చూపిస్తాం…?

ముందస్తు ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు అసెంబ్లీని రద్దు చేసిన గంటలోనే 105 మంది అభ్యర్థులను ప్రకటించి సంచలనానికి తెరతీశారు. ఈ చర్యతో మొదట ప్రత్యర్థి పార్టీలకు షాక్ తగిలినట్లయింది. అయితే, రోజురోజుకు టీఆర్ఎస్ లో అసంతృప్తులు పెరిగిపోతుండటం, వారంతా కొత్తదారులు వెతుక్కునే పనిలో ఉండటంతో టీఆర్ఎస్ కు ఒకింత ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. ఇదే సమయంలో కాంగ్రెస్ లో చేరికలకు నేతలు మొగ్గు చూపుతుండటంతో ఆ పార్టీకి కొంత ఊపు వస్తోంది. ముఖ్యంగా ఈ నెల 12న తెలంగాణలో చేరికల హడావుడి బాగా ఉండనుంది. ఆ రోజు కాంగ్రెస్ ముఖ్యనేత గులాంబ నబీ ఆజాద్ రాష్ట్రానికి వస్తుండటంతో కాంగ్రెస్ లోకి పెద్దసంఖ్యలో నేతలు చేరే అవకాశం కనిపిస్తోంది. అయితే, టీఆర్ఎస్ కూడా అదే రోజున చేరికలకు ప్రణాళకలు వేస్తోంది.

కొత్త అభ్యర్థులకు సహకరించేది లేదు…

ఇంచుమించు అన్ని చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు కేటాయించారు కేసీఆర్. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు కూడా అందరికీ టిక్కెట్లు దక్కాయి. ఈ నేపథ్యంలో ఫిరాయింపు ఎమ్మెల్యేల స్థానాల్లో గత ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓడిన వారికి అవకాశం దక్కలేదు. దీంతో వారు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇక సిట్టింగ్ లు అయినా టిక్కెట్లు దక్కని నల్లాల ఓదేలు, బొడిగె శోభ కూడా భవిష్యత్ కార్యాచరణ రచిస్తున్నారు. నల్లాల ఓదేలు స్థానాన్ని ఎంపీ బాల్క సుమన్ కు పార్టీ కేటాయించగా, ఓదేలు మాత్రం ఇంకా టిక్కెట్ పై భరోసాతోనే ఉన్నారు. ఆయన తనకు టిక్కెట్ ఇస్తారనే నమ్మకం ఉందని, బాల్క సుమన్ కు సహకరించేది లేదని తెగేసి చెప్పారు. ఇక టిక్కెట్ దక్కని చొప్పదండి తాజా మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ కూడా పార్టీ తనకు అన్యాయం చేసిందనే భావనలో ఉన్నారు. ఆమె ఇండిపెండెంట్ గానైనా పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

కొత్త దారి వెతుక్కుంటున్న గులాబీలు…

ఆంధోల్ తాజా మాజీ ఎమ్మెల్యే బాబుమోహన్ కు కేసీఆర్ టిక్కెట్ ఇవ్వలేదు. దీంతో ఆయన బీజేపీ వైపు చూస్తున్నారని తెలుస్తోంది. బీజేపీ తరుపున బరిలోకి దిగే ప్రయత్నం చేస్తున్నారు. ఇక చెవెళ్ల స్థానాన్ని ఫిరాయింపు ఎమ్మెల్యే యాదయ్యకు ఇవ్వడంతో గత ఎన్నికల్లో పోటీ చేసిన రత్నం కాంగ్రెస్ వైపు అడుగులు వేస్తున్నారు. ఆయన చేరికను సబిత ఇంద్రారెడ్డి కొంత వ్యతిరేకిస్తున్నా ఆయన చేరిక మాత్రం దాదాపు ఖాయమైంది. ఇక జీహెచ్ఎంసీ పరిధిలోని ఉప్పల్, కూకట్ పల్లి, రాజేంద్రనగర్ అభ్యర్థులను కార్పొరేటర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అభ్యర్థులకు వ్యతిరేకంగా మీటింగ్ లు పెట్టుకుని వారికి సహకరించేది లేదని తీర్మాణాలు చేస్తున్నారు. ఇబ్రహీంపట్నం టిక్కెట్ దక్కని కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరేందుకు మొగ్గు చూసుతున్నారని తెలుస్తోంది. ఇక వరంగల్ జిల్లాకు చెందిన ప్రముఖ నాయకులు కొండా సురేఖ – కొండా మురళి దంపతులు సోమవారం వరంగల్ లో అనుచరులతో సమావేశమయ్యారు. వారు కాంగ్రెస్ పెద్దలతో టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక 23న వరంగల్ లో భారీ బహిరంగ సభ నిర్వహించి బలప్రదర్శన చేయాలని భావిస్తున్నారు. అయితే, 12వ తేదీనే వారు కాంగ్రెస్ లో చేరతారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇక ఖానాపూర్ టిక్కెట్ ఆశించి భంగపడ్డ రమేశ్ రాథోడ్ కూడా కాంగ్రెస్ తో చేరనున్నారు. ఇక మాజీ ఎమ్మెల్యేలు ఆకుల రాజేందర్, నందీశ్వర్ గౌడ్, ఎమ్మెల్సీ భూపతిరెడ్డి కూడా కాంగ్రెస్ లో చేరనున్నారు.

అదే రోజు టీఆర్ఎస్ లోకీ…

ఇదిలా ఉంటే కాంగ్రెస్ జోష్ ను చల్లార్చేందుకు 12వ తేదీనే టీఆర్ఎస్ లోకి కూడా చేరికలు ఉండేలా టీఆర్ఎస్ స్కెచ్ వేసింది. అదే రోజు మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి గులాబీ కండువా కప్పుకోనున్నారు. ఇక మాజీ ఎమ్మెల్యే సుద్దాల దేవయ్య కూడా టీఆర్ఎస్ లో చేరతారనే ప్రచారం జరుగుతోంది. ఆయనను చొప్పదండి నుంచి బరిలో దింపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టీడీపీతో పొత్తులో భాగంగా ఉప్పల్ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా వీరేందర్ గౌడ్ పోటీ ఖాయం కావడంతో కాంగ్రెస్ ఇంఛార్జిగా ఉన్న బండారి లక్ష్మారెడ్డి టీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయించుకున్నారు. వీరంతా కూడా 12వ తేదీనే టీఆర్ఎస్ లో చేరనున్నారు. మొత్తానికి రెండు పార్టీలకు చేరకలు ఉన్నా ఇప్పటికే అభ్యర్థుల ప్రకటన పూర్తయినందున టీఆర్ఎస్ లోకి తక్కువ ఉండగా, కాంగ్రెస్ లోకి మాత్రం భారీగా వలసలు ఉండనున్నట్లు కనపడుతోంది.